Friday, June 19, 2026
E-PAPER
Homeఆటలుముందుగానే ఐపీఎల్‌ పండుగ!

ముందుగానే ఐపీఎల్‌ పండుగ!

- Advertisement -

వేసవి తాపం తగ్గించే యోచనలో బీసీసీఐ
ముంబయి : ఇటీవల వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌‌ల్లో ఉష్ణతాపం ఎదుర్కొనేందుకు ఆటగాళ్లకు ప్రత్యేక శిక్ష‍ణ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 45-50 డిగ్రీలను తాకుతుండగా.. రాత్రి వేళ్ల విపరీత ఉక్కపోతతో మైదానంలో ఊపిరి సలపలేని పరిస్థితులు చూస్తున్నాం. ఇంగ్లాండ్‌, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌ క్రికెటర్లు ఈ వాతావరణంలో ఆడేందుకు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవి తాపం నుంచి క్రికెటర్లతో పాటు అభిమానులను తప్పించేందుకు ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌‌ను కాస్త ముందుగానే మొదలుపెట్టేందుకు భారత క్రికెట్‌ ‌నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచన చేస్తోంది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ ‌సైకియా ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా ఐపీఎల్‌ ‌సీజన్‌ ‌మార్చి ఆఖర్లో మొదలై.. మే ఆఖర్లో లేదా జూన్‌ ఆరంభంలో ముగుస్తుంది. 2026 ఐపీఎల్‌ ‌మార్చి 28న ఆరంభమై, మే 31న ముగిసింది. 2027 ఐపీఎల్‌‌ను మార్చి 10 నుంచి మే 15 లోపు ముగించాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ‘అభిమానులు, ఆటగాళ్ల నుంచి అధిగ ఉష్ణోగ్రతలపై ఫిర్యాదులు అందాయి. అసాధారణ ఉష్ణోగ్రతలను తట్టుకుని అన్ని దేశాల క్రికెటర్లు ఆడలేరు. మే 15 తర్వాత ఉండే అధిక వేడితో పాటు ముందస్తు వర్షాలను గమనంలో ఉంచుకుని వచ్చే సీజన్‌ ‌షెడ్యూల్‌‌ను ముందుకు జరపాలని అనుకుంటున్నాం. బీసీసీఐ, ఐపీఎల్‌ ‌గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌‌లో వచ్చే సీజన్‌‌ను ముందుగా మొదలుపెట్టే అంశంపై చర్చ నడుస్తోంది. దీనిపై ఇప్పటికే జనరల్‌ ‌మేనేజర్‌‌కు సూచనలు జారీ చేశాం. మార్చి 10 నుంచి మే 15 లోపు ఐపీఎల్‌ ‌సీజన్‌‌ను జరిపించేలా షెడ్యూల్‌ ‌చేయాలని చెప్పాం. అప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో పాటు ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌కు వర్షం ప్రభావం సైతం ఉండదు. 2027 ఐపీఎల్‌ 20వ సీజన్‌, అందుకు తగినట్టుగానే భారీగా ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం మా లక్ష్యం ఐపీఎల్‌ ‌సీజన్‌‌ను ముందుకు జరపటమే’ అని సైకియా అన్నారు.

​94 కాదు 74 మ్యాచ్‌‌లే
2022లో ఐపీఎల్‌ ‌జట్లు పదికి చేరిన తర్వాత నుంచి సీజన్లో 74 మ్యాచులు జరుగుతున్నాయి. లీగ్‌ ‌దశలో ప్రతి జట్టు ఓ గ్రూప్‌ ‌జట్లతో రెండు సార్లు, మరో గ్రూప్‌ ‌జట్లతో ఓసారి ఆడుతున్నాయి. కానీ ఐపీఎల్ సంప్రదాయ డబుల్‌ ‌రౌండ్‌ ‌రాబిన్‌ ‌ప్రకారం సీజన్‌‌లో 94 మ్యాచ్‌‌లు జరగాలి. మ్యాచ్‌‌ల సంఖ్య పెంపుపై గతంలో ప్రాంఛైజీలకు బోర్డు హామీ ఇచ్చినా.. ప్రస్తుత ఇంటర్నేషనల్‌ ‌సీజన్‌ ‌దృష్ట్యా ఐపీఎల్‌‌కు రెండు నెలల కంటే ఎక్కువ సమయం లభించటం కష్టమని సైకియా అన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో 94 మ్యాచ్‌‌ల నిర్వహణ సాధ్యం కాదు. ఇతర దేశాలు ద్వైపాక్ష‍ిక సిరీస్‌‌లు ఆడాలి, ఇతర దేశాల క్రికెటర్లు ఐపీఎల్‌‌లో ఆడాలి. భవిష్యత్‌‌లో 94 మ్యాచ్‌‌లపై ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ ఇప్పుడైతే 74 మ్యాచ్‌‌లతోనే కొనసాగుతామని’ సైకియా అన్నారు. ఐపీఎల్‌ ‌సీజన్‌‌ను కాస్త ముందుగా మొదలుపెట్టేందుకు దేశవాళీ సీజన్‌‌ను త్వరగా ముగించేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. 2026-27 దేశవాళీ సీజన్‌ ఆగస్టులో ఆరంభం కానుండగా.. వచ్చే ఏడాది మార్చి 3న రంజీ ఫైనల్‌‌తో ముగియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -