మండలంలో 1190 మంది చిన్నారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ఫాస్ట్ పథకానికి ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ పథకం అమలైతే మండలంలోని తాడిచెర్ల, వల్లెంకుంట రెండు సెక్టార్లలోని 38 అంగన్వాడి కేంద్రాల్లోని 1,190 మంది చిన్నారులకు పోషకాహార లోపం తలెత్తకుండా ఉండడమే కాక కేంద్రాల్లో చిన్నారుల హాజరు శాతం పెరిగే అవకాశముంది. మూడు రోజుల పాటు ఉప్మా, మరో మూడు రోజుల పాటు కిచిడీ అందిస్తారని సమాచారం. ఇందులో గోధుమ రవ్వ, మినుములు, శనగలు, పల్లీలు, టమాటా, క్యారెట్ వినియోగిస్తారు. ఇందులో 100 గ్రాముల న్యూట్రిషియన్,15.5 గ్రాముల ప్రొటీన్, 465 ఎనర్జీ క్యాలరీలు అందేలా చూస్తారు. దీంతో చిన్నారుల్లో పోషక విలువలు పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
పోషకాహార లోపానికి చెక్..
అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం, ఇంటికే కోడిగుడ్లు అందజేస్తారు. కేంద్రాల్లో చదువుకునే ఆరేళ్ల లోపు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పేదింటి పిల్లలే ఎక్కువ ఉండడంతో ఉదయం ఇంటి వద్ద ఏమీ తినకుండానే వస్తారు. మధ్యాహ్న భోజనం పెట్టే వరకు నీరసించి పోతున్నారు. దీన్ని నివారించేందుకే ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించిందని తెలుస్తోంది.



