ప్రజా పోరాటాలే కామ్రేడ్ ఎలుగల బాలయ్యకు నిజమైన నివాళి – కల్లూరి మల్లేశం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రజా పోరాటాలే కామ్రేడ్ ఎలుగల బాలయ్యకు నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు. ఆలేరు సీపీఐ(ఎం) మాజీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ ఎలుగల బాలయ్య 5వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సీపీఐ (ఎం) కార్యాలయంలో ఎలుగల బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్లూరు మల్లేశం మాట్లాడుతూ ఎలుగల బాలయ్య జీవితాంతం ఎర్రజెండా సిద్ధాంతాలకు కట్టుబడి పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడని కొనియాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సీపీఐ (ఎం) పార్టీ నాయకత్వంలో పేదలకు ఇళ్లు,ఇళ్ల స్థలాలు,రేషన్ కార్డుల సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో బాలయ్య ముందుండి పోరాడారని గుర్తు చేశారు. కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
నేటి రాజకీయ పరిస్థితుల్లో పార్టీలు మారడం సాధారణమైపోయిన తరుణంలో కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం ఎర్రజెండా బాటలో నడవడం గొప్ప విషయమని అన్నారు. అలాంటి నిబద్ధత కలిగిన నాయకుల్లో ఎలుగల బాలయ్య ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న వర్గాల సంక్షేమం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడడమే ఎలుగల బాలయ్యకు అందించే నిజమైన నివాళి అని మల్లేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా నాయకులు మొరిగాడి రమేష్, వడ్డేమాన్ బాలరాజు, ఘనగాని మల్లేష్, చెన్న రాజేష్, మొరిగాడి అజయ్, మొరిగాడి అశోక్, మొరిగాడి లక్ష్మణ్, ఎలుగల కుమారస్వామి, యాసారపు ప్రసాద్, బర్ల సిద్ధులు, గొడుగు దాసు తదితరులు పాల్గొన్నారు.



