Friday, June 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిట్రంప్ యుద్ధ అధికారాలకు కత్తెర!

ట్రంప్ యుద్ధ అధికారాలకు కత్తెర!

- Advertisement -

ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు మరుసటి రోజు నుంచి దాదాపు ప్రతిరోజూ అమెరికా-ఇరాన్ పరస్పరం చెబుతున్నాయి. అడపాదడపా కాల్పులు జరుగుతున్న ప్పటికీ రెండు పక్షాలూ తెగేదాకా లాగటం లేదు. పరువుకోసం అమెరికా, ఇజ్రాయిల్‌ చూస్తుండగా బాధిత దేశంగా ఇరాన్ అనివార్య ప్రతిఘటనను కొనసాగిస్తున్నది. ఇజ్రాయిల్‌లో అక్టోబరు, అమెరికాలో నవంబరులో ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లకు ఏం చెప్పాలో తోచక ఇరాన్‌పై ఏదో ఒకటి సాధించినట్లు ఫోజు పెట్టేందుకు ఇరుదేశాల నేతలు తంటాలు పడుతున్నారు. చివరికి పరస్పరం నిందించుకున్నట్లు నాటకం కూడా ఆడారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా పట్టిన పట్టు విడవకుండా ఇరాన్ తన డిమాండ్ల గురించి గట్టిగా నిలిచింది. ఈ పూర్వరంగంలో బుధవారం నాడు ఇరాన్‌పై దాడులను ముగించేందుకు అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించటంతో వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గేందుకు డోనాల్డ్ ట్రంప్ పావులు కదుపు తున్నట్లు కనిపిస్తోంది. ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. పార్లమెంటు ఆమోదం లేకుండా దాడులు సాగించే అధ్యక్షుడి అధికా రాలకు ఇది కత్తెర వేసింది. అయితే ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్లు అమెరికా పాలకవర్గం తలచుకోవాలేగానీ ఇలాంటి తీర్మానాలను ఉల్లంఘించటం ఒక లెక్కలోనిది కాదు. ఇరాన్‌తో పోరు ముగిసినట్లే అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పాడు.

లెబనాన్ రాజధాని బీరుట్ నగరంతో సహా అనేక ప్రాంతాలపై ఆధిపత్యం కలిగి ఉన్న హిజబుల్లా సాయుధశక్తితో తొలిసారి చర్చలు జరిపినట్లు కూడా చెప్పటం, ఇజ్రాయిల్‌తో వాషింగ్టన్‌లో ఒప్పందం కుదిరినట్లు అమెరికా ప్రకటిం చటంతో ముడిచమురు ధర స్వల్పంగా తగ్గింది. ఒక వైపు హిజబుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌లో తమ కార్యకలాపాలు కొనసాగు తాయని ఇజ్రాయిల్‌ ప్రకటించటంతో సమస్య తిరిగి మొదటికే వచ్చినట్లు చెప్పవచ్చు లేదా ఇరాన్‌పై వత్తిడి వ్యూహం కూడా కావచ్చు. అయితే ఇప్పుడున్న కాల్పుల విరమణ ఒప్పందం పొడగింపు లేదా శాశ్వత ఒప్పందం గురించి ఇరాన్ వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేనప్పటికీ సంప్రదిం పులు కొనసాగుతున్నట్లు ప్రకటించటం ఊరట కలిగించే అంశమే. ఆత్మరక్షణ కోసం తాము ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద దాడులు జరిపినట్లు కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రకటించగా తాము కూడా అందుకోసమే కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాల మీద క్షిపణుల వర్షం కురిపించినట్లు ఇరాన్ జవాబిచ్చింది.

ట్రంప్ మీద నెతన్యాహు కేకలు వేసినట్లు కొద్ది రోజుల క్రితం మీడియాలో వార్తలు రాగా తాజాగా నెతన్యాహు పిచ్చివాడని ట్రంప్ రంకెలు వేసినట్లు రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఉత్తుత్తి వ్యవహారం తప్ప మరొకటి కాదు, ఉదయం పూట తాము గట్టిగా మాట్లాడుకున్నప్పటికీ మధ్యాహ్నానికి మామూలుగా ఇద్దరం కలిసి చేయాల్సినదాని గురించి నిర్ణయించుక ుంటామని ట్రంప్-నెతన్యాహు చెప్పటాన్ని గమనించాలి. తమ మధ్య వ్యూహాత్మక అంశాలపై తేడాలు తప్ప ఏది చేసినా కలిసే చేస్తామని కూడా వారు స్పష్టం చేశారు. ఇరాన్‌పై వత్తిడి తెచ్చే ఎత్తుగడలో భాగంగానే లెబనాన్‌పై యూదు దురహంకారుల దాడులని వేరే చెప్పనవసరం లేదు. ఆ దాడులు ఆగకుండా వాషింగ్టన్‌తో రాజీ లేదని టెహరాన్‌ పదే పదే చెబుతున్నది. అడపాతడపా కొన్ని దాడులు చేస్తున్నప్పటికీ మరోసారి భారీ దాడులు, భూతల పోరుకు వెళ్లటం లేదని తన సన్నిహితులతో ట్రంప్ చెప్పినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక రాసింది. ఈ వార్తలు అమెరికా దిక్కుతోచని స్థితిని వెల్లడిస్తున్నాయి. దానికి నిదర్శనంగా బుధవారం నాడు కాల్పుల విరమణకు సరికొత్త భాష్యం చెప్పాడు.

అడపాదడపా కాల్పులు జరపటం కూడా కాల్పుల విరమణలో భాగమే అన్నాడు.దీన్ని బట్టి హార్ముజ్ జలసంధిలో ఇప్పుడున్న తన బలగాలను వెనక్కు తీసుకోవటం జరగదని ముందే చెప్పుకున్నట్లు ఆత్మరక్షణ పేరుతో అప్పుడప్పుడూ దాడులకు తెగబడుతుం టామని చెప్పినట్లే. అయితే ఇలాంటి వైఖరి ప్రపంచ దేశాలకు ప్రాణసంకటంగా మారుతుందని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా మరొక దేశం నుంచి ఇంథనాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం లేకున్నా అక్కడి కంపెనీలు జనాన్ని బాదుతున్నాయి. పశ్చిమాసియా పోరు ముగిసిన తరువాతే ధరలు తగ్గుతాయని, అయినా పెద్దగా పెరుగుదల లేదని ట్రంప్ సమర్ధించుకుంటున్నాడు. గృహస్తుల ఇంథన భారం పెరుగుదల నుంచి ఉపశమనం కలిగించేందుకు జపాన్ 19 బిలియన్ డాలర్ల పాకేజ్‌ను ప్రకటించింది. మరోవైపు ‌జీడీపీలో జపాన్‌‌ను వెనక్కు కొట్టామని గొప్పలు చెప్పుకున్న నరేంద్రమోడీ సర్కార్ మాత్రం ఉపశమనం కల్పించకపోగా ముడి చమురు ధరలు పెరిగినందున వినియోదారులే వాటిని భరించాలంటూ ఇంథన ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులకు వట్టిస్తరి మంచినీళ్ల కబుర్లు చెబుతూ విమానాల్లో తిరిగే బడాబాబులు, విదేశాలకు ఎగుమతి చేసే చమురు ఉత్పత్తుల మీద మాత్రం పన్నులు తగ్గిస్తూ సంపన్నులు, విదేశీ భక్తిని చాటుకుంటున్నారు. అందుకే ఏ పదజాలం మాటున ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోలేనంత కాలం జనాలు మోసపోతూనే ఉంటారు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -