Friday, June 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిధ్వంసం చేయదలిస్తే, యుద్ధమే అక్కర్లేదు

విధ్వంసం చేయదలిస్తే, యుద్ధమే అక్కర్లేదు

- Advertisement -

వివేచన గలవాడి అభిప్రా యాన్ని మూర్ఖుడు యధాతధంగా వెలిబుచ్చలేడు. వాడికి అర్థమైన రీతిలో అర్థమైనంతే చెపుతాడు. దాన్ని మనం లెక్కలోకి తీసుకోనక్కర లేదు. వరుడు వినేది ఒకటి. అర్థం చేసుకునేది మరొకటి ఉంటుంది -బెట్రెండ్ రస్సెల్. ‘దేశభక్తి అనే పదం, తమ వైఫల్యాలను కప్పి పుచ్చకునేందుకు మూర్ఖ పాల కులు వాడే ముసుగు’- అన్నాడు మరొక తత్త్వవేత్త. ఆబద్దాల్ని, గట్టిగా నమ్మేవాళ్లు మనమొక నిజాన్ని చెప్పినప్పుడు ‘అధారమేమిటీ?’ -అని నానా యాగీ చేస్తారు. వాళ్లు నమ్మే అబద్దాలకు ఆధారాలేమున్నా యోనన్నది మాత్రం వారు ఆలోచించుకోరు. ఇరాన్‌లో బాంబులు పేలుతున్నా, మన భారతదేశం ప్రశాంతంగానే ఉంది. అందుకు మోడీ నిర్ణయాలే కారణం అంటున్నారు ఆయన అంధభక్తులు. వాస్తవమే మంటే అసలు అక్కడ యుద్ధాలు మొదలుకాకముందే, మన దేశంలో విద్వేష యుద్ధం పన్నేండేండ్లుగా నడుస్తోంది. విదేశాంగ విధానం లోపించి, పెట్రోలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్యులు బతకలేకపోతున్నారు. ట్రంప్‌‌నకు భయపడి, మోడీ చేస్తున్న గులాంగిరితో దేశ ప్రతిష్ట పూర్తిగా ధ్వంసమైంది. చావుకు యుద్ధమే అక్కరలేదు. ఈ దేశ ప్రజల చావుకు మన విశ్వగురువు తగిన బందోబస్తు చేస్తూనే వచ్చాడు. గాలి, కాలుష్యం, నీరు కాలుష్యం, ప్లెఓవర్లు కూలిపోయి, విమానాలు కూలిపోయి, రైలు-రోడ్డు ప్రమాదాలు జరుగుతూ.. హత్యలు, మానభంగాలు, హాస్పిటల్స్ లో ఆక్సిజన్‌ లేక పోవడాలు- గ్యాస్‌ లేక, కరెంటు లేక కట్టెల పొయ్యిని వెతు‌కునే స్థితి తెచ్చింది మన విశ్వగురుడే కదా? హోటళ్లు, హాస్టళ్లూ మూతపడే విధంగా పరిస్థితిని మురగబెట్టింది ఈ దేశంలోని ఒక టెలిప్రాంప్టర్ రీడరేకదా?

మల్ మల్ ధోయే శరీర్ కొ/ ధోయేన మన్‌క మైల్
నహాయె గంగా గోమతి / రహే జైల్ కె బైల్
– అన్నాడు కబీర్.

క్రైస్తవ దేశం అమెరికా, యూదుల దేశం ఇజ్రాయిల్‌లు కలిసి పర్మిషన్ ఇస్తే గాని, ముస్లిం దేశమైన ఇరాన్‌‌కు పోయి చమురు తెచ్చుకునే పరిస్థితిలో లేడు ఈ గల్గొటియా గురువు! అతనూ, అతని అంధభక్తులూ కలిసి ఈ దేశాన్ని ‘హిందూ రాష్ట్ర’ గా మారుస్తారట! కాస్త, మైండ్లో మెదడుందా? అని అడుగుతున్నారు సామాన్య పౌరులు. గాజు భవనాల్లో ఉండేవారు ఇతరుల ఇళ్లపైకి రాళ్లు విసరకూడదు – కాని, అంత పరిజ్ఞానం లేని ఇండియన్ హోం మినిష్టర్‌ అమిత్‌షా – అస్సాంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ తమ పదిహేనేళ్ల పాలనలో అస్సాం హెల్త్ కేర్ బడ్జెట్లోంచి ప్రతియేటా 150 కోట్లు దిగమింగింది’ అని అన్నాడు. ఆ పని చేసింది హిమంత బిశ్వశర్మ. 2006 – 2014 మధ్య కాలంలో అస్సాం ఆరోగ్య శాఖామంత్రి అయనే! ఆ కాంగ్రెస్ మంత్రినే తమలో చేర్చుకుని శుద్ధి చేసి- బీజేపీ, అతణ్ణి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది! ఆయన చేసిన అవినీతిని కాంగ్రెస్ పై రుద్ది – ప్రస్తుత తమ ముఖ్యమంత్రి సచ్చీలుడు అని ప్రకటించుకున్నాడు శీలవంతుడైన అమిత్ షా – దేశ ప్రజలకు విషయాలు అర్థం కావన్న భ్రమలో ఉన్నట్టుంది హోమ్ శాఖా మంత్రి.

‘తక్కువ ప్రతిభ ఉన్న మందబుద్ధులకే అమితమైన గర్వం, అహంకారం, తమపై తమకు విశ్వాసం ఉంటాయి! కారణం ఏమిటంటే- ఇలాంటి మూర్ఖుల చుట్టూ, ఇలాంటి వారే మరికొంత మంది చేరి ప్రశంసలు గుప్పిస్తుంటారు’ అని చెప్పినవారు డచ్ దేశపు మానవవాది -డిసిడిరియస్ ఎరాన్‌మస్! ఆయన 1509లో చెప్పినా, కొందరికి విషయం ఇప్పటికీ అర్థం కాదు. ముఖ్యంగా ఆరెస్సెస్ వారికి అర్థమైతే ‘భారత్ మాతాకీ జై’ నినాదాన్ని, ‘జైహింద్‌’-నినాదాన్ని వదిలేయాలి. ఎందుకంటే, ముస్లింలను ద్వేషించే ఈ సంస్థ సభ్యులు, ‘భారత్ మాతాకీ జై’ నినాదాన్ని రూపొందిం చింది ఒక ముస్లిం – అజీముల్లాఖాన్ అని తెలుసుకోవాలి! అలాగే ‘జైహింద్‌’కు రూపకల్పన చేసినవాడు అబిద్ హసన్- హైదరాబాదీ ముస్లిం అని తెలుసుకున్నారో లేదో-తెలుసుకోకపోతే, ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది. అయితే, కాషాయ దేశభక్తులు అసలైన చరిత్ర తెలుసు కోగలుగుతారా?’ అని ప్రశ్నించినవాడు మాత్రం పినరయ్ విజయన్, కేరళం మాజీ ముఖ్యమంత్రి. ఈయనకే కాదు దేశంలోని కొట్లాది మంది భారతీయుల క్కూడా ఈ అనుమానం ఉంది.

మోడీ దినచర్యను బాగా గమనించి, ఒక జర్నలిస్ట్ ఈ విధంగా రాశాడు-రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి అంటే ఎంత కష్టం? ఎంత కష్టం? ప్రఖ్యాత బ్యాండ్ జార్జియా ఆర్మానీ సూటు ధరించాలి. కెన్నెత్ కోల్ షూ వేసుకుని, మొవాడో వాచ్ పెట్టుకోవాలి. మేకప్ చేయించుకుని, కూపర్ విజన్ సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. హెయిర్ కేర్, ఫెర్ఫూమ్ అయ్యాక, ఐఫోన్ చేతిలోకి తీసుకోవాలి. రిహార్సల్స్, లైట్స్, కెమెరా, యాక్షన్, డైరెక్షన్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్ఫీలు – ఖరీదైన మష్రూమ్ రోటీతో లంచ్ -రెస్ట్. తిరిగి వేరే సూట్ ధరించి, రిపీట్ మోడ్ లో పనిచేయాలి. ఎంత కష్టం? ఎంత కష్టం? ఇంత కష్టపడి అహారాత్రులు దేశం కోసం పనిచేస్తుంటే వారి బీజేపీ పార్లమెంట్ మెంబర్ ఇలా చెపుతాడేమిటో- “నరేంద్ర మోడీ పదవి నుండి తొలగితే చాలు. మరుసటి రోజు అతను జైల్లో ఉంటాడు. ఇక, జీవితమంతా కూడా అక్కడే గడుపుతాడు” అని! ఇదొక్కటే కాదు, సోషల్ మీడియాలో సుబ్రహ్మణ్య స్వామి, మోడీ గురించి చెప్పిన విషయాలు తిరుగుతూనే ఉన్నాయి. ఆసక్తి గల వారు వెతుక్కోవచ్చు.మోడీ మిత్రులు కొనేసిన మీడియా సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేక, కొందరు బయటకు వచ్చేసి, స్వతంత్ర జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు. జనానికి కొన్ని కొన్ని వాస్తవాలు చేరవేస్తున్నారు. అలాంటి వారిలో ఓ స్వతంత్ర జర్నలిస్ట్ కవర్ చేసిన సంఘటన ఇలా ఉంది- ఎలక్షన్ ప్రచార సభ ముగించుకుని మోడీ తిరిగి వెళ్లిపోతుంటే, కొందరు గ్రామస్తులు ఆయన కాన్వాయ్‌‌ని ఆపారు. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.

‘ఓ అదెంత పని? చెప్పండి చిటికెలో తీర్చేస్తానన్నాడు. గ్రామస్తులు రెండు సమస్యలున్నాయని చెప్పారు. 1. ఆ ఊళ్లో ఆసుపత్రి ఉంది. కాని డాక్టర్ లేడు. ఆ మాట వినగానే మోడీ తన ఐఫోన్ తీసి, ఫొన్ కలిపి ఎవరితోనో ఏడు నిమిషాలు మాట్లాడాడు. ‘‘అయి పోయింది! మీ అసుపత్రికి డాక్టర్ సాబ్‌ వస్తాడు- సరే- ఇంకో సమస్య అన్నారుకదా? అదేమిటో చెప్పండి!’’- అని అడిగాడు. “ అయ్యా! మా ఊరి దరిదాపుల్లో ఎక్కడా సెల్ సిగ్నల్ రాదు. దయచేసి ఓ సెల్ టవర్ పెట్టించండి’’ అని అడిగారు గ్రామస్తులు. మోడీ మొహం వేలాడేసి – ‘‘కాన్వాయ్‌‌ని ముందుకు పోనీ యండి!’’ అని ఆర్డర్ వేశాడు. గత పన్నేండేండ్లుగా ఆయన ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోతూనే ఉంది. బీజేపీ-వేలమందిని నియమించుకుని, ప్రపంచ వ్యాప్తంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూనే ఉంది – అన్నది నిజం! వారు చెప్పే కథనం ప్రకారం, వారు కాంగ్రెస్‌ను ఖాన్ గ్రేస్- అని అంటారట. కాంగ్రెస్ – ఖాన్ అనే శబ్దం నుండి వచ్చిందని వీరి సిద్ధాంతం. ఇందిరా గాంధీ ఖాన్‌ను పెండ్లి చేసుకుందనీ అందువల్ల ఖాన్‌‌ల పార్టీ – కాన్ గ్రేస్ – అని తీర్మానించి జనంలో ప్రచారం చేస్తున్నారు. ఇందిరా గాంధీ వివాహం, ఖాన్ అనే ముస్లింతో కాలేదని వీరికి తెలియదు. తెలిసినా, అబద్ధాలు ప్రచారం చేయదల్చినప్పుడు ఇక నిజాలతో ఏం పనీ? అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడొచ్చుకదా? ఇందిరా గాంధీ భర్త పేరు ఫిరోజ్ గాంధే. ఆయన ముస్లిం కాడు. పార్టీ కుటుంబీకుడు. వారి ఇంటి పేరు గాంధే. దాన్ని వారు గాంధీ అని కూడా పలుకుతారు. అది ఇంగ్లీషులో రాస్తే గాంధీ అవుతుంది. ఈయనకు మహాత్మా గాంధీకి ఏ సంబంధం లేదు. ఫిరోజ్ గాంధీ స్వాతంత్య్ర సమర యోధుడు. జైలుకు వెళ్లారు. ఇందిరా – ఫిరోజ్‌ల పెళ్లి ఆనంద్ భవన్‌‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం 26 మార్చి 1942లో జరిగింది.

ఇందిర తల్లి కమలా నెహ్రూ టి.బితో బాధపడుతూ ఉండేది. ఫిరోజ్ ఒక కొడుకు లాగా బాధ్యత తీసుకుని, ఆమెను సానిటోరియంలకు తీసుకుపోయే వాడు. ఆ కుటుంబ సాన్నిహిత్యమే ఇందిర – ఫీరోజ్‌ల పెళ్లికి దారితీసింది. కమలా నెహ్రూ మరణశయ్యపై ఉన్నప్పుడు ఫిరోజ్ పక్కనే ఉన్నాడు. విషయాలు తెలుసుకోకుండా అభాండాలు వేసే నీచబుద్దిని మనం ఎక్కడిక్కడ ఎండగడుతూ ఉండాలి! కాశ్మీర్‌ను నెహ్రూ వల్లే కోల్పోయామని మోడీ అబద్దాలు చెపుతున్నాడు. ఆనాడు కాశ్మీర్‌ను జిన్నాకు వదిలేద్దామని సర్దార్ పటేల్ అంటే – నెహ్రూ పట్టుబట్టి కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేశాడు. ఇది ఆన్ రికార్డు -పార్లమెంట్‌లో ఉంది! ఏది నిజం? ఏది అబద్దం అని దేశ ప్రజలు ఆలోచించుకునేలోపు, అంధభక్తులు మరో కొత్త అబద్దాన్ని ఆవిష్కరిస్తారు. ఏది ఏమైనా జనాన్ని మతం చుట్టూ గానుగెద్దుల్లా తిప్పుతూ ఉంటారు. దేశప్రజలు ఈ కుట్రను అర్థం చేసుకుంటున్నారు. జిన్నా సావర్కర్ల ‘స్నేహం’ ఎంతో గొప్పది. అందుకే అరెస్సెస్ వారు జిన్నాను చంపలేదు. సమగ్రత, మత సామరస్యం కోరుకున్నాడు కాబట్టి, గాంధీని గాడ్సేతో హత్య చేయించారు. ఈరోజు వరకు పాక్‌తో మన సంబంధాలు బెడిసి కొడుతున్నాయంటే-అక్కడ ఉగ్రవాదం బలపడిం దంటే- అందుకు కారణం వీరు కాదా? అయితే, విషయం పైపైన చూస్తే అర్థంకాదు. లోతుగా మూలాల్లోకి పోయి విశ్లేషించుకోవాలి! మహాభారతంలో ఒక గుడ్డి తండ్రి ధృతరాష్ట్రుడనేవాడు ఉన్నాడు.

ఆయనా, కళ్లకు గంతలు కట్టుకున్న ఆయన భార్యా కలిసి, వందమంది పిల్లల్ని కన్నారు. గుడ్డి వాళ్లు అంతమందిని ఎలా కన్నారూ? – అన్న విషయం అలా ఉంచుదాం! అదొక ఫిక్షన్. ఇప్పుడు లక్షల మంది అంధభక్తులకు ఒక్కడే తండ్రి. తల్లిలేదు. ఆయన ‘మీత్రోఁ’ – అని సంభోదిస్తే చాలు – దేశప్రజలకు వంటి నిండా తేళ్లు, జెర్రూలూ పాకినట్టవు తోందట. “ఈ ‘శని’ ఇంకా ఎప్పుడు వదులుతుందిరా బాబూ”- అని తలలు పట్టుకుంటున్నారు పంచాంగం మీద నమ్మకం లేని వాళ్లుకూడా!సాధారణ దొంగ మీ మొబైల్, పర్సు, గడియారం, బ్యాగు, బంగారు గొలుసు వంటివి దొంగిలిస్తాడేమో గానీ, బడా రాజకీయ నాయకుడు మీ చదువును, ఉద్యోగాన్ని, ఆదాయాన్ని మొత్తం భవిష్యత్తును చివరకు ‘ఓటు హక్కు’ను కూడా దొంగిలించేస్తాడు. చాలదూ? విధ్వంసానికి యుద్ధమే చేయాలా?
వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -