పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలల గుమ్మాలు స్వాగత తోరణాలతో కళకళలాడుతున్నాయి. అయితే, ఎన్నో ఆశలతో పాఠశాలకు వచ్చిన లక్షలాది మంది విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే భయాందోళనలు మొదలయ్యాయి. విద్యావ్యవస్థ సజావుగా ముందుకు సాగుతుందా? మన పాఠశాల ఉంటుందా? మూత పడుతుందా? సమస్యలతోనే మరో ఏడాదిని ముగిస్తామా? అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ప్రయివేటు విద్యాసంస్థల్లో భారీగా ఫీజుల పెంపుతో ఎలా చదివించాలి..? ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఉన్న భయాందోళనలు. విద్యాసంవత్సరం ప్రారంభమైన ఈ వేళ విద్యార్థుల్లో ఉన్న భయాన్ని ప్రభుత్వం పోగొట్టాలి. వారి భవిష్యత్తుకు వెలుగునింపే శక్తిగా నాణ్యమైన విద్యను అందించేందుకు సంసిద్ధం కావాలి.
పాఠశాలల గదులు తెరవడం అంటే తరగతులు మొదలుకావడం మాత్రమే కాదు. వ్యవస్థ మొత్తం తన బాధ్యతలను పునఃసమీ క్షించుకునే సందర్భం కూడా. ఆ రకంగా విద్యా వ్యవస్థను ప్రభుత్వం చక్క దిద్దాలి. తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం అందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాట్లు చేయడం అభినందనీయం. ఇది విద్యార్థులకు ఉపయోగపడే నిర్ణయం. విద్యాప్రమాణాల మెరుగుదలకు నాణ్యమైన విద్యను అందిస్తామని పాలకులు చెబుతుండటాన్ని స్వాగతించాల్సిందే. చెప్పినంత సులువుగా విధానపరంగా నిర్ణయాల అమలు ఉంటుందా? అన్నదే సందేహం. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నప్పటికీ, ఉపాధ్యాయుల ఖాళీలు, బోధన నాణ్యత, మౌలిక సదుపాయాల లోపాలు, అభ్యాస ఫలితాలపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. మరుగుదొడ్లు లేవు. శుభ్రం చేసేవారు లేరు. బోధన పరికరాలు లేవు. మధ్యాహ్న భోజనం పెట్టేందుకు వంట గదులు లేవు. ప్లే గ్రౌండ్‌లు లేవు. ఉన్నా ఆటలు ఆడించేం దుకు టీచర్లు లేరు. నాణ్యమైన విద్య అందాలంటే ముందుగా పాఠశాలలు కనీస అవసరాలతో సిద్ధంగా ఉండాలి.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలతో పాటు ఎన్నో రకాల పాఠశాలలు ఉన్నాయి. వాటి మెరుగు దలకు విద్యాశాఖ సరైన ఆలోచన చేయాలి. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా పాఠశాలల గురించి ఘనంగా చెబుతున్నారు. అదే సమయంలో నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉంటాయని సీఎం చెప్పడం ఆందోళన కరం. మిగతాచోట్ల చదువుకుంటున్న పేద విద్యార్థులు ఎక్కడికి పోవాలి. కార్పొరేట్ విద్యాసంస్థల మోజులో ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్ ఫీజుల గురించి ఏనాడూ చర్చ లేదు. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన వారే ఫీజులను సమర్థించుకుంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం. వీటిపై పాలకులు పునరాలోచన చేయాలి.
పాఠశాలలో చిన్న లోపం జరిగినా, ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటారు. జిల్లా స్థాయి అధికారి పొరపాటు చేస్తే, విచారణ జరుగుతుంది. కానీ జాతీయ స్థాయిలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రభావితం చేసే నీట్, సీబీఎస్‌ఇ పరీక్ష పేపర్‌ల లీకేజీ వంటి లోపాలు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఎవరిని జవాబుదారీ చేయాలి? దానికి బాధ్యత వహించాల్సిన కేంద్రం మౌనంగా ఉండటం కరెక్టే కాదు. చర్యలు లేకపోతే మిగతావారు మరిన్ని తప్పులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు కాదా? పరీక్ష అంటే ప్రతిభకు కొలమానం కావాలి. నేడది వ్యవస్థీకృత వైఫల్యాల బారిన పడుతోంది. “విద్య యొక్క అసలు లక్ష్యం వాస్తవాలను సేకరించడం కాదు; ఆలోచించే మనసును నిర్మించడం” అంటారో విద్యావేత్త. కానీ నేడు విద్యార్థుల ముందు నిలిచిన పరిస్థితి వేరు. ప్రశ్నాపత్రం లీక్ అవుతుందేమో, పరీక్ష వాయిదా పడుతుందేమో, ఫలితాల్లో తప్పులు వస్తాయేమో అన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. లక్షలాది యువత జీవితాలపై పడుతున్న మానసిక భారం అంతాఇంతా కాదు. ఉద్యోగ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
విద్య కేవలం నేటి విద్యార్థుల సమస్య కాదు.. రేపటి దేశ నిర్మాణం. దేశానికి నేడు కావలసింది విద్యపై రాజకీయ ఆధిపత్యం కాదు; విద్యపై సామాజిక బాధ్యత. విద్యాలయాల నుంచి సమాజంలోకి అడుగు పెట్టే యువతకు కావాల్సంది ఈ కొత్త విద్యాసంవత్సరం నుంచి అయినా సజావుగా సాగడం. ఆ బాధ్యతను ప్రభుత్వం, విద్యాసంస్థలు, సమాజం- అందరూ కలిసి సక్రమంగా నిర్వర్తించాలి.
విద్యకు కొత్త దిశ ఏది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



