నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి సింగరేణి పరిధిలో జరిగిన ఒక బొలెరో జీపు ప్రమాద ఘటన ఇప్పుడు ఆ సంస్థలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రమాదం జరిగిన తీవ్రత కంటే, దానికి సంబంధించిన ఫోటో మీడియా చేతికి ఎలా చిక్కిందనే అంశంపైనే ఇప్పుడు సింగరేణి అధికార యంత్రాంగం జుట్టు పీక్కుంటోంది. ఇంటి గుట్టు రట్టు చేసింది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు సింగరేణి వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగింది? ఎంక్వైరీల పర్వం!
సాధారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ పరిధిలో జరిగే ఏ చిన్న సంఘటనైనా బయటకు రాకుండా అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈ బొలెరో జీపు ప్రమాద ఫోటోలు క్షణాల్లో మీడియాకు చేరడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. దీని వెనుక ఎవరున్నారు? సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎవరైనా కుట్ర పన్నారా? అనే కోణంలో సింగరేణి ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే, ఏకంగా సీబీసీఐడీ స్థాయి రేంజ్‌లో అంతర్గత ఎంక్వైరీలు మొదలయ్యాయి.
రంగంలోకి దిగిన ప్రత్యేక ‘యాక్షన్ టీమ్’
బొలెరో-డంపర్ ప్రమాద ఘటన లీకేజీ వ్యవహారంపై ప్రత్యేక యాక్షన్ టీం రంగంలోకి దిగింది. వరుస విచారణలతో ఉద్యోగుల్లో దడ పుట్టిస్తోంది. సమాచారం లీక్ చేసిన ఆ ‘బూచోడు’ ఎవరనేది తేల్చేవరకు వదిలేదే లేదంటూ అధికారులు కసిగా ఉన్నారు.
ఎంకిపెళ్లి… సుబ్బి చావుకొచ్చింది: బాధితుడి ఆవేదన
ఈ ప్రమాద లీకేజీ వ్యవహారం చివరకు ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు తయారైంది. ప్రమాద తీవ్రతను చూపిద్దామని ఫోటో తీసి షేర్ చేసిన సదరు బాధితుడు ఇప్పుడు లబోదిబోమంటున్నట్లు తెలుస్తోంది. ఫోటో ఇచ్చి అనవసరంగా పీకల మీదకు తెచ్చుకున్నానే అంటూ సదరు బాధితుడు ఆందోళన చెందుతున్నాడు. అధికారుల టార్గెట్ మొత్తం ఇప్పుడు అతనిపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
రూల్స్ అతిక్రమిస్తే పోస్టు ఉష్ కాకే
నేనే రాజు నేనే మంత్రి అంతా మా ఇష్టం అన్న చందంగా సింగరేణి యాజమాన్యం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. సంస్థ నిబంధనలను అతిక్రమించి, అంతర్గత విషయాలను భద్రతా వలయం దాటించిన వారిపై వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. తప్పుచేస్తే ఎంతటి వారైనా సరే పోస్టు ఉష్ కాకి అవ్వడం ఖాయమనే సంకేతాలు పంపుతున్నారు.
మీడియాపై నిషేధ ఆంక్షలు..?
ఈ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు భవిష్యత్తులో ఫోటోలు కాదు కదా కనీసం గాలి కూడా చొరబడకుండా మైనింగ్ ఏరియాను కట్టుదిట్టం చేసే పనిలో నిమగ్నమయినట్లు సమాచారం. ఈసారి మీడియాకు ఎలాంటి లీకులు అందకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సత్తుపల్లి సింగరేణి ఏరియా పరిధిలో మీడియాపై నిషేధ ఆంక్షలు విధించే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఓపెన్ కాస్ట్ పరిసరాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాల కదలికలపై నిఘా తీవ్రం చేయనున్నారు. మొత్తానికి ఒక బొలెరో జీపు ఫోటో సత్తుపల్లి సింగరేణిలో రేపిన దుమారం అంతా ఇంతా కాదు. మరి ఈ అంతర్గత విచారణలో ఆ ఇంటి దొంగ దొరుకుతాడో లేదో వేచి చూడాలి మరి.



