నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్) : బీర్కూర్ మండల కేంద్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ ఆషామ్ (23) ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఇసుకను ఖాళీ చేసే పనిలో భాగంగా ట్రాక్టర్‌ను వెనక్కి తీసుకొస్తుండగా ట్రాలీ వెనుక భాగం అబ్దుల్ ఆషామ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి మృతితో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


