Tuesday, May 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యక్షంగానే 'సహకార' ఎన్నికలు నిర్వహించాలి

ప్రత్యక్షంగానే ‘సహకార’ ఎన్నికలు నిర్వహించాలి

- Advertisement -


కార్మికుల కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-భువనగిరి

రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలను నామినేటెడ్‌ పద్ధతిలో కాకుండా ప్రత్యక్షంగానే నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అధ్యక్షతన సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలను ఎన్నికలు నామినేటెడ్‌ పద్ధతిలో నిర్వహించడం సరైంది కాదన్నారు. రాజకీయ పునరావాసం, తమ పార్టీ కార్యకర్తలు, సొంత మనుషులకు పదవులు కట్టబెట్టడం కోసమే నామినేటెడ్‌ పద్ధతి అంటున్నారని విమర్శించారు. వెంటనే సహకార సంఘాల ఎన్నికలను ప్రత్యక్షంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో కోటి మంది కార్మికులు కనీస వేతనం నిర్ణయించలేదని ప్రభుత్వం.. యజమానుల పక్షం వహిస్తోందని అన్నారు. మారిన అవసరాలు, పెరిగిన ధరలను లెక్కలోకి తీసుకోకుండా.. కేవలం ఉత్తర భారతదేశంలో కార్మికుల పోరాటాలను చూసి ఆదరాబాదరాగా ఇక్కడ కార్మికులను భ్రమల్లో పెట్టడానికి కనీస వేతనం ప్రకటించారని ఆరోపించారు. వెంటనే కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. పత్రికలు, మీడియా సంస్థలు, ఇతర రాజకీయ నాయకులపై కేంద్ర మంత్రి బండి సంజరు పరువు నష్టం దావా వేస్తున్నట్టు సమాచారం వస్తుందని, ఇది బీజేపీ నాయకత్వంలో అసహనానికి నిదర్శనమని అన్నారు. కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా సమాధానం చెప్పుకోలేక బెదిరింపులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు.

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికి అనేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నేలపైనే ఉందని తెలిపారు. అకాల వర్షం వస్తే వేల క్వింటాళ్ల ధాన్యం నేలపాలవుతుందని ఆందోళన వెలిబుచ్చారు. వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద తూకాలు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, నాయకులు సిరిపంగి స్వామి, బొడ్డుపల్లి వెంకటేష్‌, దయ్యాల నర్సింహ, ఎంఏ ఇక్బాల్‌, గడ్డం వెంకటేశ్‌, వనం ఉపేందర్‌, ప్రజాసంఘాల నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, గంటపాక శివ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -