Friday, June 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికడుపు‘కోత’లను కట్టడి చేయలేమా?

కడుపు‘కోత’లను కట్టడి చేయలేమా?

- Advertisement -

భారతదేశంలో మాతృ-శిశు ఆరోగ్య రంగం గత రెండు దశాబ్దాల్లో విశేషమైన పురోగతి సాధించింది. ఒకప్పుడు గర్భధారణ, ప్రసవం మహిళ జీవితంలో అత్యంత ప్రమాదకర దశగా భావించబడేది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదు పాయాల కొరత, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది లేకపోవడం, అత్యవసర ప్రసూతి సేవలు అందుబాటులో ఉండకపోవడం వల్ల అనేక మంది తల్లులు, నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయేవారు. ప్రజల్లో చైతన్యం పెరిగేకొద్దీ ఆరోగ్యంపై ప్రభుత్వాల కృషి పెంచక తప్పలేదు. ఇంకా అనేక అంశాల్లో లోపాలు కొనసాగుతున్నప్పటికీ వైద్య మౌలిక వసతుల విస్తరణ, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, ప్రసూతి పథకాల ద్వారా పరిస్థితి గణనీయంగా మారింది. ప్రస్తుతం దేశంలో అత్యధిక ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. మాతృ మరణాలు తగ్గాయి. శిశు మరణాల రేటు తగ్గింది. గర్భిణుల ఆరోగ్య పర్యవేక్షణ గతంతో పోలిస్తే మెరుగుపడింది. ఇది ఒక గొప్ప ప్రజారోగ్య విజయగాథ. అయితే గాథ వెనుక మరో ప్రశ్న నిశ్శబ్దంగా పెరుగుతోంది. సహజ ప్రసవాలు తగ్గిపోతు న్నాయా? సిజేరియన్ శస్త్రచికిత్సలు అవసరానికి మించి పెరుగుతున్నాయా? ఈ ప్రశ్నకు కారణం తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌‌హెచ్‌ఎస్‌-6) గణాంకాలే.తెలంగాణలో మొత్తం ప్రసవాల్లో 62.2 శాతం సిజేరియన్ ప్రసవాలు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేటు 52.2 శాతం. దేశ సగటు 27.2 శాతం మాత్రమే. అంటే తెలుగు రాష్ట్రాలు జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు రెండింతల స్థాయిలో ఉన్నాయి. తెలంగాణలో ప్రతి పది ప్రసవాల్లో ఆరు శస్త్రచికిత్స ద్వారానే జరుగుతున్నాయి. ఇవి సమాజంలో, ఆరోగ్య వ్యవస్థలో, వైద్య సేవల్లో, కుటుంబాల ఆలోచనల్లో వచ్చిన మార్పులకు అద్దం పడుతున్నాయి.

ప్రసవాల్లో తెలంగాణ ప్రత్యేకత
మన రాష్ట్రంలో 98.8 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే అవుతుండగా, దేశం లోనే అత్యధిక స్థాయిలో ఉన్న రాష్ట్రాల్లో ఇదొకటి. వాస్తవానికి ఇక్కడ ప్రసూతి సేవల విస్తరణలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. గర్భిణీలకు వైద్య పరీక్షలు, టీకాలు, పోషకాహార కార్యక్రమాలు, అత్యవసర రవాణా సేవలు, ప్రసూతి ఆస్పత్రులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆస్పత్రి ప్రసవాలు పెరగడం ఎంత మంచి విషయమో, అదే సమయంలో సిజేరియన్ ప్రసవాలు అసాధారణంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణలో ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో 83.9 శాతం సిజేరియన్లు. అంటే ఐదుగురిలో నలుగురికి పైగా మహిళలు శస్త్రచికిత్స ద్వారానే ప్రసవిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా 48.1 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే అవుతున్నాయి.

సిజేరియన్ ఎందుకు అవసరం?
ఈ చర్చలో ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సిజేరియన్ శస్త్రచికిత్స అనేది శత్రువు కాదు. ఆధునిక వైద్యశాస్త్రం సాధించిన గొప్ప విజ యాల్లో ఇది ఒకటి. గర్భస్త శిశువుకు ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు, ప్రసవం ఎక్కువసేపు నిలిచిపోయి నప్పుడు, గర్భంలో బిడ్డ అడ్డంగా ఉన్నప్పుడు, మావి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన రక్తపోటు వంటి పరిస్థితుల్లో సిజేరియన్ తల్లి, శిశువు ప్రాణాలను కాపాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు ఈ శస్త్రచికిత్స వల్ల రక్షించబడ్డాయి.కాబట్టి ప్రశ్న సిజేరియన్ మంచిదా చెడ్డదా అనేది కాదు. అవసరమైన ప్పుడు తప్పనిసరిగా జరగాలి. కానీ అవసరం లేనప్పుడు కూడా జరుగుతోందా అనే అంశమే పరిశీలనకు అర్హం. సిజేరియన్ రేట్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిగా, మహిళల జీవనశైలి మారింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆలస్య వివాహాలు ఎక్కువ. ముప్ఫయి సంవత్సరాల తర్వాత గర్భం దాల్చే మహిళల సంఖ్య పెరిగింది. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా పెరిగాయి. ఇవన్నీ కొంతమేరకు సిజేరియన్ అవసరాన్ని పెంచుతాయి. రెండవది, వంధ్యత్వ చికిత్సలు. ఐవీఎఫ్ వంటి పద్ధతుల ద్వారా గర్భం దాల్చే మహిళల సంఖ్య పెరుగుతోంది. చాలామంది వైద్యులు, కుటుంబాలు ఇలాంటి గర్భధారణలను ‘‘అమూల్య గర్భాలు’’గా భావించి అధిక జాగ్రత్తలు తీసుకుంటారు. మూడవది, చిన్న కుటుంబాల ధోరణి. ఒకటి లేదా రెండు పిల్లలకే పరిమితమవుతున్న కుటుంబాలు ఎటువంటి ప్రమాదం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ‘‘ఆపరేషన్ అయితే సురక్షితం’’ అనే భావన బలపడుతోంది. నాలుగవది, ప్రసవ నొప్పుల పట్ల భయం. సహజ ప్రసవం గురించి సరైన అవగా హన లేకపోవడం వల్ల చాలామంది మహిళలు, కుటుంబాలు ముందుగానే సిజేరియన్‌ను కోరుతున్నారు.

