Tuesday, May 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి..

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచండి..

- Advertisement -

కనీస వేతనాల పెంపులోని లోపాలను సవరించండి
రామోజీ ఫిలింసిటీ పరిధిలోని పేదలకు ఇండ్ల స్థలాలిప్పించండి..
సీఎం రేవంత్‌‌రెడ్డికి సీపీఐ(ఎం) వినతి
నెలరోజుల్లో పరిష్కరిస్తాం : సీఎం హామీ
సామినేని హత్యపై సిట్‌కు సీఎం భరోసా : జాన్‌‌వెస్లీ
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వర్షాల సీజన్‌ ప్రారంభమవుతుండటంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరింది. రామోజీ ఫిలిం సిటీ పరిధిలోని 700 మంది పేదలకు ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేసింది. కనీస వేతనాల పెంపులో లోపాలున్నాయనీ, సెమీ స్కిల్డ్‌, స్కిల్డ్‌, హై స్కిల్డ్‌ ‌కార్మికులకు ప్రయోజనం కలిగేలా, డీఏ విషయంలో న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. సామినేని రామారావు హత్య కేసులో నిందితులను శిక్ష‍ించే విషయంలో జాప్యం జరుగుతున్నదనీ, సీఎం రేవంత్‌‌రెడ్డితో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యలు, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌‌రావు, టి.సాగర్‌, నున్నా నాగేశ్వరరావు, పి.ప్రభాకర్‌, మల్లు లక్ష్మి, మధిర డివిజన్‌ ‌కార్యదర్శి గోపాలరావు, సామినేని స్వరాజ్యం, తదితరులు భేటీ అయ్యారు.

సీఎం దృష్టికి పంటల కొనుగోళ్లతో పాటు పలు ప్రజా సమస్యలను తీసుకెళ్లారు. అనంతరం జాన్‌‌వెస్లీ మీడియాతో మాట్లాడి భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) సీనియర్ నేత సామినేని రామారావును రాజకీయ కక్షతో కిరాతకంగా నరికి చంపి ఏడు నెలలు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడం, పిటిషన్ ఇచ్చినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో చర్చించి సిట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్ల మీద ఉందనీ, మార్కెట్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, వర్షాలు వస్తే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని తమ బృందం సీఎం దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారని తెలిపారు. ఇటీవల కార్మికుల కనీస వేతనాలకు సంబంధించి ప్రభుత్వం చేసిన సవరణలు కేవలం ‘అన్‌స్కిల్డ్‌ వర్కర్లకు మాత్రమే కొంతవరకు ఉపయోగపడేలా ఉన్నాయని, సెమీ-స్కిల్డ్, స్కిల్డ్, హై-స్కిల్డ్ కార్మికులకు ప్రయోజనం చేకూరలేదని ఎత్తిచూపామన్నారు. కరువు భత్యం కూడా సరైన పద్ధతిలో లేదనీ, ఈ అసమానతలను పరిశీలించి సరిచేయాలని సీఎంను కోరగా వాటిని సరిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారని చెప్పారు.

రెండు లక్ష‍ల ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చాలనీ, వెంటనే రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకల్లా నోటిఫికేషన్లను జారీ చేయాలని సీఎం రేవంత్‌‌రెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు. ప్రాజెక్టులకు సేకరిస్తున్న అసైన్డ్‌ ‌భూముల రైతులకు పట్టాభూముల వారితో సమానంగా పరిహారం ఇవ్వడం లేదని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరామన్నారు. అసైన్డ్‌ ‌భూములు ఎక్కువగా దళితులు, పేదల వద్దనే ఉన్నాయనీ, వారికి అన్యాయం చేయొద్దనీ, వారికి పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. రామోజీ ఫిలిం సిటీ పరిధిలో పేదలకు 700 ఇళ్ళస్థలాల పట్టాలు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చారనీ, ప్రస్తుతం ఫిలిం సిటీ యాజమాన్యం అక్కడ కాంపౌండ్ వాల్ కట్టి, సెక్యూరిటీని పెట్టి పేదలను ఇళ్లు కట్టుకోనివ్వడం లేదనే విషయాన్ని సీఎంకు వివరించామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ నెల రోజుల్లో అధికారులతో మాట్లాడి ఇండ్ల స్థలాలను పేదలు దక్కేలా తగిన చర్యలు తీసుకుంటామనీ, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మూసీ నది పక్కన లేదా బఫర్ జోన్లలో ఉండే పేదల ఇండ్లను కూల్చివేసే చర్యలపై కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో మౌలిక వసతులు, టీచర్స్, లెక్చరర్స్, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు. ప్రయివేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తూ ప్రజల నుంచి ఏటా రూ. 25,000 కోట్లకు పైగా దోచుకుంటున్నాయని సీఎం ఎదుట ప్రస్తావించామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని విన్నవించామన్నారు. ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌ ‌జిల్లాలో పెండింగ్‌‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలంటూ సీఎంను కోరగా… ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి, అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చారని జాన్‌వెస్లీ తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -