Thursday, June 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఢిల్లీ హైకోర్టు తీర్పులో పెన్షనర్ల ప్రయోజనమెంత?

ఢిల్లీ హైకోర్టు తీర్పులో పెన్షనర్ల ప్రయోజనమెంత?

- Advertisement -

గత నెల 29న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వ, రైల్వే, ఇతర పెన్షనర్లలో చర్చనీయాంశంగా మారింది. చాలాకాలంగా పెన్షనర్ల సంఘాలు కమ్యూటెడ్ పెన్షన్ పునరుద్ధరణను పదిహేను సంవత్సరాల బదులు పన్నెండు లేదా పదమూడు సంవత్సరాలకే చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు పదిహేనేండ్ల పునరుద్ధరణ కాలాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు డెబ్బయి ఐదు లక్షల పెన్షనర్ల ఆశలపై నీళ్లు చల్లినట్టే అయింది. పెన్షన్ కమ్యూటేషన్ అంటే పెన్షనర్ తన నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని వదులుకుని, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందడం. పదవీ విరమణ సమయంలో ఇల్లు నిర్మించుకోవడం, అప్పులు తీర్చుకోవడం, పిల్లల విద్య లేదా వివాహ ఖర్చులు వంటి అవసరాల కోసం చాలా మంది ఈ అవకాశాన్ని వినియో గించుకుంటూ ఉంటారు. అయితే కమ్యూటేషన్ చేసిన తర్వాత ఆ భాగానికి సంబంధించిన పెన్షన్ కోత విధించబడుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పదిహేను సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ కోత తొలగించి పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరిస్తారు. పెన్షనర్ల వాదన ఏమిటంటే, కమ్యూటేషన్ సమయంలో పొందిన మొత్తాన్ని ప్రభుత్వం నెలనెలా పెన్షన్ కోత ద్వారా సుమారు 11 నుండి 12 సంవత్సరాల లోనే తిరిగి వసూలు చేసుకుంటుంది. అలాగైతే మరో మూడు లేదా నాలుగేండ్లు కోత కొనసాగించడం అన్యాయమని వారు చెబుతున్నారు. అనేక పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కొంతమంది మాజీ న్యాయమూర్తులు కూడా ఈ వాదనకు మద్దతిచ్చారు.

అయితే ఢిల్లీ హైకోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. కమ్యూ టేషన్‌ను సాధారణ రుణం(లోన్‌)గా చూడకూడదని పేర్కొంది. కమ్యూటేషన్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు వ్యక్తి జీవితకాల అంచనా, మరణాల రేటు, భవిష్యత్ వడ్డీ రేట్లు, పెన్షన్ నిధుల నిర్వహణ వంటి భవిష్యత్ ఆర్థిక భాధ్యతల అంచనా (యాక్చురియల్) సూత్రాలను ఉపయోగిస్తారని కోర్టు తెలిపింది. అందువల్ల ఒక వ్యక్తి నుండి ఎంత మొత్తం వసూలైందనే లెక్కల ఆధారంగా పునరుద్ధరణ కాలాన్ని నిర్ణయించలేమని స్పష్టం చేసింది. చట్టపరంగా చూస్తే కోర్టు తీర్పు ప్రస్తుత నిబంధనలను సమర్థించింది. రూల్‌10-A ప్రకారం ‌పదిహేనేండ్లు కాలవ్యవధి చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. న్యాయపరంగా ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. కానీ సామాజిక న్యాయం, సంక్షేమ దృష్టికోణంలో చూస్తే కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.పెన్షనర్లకు నిజంగా ఈ తీర్పు ఉపయోగకరమా? అనే ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పాలంటే కానే కాదు. ఈ తీర్పు వల్ల పెన్షనర్లకు ఎటువంటి అదనపు ప్రయోజనం లభించదు. వారు ఆశించినట్లుగా పునరుద్ధరణ కాలం తగ్గలేదు. పదిహేను సంవత్సరాలు పూర్తయ్యే వరకు కోత కొనసాగుతుంది. ముఖ్యంగా తక్కువ పెన్షన్ పొందుతున్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పదవీ విరమణ తర్వాత వైద్య ఖర్చులు, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రతి రూపాయి విలువైనదే.

అలాంటి సమయంలో పన్నెండు లేదా పదమూడు సంవత్సరాలకే పూర్తి పెన్షన్ వస్తే వారికి కొంత ఆర్థిక ఉపశమనం లభించేది. కానీ ఈ తీర్పు ఆ అవకాశాన్ని మూసివేసింది. అయితే మరో కోణంలో చూస్తే ఈ తీర్పు ఒక స్పష్టతను ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా, పెన్షన్ కమ్యూటీషన్ పై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఇకపై కోర్టు కేసుల ద్వారా 12 లేదా 13 సంవత్సరాల పునరుద్ధరణ సాధించడం కష్టమని అర్థమవుతోంది. అంటే ఈ సమస్యకు పరిష్కారం కోర్టుల్లో కాకుండా ప్రభుత్వ విధాన మార్పుల్లోనే ఉందని ఈ తీర్పు సూచిస్తోంది. ఇక్కడ ఒక ముఖ్య మైన అంశం గుర్తుంచుకోవాలి. కోర్టు పదిహేనేండ్ల నిబంధన చట్టబద్ధమని మాత్రమే చెప్పింది. ఈ కాలాన్ని ఉత్తమమైనదని చెప్పలేదు. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం నిబంధనలను సవరించకూడదని కూడా పేర్కొనలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే కమ్యూటేషన్ పట్టికలను పునఃసమీక్షించి, పునరుద్ధరణ కాలాన్ని తగ్గించే అవకాశం ఇప్పటికీ ఉంది. అందువల్ల పెన్షనర్ల ఉద్యమం ముగిసిపోయిందని భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోరాటం న్యాయస్థానాల నుండి విధాన నిర్ణయాల వైపు మళ్లాలి. పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రైల్వే పెన్షనర్ల సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. పదిహేనేండ్ల కాలవ్యవధిని పునఃసమీక్షించాలని డిమాండ్ చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -