Tuesday, May 26, 2026
E-PAPER

భూ పిడుగు..!

- Advertisement -


భూముల ధరలు పెంచేందుకు రంగంసిద్ధం
ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు
ఇల్లు కొనాలన్నా, భూమి కొనాలన్నా సామాన్యులపై పెనుభారం
రిజిస్ర్టేషన్‌ చార్జీల పెరుగుదలతో ప్రజలకు ఇబ్బందులు
రియల్‌ ఎస్టేట్‌ మరింత ‌పడిపోయే ప్రమాదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌


ఒక ప్రభుత్వ ఉద్యోగి రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్‌ ‌రిజిస్ట్రార్‌‌ పరిధిలో ఓ అపార్ట్‌‌మెంట్‌‌లో త్రిబుల్‌ ‌బెడ్రూం ఫ్లాట్‌ ‌కొన్నారు. అక్కడ ఒక్కో చదరపు అడుగు భూమి ప్రభుత్వ ధర ప్రస్తుతం రూ.4,500 ఉన్నది. ఆ ఫ్లాట్‌ 1,701 చదరపు అడుగులు ఉన్నది. ఆ ఫ్లాట్‌‌ను రూ.76,54,500 విలువకు రిజిస్ర్టేషన్‌ ‌చేయించారు. దాని ప్రకారం రిజిస్ర్టేషన్‌ ‌ఫీజు రూ.4,59,270 కట్టారు. ఆ ప్రాంతంలో భూమి విలువను 30 శాతం చొప్పున పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ లెక్కన చదరపు అడుగు విలువ రూ.5,850 పెంచాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీని ప్రకారం ఆ ఫ్లాట్‌ విలువ రూ.99,50,850 అవుతుంది. ఈ లెక్కన రిజిస్ర్టేషన్‌ ‌ఫీజు కూడా పెరుగుతుంది. అంటే రూ.5,97,051 కట్టాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఆ ఉద్యోగి అదనంగా రూ.1,37,781 చెల్లించాలి.
వనస్థలిపురం పరిధిలోనే విజయవాడ జాతీయ రహదారి పక్కన చదరపు గజం భూమి రూ.44,900 ఉన్నది. ఒక వ్యక్తి 150 చదరపు గజాల ప్లాటు కొనాలనుకుంటే రూ.67,35,000 అవుతుంది. ఈ భూమికి రిజిస్ర్టేషన్‌ ‌ఫీజు రూ.4,04,100 కట్టాలి. ఆ ప్రాంతంలో భూమి విలువను ప్రభుత్వం 50 శాతం పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ లెక్కన చదరపు గజం విలువ రూ.60 వేలకు పెరుగుతుంది. అంటే 150 చదరపు గజాల స్థలానికి రూ.90,00,000 అవుతుంది. ఆ భూమికి రిజిస్ట్రేషన్‌ ‌ఫీజు రూ.5,40,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ వ్యక్తి అదనంగా రూ.1,35,900 కట్టాలి.

వనస్థలిపురం సబ్‌‌ రిజిస్ట్రార్‌ ‌కార్యాలయం పరిధిలోనే పోలీసు స్టేషన్‌ పక్కన ‌అపార్ట్‌‌మెంట్‌‌ లో ఫ్లాటు విలువ చదరపు అడుగు రూ.2,500 ఉన్నది. దాన్ని రూ.మూడు వేల వరకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. చదరపు అడుగు రూ.2,500 అయితే 1200 చదరపు అడుగుల ఫ్లాటుకు రూ.30,00,000 అవుతుంది. ఆ ఫ్లాటుకు రిజిస్ట్రేషన్‌ ‌ఫీజు రూ.1,80,000 కట్టాలి. భూమి విలువ రూమూడు వేలకు పెరిగితే ఆ ఫ్లాటు విలువ రూ.36,00,000 అవుతుంది. ఈ లెక్కన ఆ ఫ్లాటుకు రిజిస్ట్రేషన్‌ ‌ఫీజు రూ.2,16,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ ఫ్లాటుకు రిజిస్ట్రేషన్‌ ‌ఫీజు అదనంగా రూ.36,000 చెల్లించా లి. ​ఇది హైదరాబాద్‌‌లో ఉండే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగుల పరిస్థితి మాత్రమే కాదు. రాష్ట్రంలో ఉండే ప్రజలు, సామాన్యుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలను సవరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇలా భూమి విలువను ప్రభుత్వం పెంచితే రిజిస్ట్రేషన్‌ ‌చార్జీలు కూడా పెరుగుతాయి. అంటే సామాన్యులపై రిజిస్ట్రేషన్ల చార్జీలు పెనుభారంగా మారనున్నాయి. ఇప్పటికే స్టాంప్స్‌ అండ్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌శాఖ అధికారులు భూముల ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. ఏ ప్రాంతంలో ఎంత సవరించాలనే దానిపై అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం, వ్యవసాయేతర, గృహాలు, వాణిజ్యం వంటి అన్ని కేటగిరీలకు సంబంధించిన ధరలను సవరించాలని భావిస్తున్నది. భూముల ధరలను పెంచడం వల్ల పెరిగే రిజిస్ట్రేషన్ల చార్జీల భారమంతా ప్రజలపైనే పడుతుండటం గమనార్హం. అయితే హైదరాబాద్‌లాంటి మహానగరంలో ఇప్పటికే సామాన్యులు ఇల్లు కొనే పరిస్థితి లేదు. భూముల ధరలను చూస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. వేతనాలపైనే ఆధారపడి జీవించే కుటుంబాలకు ఇల్లు కలగానే మిగిలిపోతున్నది. ఎందుకంటే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆరోగ్యం, ఇంటి అద్దె వంటి వాటికే వారి జీతం సరిపోతున్నది. ప్రస్తుతం ఉన్న భూముల ధరలతోనే ప్రజలు ఇల్లు, భూమి కొనలేక సతమతమవుతున్నారు. ప్రభుత్వం వాటి ధరలను సవరిస్తే మరింత భారం ప్రజలపైనే పడనుంది.

అశాస్త్రీయంగా భూముల ధరలు పెంపు
రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థలు బహిరంగ మార్కెట్‌లో భూముల ‌విలువను అశాస్ర్తీయంగా పెంచేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. రహదారుల పక్కన భూముల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పట్టణాల్లో ఇల్లు, గ్రామీణ ప్రాంతాల్లో భూములను సామాన్యులు కొనలేని పరిస్థితి ఉన్నది. అయితే ప్రభుత్వ విలువకు, మార్కెట్‌ ‌విలువకు భారీగా వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసాన్ని తగ్గించడం కోసమే భూముల ధరలను సవరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ ఆ పెంచే భారమంతా భూములను కొనే వారిపైనే పడుతున్నది.
భూముల ధరలను పెంచడం వల్ల రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ఆదాయం రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ డబ్బంతా రిజిస్ట్రేషన్‌ ‌చార్జీల రూపంలోనే ప్రభుత్వానికి సమకూరుతుంది. అంటే ప్రజలు భూములు లేదా ఇల్లు, ఇంటి స్థలాలు కొంటేనే లావాదేవీలు జరుగుతాయి. అప్పుడే ప్రభుత్వానికి నిధులు సమకూరుతాయి. ప్రస్తుతం ఉన్న భూమి ధరలతోనే ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రభుత్వం భూముల ధరలను పెంచితే ఆ భారమంతా ప్రజలపైనే పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం మందకొడిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూముల ధరలను పెంచుతుండడం వల్ల ఆ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ ‌రంగంపై విపరీతంగా పడుతుందని చెప్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం మరింత పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.19,540 కోట్ల రాబడి లక్ష్యం
2026-27 ఆర్థిక సంవత్సరానికి స్టాంప్స్‌ అండ్‌ ‌రిజిస్ర్టేషన్‌ ‌శాఖ రూ.19,540.54 కోట్ల రాబడిని లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో భాగంగానే భూముల ధరలను పెంచుతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్‌ అండ్‌ ‌రిజిస్ర్టేషన్‌ ‌శాఖ రూ.19,087.26 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.15,251.03 (79.90 శాతం) కోట్ల నిధులు వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.18,228.82 కోట్ల నిధులు రాబట్టాలన్న లక్ష్యం ఉంటే రూ.8,473.21 (46.48 శాతం) కోట్లు మాత్రమే వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్ల లక్ష్యం నిర్దేశించుకుంది. రూ.14,295.56 (77.27 శాతం) కోట్ల నిధులొచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15,600 కోట్ల ఆదాయం రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.14,228.19 (91.21 శాతం) కోట్ల నిధులు ప్రభుత్వానికి వచ్చాయి.

‌భూముల ధరలను శాస్త్రీయంగా సవరించాలి : సారంపల్లి మల్లారెడ్డి
భూముల ధరలను శాస్త్రీయంగా సవరించాలని రైతు సంఘం సీనియర్‌ ‌నాయకులు సారంపల్లి మల్లారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిషన్‌‌ను నియమించాలని కోరారు. ప్రభుత్వం ఏకపక్ష‍ంగా భూముల ధరలను పెంచితే ప్రజలపై భారాలు పడే ప్రమాదం లేకపోలేదని అన్నారు.

పెట్టుబడిదారులకు భూముల ధారాదత్తం
రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం భూములను ధారాదత్తం చేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. విదేశీ బహుళ జాతి సంస్థలకు ప్రభుత్వ భూములను కారుచౌకగా కట్టబెడుతున్నది. కానీ పేదలు, సామాన్యులకు మాత్రం 60 గజాల ఇంటి స్థలాన్ని మాత్రం ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు సైతం ఇవ్వడం లేదు. అక్కడ నివసించే పేదలపైకి బుల్డోజర్లను తీసుకెళ్తున్నది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చివేయడమే ఇందుకు నిదర్శనం. ఆ ఘటనతో ప్రభుత్వం అభాసుపాలైంది. ఇంకోవైపు కార్పొరేట్‌, ప్రయివేట్‌ ‌సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఓట్లేసి గెలిపించిన ప్రజల ఇంటి నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ఇస్తున్నా డిమాండ్‌‌కు తగ్గట్టుగా ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. అది కూడా సొంత ఇంటి జాగా ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఇంటి జాగా లేని వారి పరిస్థితి అయోమయంగా తయారైంది. భూముల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇంటి స్థలం కొనలేరు. సొంతి ఇంటి జాగా లేకపోవడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లును ఇవ్వడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -