Tuesday, May 26, 2026
E-PAPER
Homeజాతీయంఎన్టీఏను మందలించిన సుప్రీంకోర్టు

ఎన్టీఏను మందలించిన సుప్రీంకోర్టు

- Advertisement -


గత వైఫల్యాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్వకపోవడం విచారకరం
కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ
మూడ్రోజుల్లో ఎన్టీఏ చైర్మెన్‌ 
అఫిడవిట్‌ దాఖలు చేయాలి
నీట్ ప్ర‌శ్నాపత్రం లీక్ కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని అత్యున్నత న్యాయస్థానం మందలించింది. నీట్‌ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావడంపై ఎన్టీఏకు వ్యతిరేకంగా ఫెడరేషన్‌ ఆఫ్ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఎఫ్ఎఐఎంఎ), యునైటెడ్ డాక్ట‌ర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌‌లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జ‌స్టిస్ పిఎస్ న‌ర్సింహ‌, జస్టిస్ అలోక్ ఆరాదేతో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది. ఎన్టీఏ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన నీట్ ప్రశ్నా పత్రం లీక్ కేసుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం విచారకరమని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. గతంలో తాము ఏర్పాటుచేసిన పర్యవేక్షణ, సంస్కరణ యంత్రాంగాలను ప్రస్తావిస్తూ.. వాటి అమలు ఏమైందో తెలియజేయాలని కూడా ఎన్టీఏను కోరింది.
‘గత వైఫల్యాల నుంచి ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలు నేర్వకపోవడం విచారకరం. ఈ అంశం గతంలోనూ న్యాయస్థానం దృష్టికి వచ్చింది. దీని కోసం నవంబర్ 14న ఓ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేయగా.. వాటిని ఎన్టీఏ అంగీకరిం చింది. అయితే.. వాటిని అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టిందో మేం తెలుసుకోవాల నుకుంటున్నాం. ఆ వివరాలకు సంబంధించి అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు మూడు రోజుల గడువు విధిస్తున్నాం. హై-ప‌వ‌ర్ మానిట‌రింగ్ క‌మిటీ చేసిన ప్ర‌తిపాద‌న‌ల గురించి ఎన్టీఏ చైర్మెన్ కె.రాధాకృష్ణ‌న్ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాలి’ అని ధర్మాసనం ఆదేశించింది.
కాగా.. పిటిషనర్ల తరపున న్యాయవాది తన్వి దూబె తన వాదనలను వినిపించారు. నీట్ యూజీ పరీక్ష ఆవశ్యకతను వివరిస్తూ.. ఈ అంశం సుమారు 23 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యంపై ఆధారపడి ఉందని ప్రస్తావించారు. ఎన్టీఏను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించాల‌ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆల్ ఇండియా మెడిక‌ల్ అసోసియేష‌న్ కోరింది. సుప్రీం రిటైర్డ్ జ‌డ్జితో క‌లిపి ఏర్పాటు చేసిన జ్యుడీషియ‌ల్ క‌మిటీ నేతృత్వంలో నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ను నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేసింది. ప్ర‌శ్నాప‌త్రాల‌ను డిజిట‌ల్ లాకింగ్ చేయాల‌ని పిటిష‌న్‌లో కోరింది. లోపాల‌ను గుర్తించేందుకు సెంట‌ర్ వైజ్ ఫ‌లితాల‌ను ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. యునైటెడ్ డాక్ట‌ర్స్ ఫ్రంట్ మ‌రో పిటీష‌న్ దాఖ‌లు చేసింది. ఎన్టీఏను సంపూర్ణంగా ర‌ద్దు చేయాల‌ని కోరింది. పార్ల‌మెంట్ చ‌ట్టంతో ఏర్పాటు చేసిన నేష‌న‌ల్ టెస్టింగ్ బాడీని ఏర్పాటు చేయాల‌ని తెలిపింది. పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌లు రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14, 15 ను ఉల్లంఘించిన‌ట్టు అవుతుంద‌ని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -