టెహ్రాన్/వాషింగ్టన్ : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ అనిశ్చితి మాత్రం తొలగిపోలేదు. తాను ఓ గొప్ప ఒప్పందాన్ని సాధించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. అయితే ఇలాంటి అతిశయోక్తులు ఆయనకు కొత్తేమీ కావు. ఒప్పందాన్ని పరిశీలించిన వారికి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న అణు సామగ్రి, శుద్ధి చేసిన యురేనియం నిల్వల భవిష్యత్తుపై ఇరు దేశాల మధ్య ఇంకా అవగాహన కుదరలేదు. ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించారు. ఆ కాలంలో జరిగే సంప్రదింపులలో కీలక అంశాలపై ఇరు దేశాలు ఓ అవగాహనకు రావచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే ఇరాన్‌కు అమెరికా ఎలాంటి మామీలు ఇవ్వకపోవడం. ఇరాన్‌లో అత్యున్నత నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటన ఈ విషయాన్నే ప్రస్తావించింది. ఒప్పందంలో ఇచ్చిన హామీలను ఎదుటి పక్షం అమలు చేసినప్పుడే తదుపరి చర్చలు జరుగుతాయని తేల్చి చెప్పింది. హార్ముజ్‌లో నౌకాయానాన్ని యుద్ధానికి పూర్వమున్న స్థాయికి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని ఇంధన మార్కెట్ నిపుణులు తెలిపారు. ఎందుకంటే జలసంధిలో పెద్ద ఎత్తున నిలిచిపోయిన చమురు ట్యాంకర్లను గమ్యస్థానాలకు పంపడం, మందుపాతరలను తొలగించడం, చమురు రవాణా-ఉత్పత్తిని సాధారణ స్థాయికి తీసుకురావడం వంటి పనులకు అనేక వారాల సమయం పట్టవచ్చు. ఇక్కడ ఇజ్రాయిల్‌ను కూడా ప్రస్తావించాలి. మధ్యప్రాచ్యంలో మొదటి నుంచీ జరుగుతున్నది మూడు దేశాల యుద్ధమే. అయితే ఎంఓయూలో ఇజ్రాయిల్‌కు చోటు దక్కలేదు. అదే సమయంలో లెబనాన్‌లోని హిజ్బల్లాలపై ఇజ్రాయిల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌పై దాడుల విషయంలో ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఓ దశలో నెతన్యాహూపై ట్రంప్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు కూడా. లెబనాన్‌పై ఇజ్రాయిల్ సైనిక చర్యలు కొనసాగితే శాంతి ఒప్పందానికి విఘాతం కలిగి కథ మళ్లీ మొదటికి వస్తుంది.
ట్రంప్‌పై అమెరికాలో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. యూగవ్ సర్వే ప్రకారం ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ట్రంప్ వైఫల్యాన్ని 63 శాతం మంది ఎత్తిచూపారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోందని 57 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ట్రంప్ ఇమేజ్‌ను పెంచుతుందా అన్నది అనుమానమే. ట్రంప్ నిర్దేశించుకున్న భారీ లక్ష్యాలు ఈ ఒప్పందంతో నెరవేరకపోయినప్పటికీ అది ఆయనకు కొంతమేరకైనా ఊరట కలిగించి ఉండవచ్చు.
జవాబు లేని ప్రశ్నలెన్నో !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



