మండల కేంద్రాల్లో రైస్ మిల్లులు, గోదాంలకు స్థలాలు
మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లించాం
29 నెలల్లో మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల రుణాలు :
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
8 వేల సమాఖ్య భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ర్టంలోని ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు నెలకొల్పుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీమార్ట్,
బిగ్‌బజార్‌లకు పోటీగా ఉండేలా అద్భుతంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో సూపర్ బజార్ల ఏర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావాలి. రైతుల ఉత్పత్తులకు మార్కెట్ దొరకాలి. మహిళా సంఘాలకు ఆదాయం రావాలన్నదే ఈ ఆలోచన వెనుక ఉన్న లక్ష్యం’ అని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా శక్తి సూపర్ బజార్లలో వాటాదారుగా ఉంటుందనీ, రైతులు పండించే మంచి పంటలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు వీటి ద్వారా వినియోగదారులకు చేరేలా చూడాలన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలకు రూ.1,390 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. మండల స్థాయిలో రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు నిర్మించుకోవాలని సూచించారు. వాటికి అవసరమైన చోట 100 ఎకరాల వరకు భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్ర పెరగాలని సీఎం అన్నారు. ఒకే రోజు, ఒకే సమయంలో 8 వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని అన్నారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉండటం అంటే కేవలం సమావేశాల స్థలం ఇవ్వటం కాదనీ, వారి ఆర్థిక కార్యకలాపాలకు, శిక్షణకు, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత వేదికను నిర్మించడమని చెప్పారు.మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అడ్డుకునేందుకు క్రుటలు
తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ పథకంలో సర్కార్ ఆర్టీసీకి రూ.10 వేల కోట్ల వరకు చెల్లించిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదని కొందరు రెచ్చగొట్టారనీ, ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. మహిళల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదనీ, ఆ కుట్రలను తిప్పికొట్టి ఉచిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.
బస్సులకు యజమానులుగా మహిళలు
మహిళలను బస్సులకు యజమానులుగా మార్చాలన్న ఆలోచనతో మహిళా సంఘాల ద్వారా 1,000 బస్సులు కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికను అమలు చేసినట్టు చెప్పారు. అందులో భాగంగా జూన్ 5న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 553 బస్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
సోలార్ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీ వంటి పెద్ద సంస్థలే గుర్తుకు వచ్చే పరిస్థితి రాష్ర్టంలో మారిపోనుందనీ, 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రిలయన్స్ వంటి సంస్థలు నిర్వహించే పెట్రోల్ బంకుల వ్యాపారంలోనూ సంఘాలను భాగస్వాములుగా చేస్తున్నామని సీఎం వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో, ముఖ్యమైన ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో పలు జిల్లాల సమాఖ్యలతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా తాము ఇప్పటివరకు దాదాపు 27 లక్షల సంపాదించామంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు. మహిళా సంఘాలు చేపడుతున్న కొన్ని వ్యాపారాల్లో నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయని అన్నారు.
ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా బ్యాంకులకు వందకు వంద శాతం రీపేమెంట్ చేసిన నిర్మల్ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మెయిన్ రోడ్డులో వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే స్థలాన్ని కేటాయించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారెలా ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను త్వరలో పంపిణీ చేస్తామనీ, ఈసారి చిలుకపచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వబోతున్నామని అన్నారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
మహిళా సాధికారితకు పెద్దపీట : ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
రాష్ర్ట ప్రభుత్వం మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గతంలో మహిళా సంఘాలకు సొంత కార్యాలయాలు లేకపోవడం వల్ల గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. పంచాయతీ కార్యాలయాల్లోనో, సభ్యుల ఇండ్లల్లోనో, చివరకు స్థలం లేక చెట్ల కింద కూర్చొని సమావేశాలు నిర్వహించుకునే దుస్థితి ఉండేదన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ మహిళలకు గౌరవప్రదమైన రీతిలో శాశ్వత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 8 వేల మహిళా సమాఖ్య కార్యాలయాల నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దనసరి అనసూయ సీతక్క, డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్, మహిళా కమిషన్ చైర్మెన్ గద్వాల్ విజయ లక్ష్మి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్, ఎంఎల్ ఏలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికొ మహిళా సూపర్ బజార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