వైద్యీకరణ పెరుగుతోందా?
ప్రసవం సహజమైన జీవ ప్రక్రియ. కానీ క్రమంగా అది పూర్తిగా వైద్య నిర్వహణ అవసరమయ్యే ప్రక్రియగా మారుతోంది. గర్భధారణ ప్రారంభం నుంచే అనేక పరీక్షలు, స్కానింగ్‌లు, పర్య వేక్షణల మధ్య మహిళలు ‘‘రిస్క్’’ అనే పదాన్ని ఎక్కువగా వింటున్నారు. దాంతో సహజ ప్రసవంపై నమ్మకం తగ్గి సిజేరియన్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోందని ప్రజారోగ్య నిపుణుల మాట. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రుల నిర్వహణ, సమయ ప్రణాళిక, చట్టపరమైన భయాలు కూడా వైద్య నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి గమనిస్తే తెలంగాణ 62.2 శాతం, ఆంధ్రప్రదేశ్ 52.2 శాతం రేట్లతో దేశంలో అగ్ర స్థానాల్లో ఉండగా, నాగాలాండ్‌లో కేవలం 13.2 శాతం మాత్రమే ఉంది. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా రేట్లు చాలా తక్కువ. అయితే తక్కువ రేటు ఉన్న రాష్ట్రాలనే ఆదర్శంగా చెప్పలేం. ఎందుకంటే అక్కడ అవసరమైన సిజేరియన్లు కూడా అందుబాటులో లేకపోవచ్చు. వైద్య మౌలిక వసతులు తక్కువగా ఉండటం, నిపుణుల కొరత వంటి కారణాలు ఉండవచ్చు. అందువల్ల తక్కువ రేటు సమస్య లేదా ఎక్కువ రేటు కూడా కావచ్చు. ప్రజారోగ్య దృష్టిలో సరైన ప్రశ్న ఏమిటంటే – అవసరమైన మహిళకు సిజేరియన్ అందుతోందా? అవసరం లేని మహిళకు సిజేరియన్ జరగడం లేదా? ఈ రకంగా పరిశీలిస్తే సిజేరియన్ కూడా ఒక పెద్ద శస్త్రచికిత్సే. ఆధునిక వైద్య సదుపాయాల వల్ల ఇది సురక్షితంగా మారినప్పటికీ కొన్ని ప్రమాదాలు లేకపోలేదు. సహజ ప్రసవంతో పోలిస్తే కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తరువాతి గర్భధారణల్లో కూడా కొన్ని ప్రత్యేక ప్రమాదాలు పెరుగుతాయి. ఆర్థిక భారం కూడా ఎక్కువే. ప్రయివేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఖర్చు సహజ ప్రసవంతో పోలిస్తే అనేక రెట్లు అధికం.

ఇప్పుడేం చేయాలి?
ఈ సమస్యకు పరిష్కారం సిజేరియన్లను బలవంతంగా తగ్గించడం కాదు. అలాగే వాటిని యథేచ్ఛగా పెరగనివ్వడం కూడా కాదు. మొదటిగా, ప్రతి ఆస్పత్రి తన సిజేరియన్ రేటును బహిరంగంగా ప్రకటించాలి. ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండాలి. రెండవది, గర్భిణీలకు ప్రసవంపై శాస్త్రీయ అవగాహన కల్పించాలి. సహజ ప్రసవం ఎప్పుడు సాధ్యం? సిజేరియన్ ఎప్పుడు అవసరం? అనే విషయాలు స్పష్టంగా తెలియాలి. మూడవది, ప్రసూతి సేవల్లో మిడ్‌వైఫ్‌ల పాత్రను బలోపేతం చేయాలి. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో మిడ్‌వైఫ్ ఆధారిత ప్రసూతి సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. నాలుగవది, సిజేరియన్ అవసరాన్ని శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా క్రమం తప్పకుండా సమీక్షించాలి. ప్రతి సిజేరియన్ వెనుక ఒక స్పష్టమైన వైద్య కారణం ఉండాలి. ప్రతి సహజ ప్రసవానికి తగిన మద్దతు ఉండాలి. ప్రసవం ఒక వ్యాపార నిర్ణయం కాకూడదు, అది ఆరోగ్య నిర్ణయం కావాలి.ఆస్పత్రి ప్రసవాలను సాధారణం చేసిన తర్వాత, ఇప్పుడు అవసరమైన వైద్య జోక్యం, సహజ ప్రసవం మధ్య సరైన సమ తుల్యతను సాధించడం వాటి ముందున్న సవాలు. అదే తల్లి ఆరోగ్యాన్ని, శిశు ఆరోగ్యాన్ని, భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని మరింత బలపరుస్తుంది.

డా. రమాదేవి, 9490300863

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -