‘‘కాశీకి పోయాను రామాహరి గంగ తీర్థమే తెచ్చాను రామాహరి! కాశీకి పోలేదు రామా హరి, ఊరి కాల్వలో నీళ్లండి రామాహరి!’’ 1959లో పింగళి గారు రాసిన పాట ఇది, ఘంటశాల గారు పాడారు సినిమాకోసం. ఇప్పుడయితే ‘‘రామ మందిరంలో రామాహరి/కోట్ల సొమ్ములే దోచారు రామాహరీ! ఎవరు వాళ్లంతా రామా హరీ/ నకిలీ రామ భక్తులంత రామహరీ!’’ అనిపాడుకోవాలేమో! మనం పాడుకోవటంకాదు, ఇప్పటికే ఓ సాధు పుంగవుడు బల్లగుద్ది మరీ మొఖం మీదే చెప్పేశాడు. బీజేపీ-ఆరెస్సెస్ వాళ్లు నకిలీ హిందువులు. గోవులను మాతా అంటూనే వధించేందుకు అనుమతినిస్తున్నారు. రాముని పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేశారు. ఇప్పుడు హరిగోవింద గోవింద! డబ్బు గోవింద గోవింద! స్వర్ణం గోవింద గోవింద! వెండిగోవింద గోవింద! అని పాడుకోవాలి భక్తులు.
రాముణ్ణి కొలవటం, పూజించటం, ఆరెస్సెస్, బీజేపీ పుట్టక ముందు నుండే, ప్రజలు విశ్వాసంతో చేస్తూ ఉన్నారు. వాళ్ల కంటే ముందే దేశంలో రామ మందిరాలు, రామభజనలూ ఉన్నాయి. ఊరు ప్రజలు తమ ఆధ్యాత్మికతను చాటుకోవటం ఇప్పటిది కాదు, పూర్వం నుంచీ ఉంది, కానీ గుడి పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి వేలాది కోట్లు పోగేసి స్వాహా చేయటం మాత్రం ఇపుడు ఆరెస్సెస్, బీజేపీ అధికారం చేపట్టిన తర్వాతనే చూస్తున్నాము. రాజకీయాలలోకి రామున్ని లాగటం ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడంతా అధికారం, ధనం మీద అనురక్తి తప్ప భక్తికి తావేలేదు. ద్వేషమే తప్ప ప్రేమ లేనేలేదు. పగ తప్ప కరుణలేదు. ఈ పరిణామాలు అర్థంచేసుకుని విశ్లేషించుకోవాలి. రాముని పేరు చెప్పి అధికారం చేపట్టిన వాళ్లు ఆఖరికి ఆయనకే శఠగోపం పెట్టేశారు. వేల కోట్ల రూపాయలు భక్తులమని చెప్పుకునే వాళ్లే మింగేశారు. ప్రశ్నించేవాళ్లని దేశ ద్రోహులని పిలుస్తున్నారు. రాముని వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన అత్యంత ఆర్భాటంగా అయోధ్య రామ మందిర శంకుస్థాపన గావించారు. ఆ తర్వాత రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు పేరుతో ఆలయ నిర్మాణానికి ప్రపంచ వ్యాపితంగా, దేశంలోనూ విరాళాలు సేకరించారు. వేలకోట్ల రూపాయలను సమీకరించారు. దాదాపు 3500 కోట్లు సేకరించారని అంటున్నారు. అందులో 1800 కోట్లతో గుడి నిర్మాణం చేశారు. ఇక హుండీ ద్వారా రోజు ఆదాయం సమకూరుతూనే ఉంది. రామాలయ నిర్మాణానికి అవసరమైన భూమిని అప్పుడే అధిక మొత్తం వెచ్చించి, అంటే ఉన్న ధరకంటే చాలా ఎక్కువ చెల్లించి కొనుగోలు చేశారు. ఆనాడే ఈ అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ భక్తిని నింపి దాన్ని కప్పేశారు. ఇపుడు ట్రస్టు పేరుతో మందిర విరాళాలను స్వాహా చేశారు. ఏడున్నర కోట్ల నుండి 200 కోట్ల స్కాం జరిగినట్లు తెలుస్తున్నది. ఇంకా విశ్లేషకులు ఈ స్కాం వేలకోట్లలో ఉంటుందని చెబుతున్నారు. మొదట నిధుల అవినీతి జరిగిందని పొగ రాగానే ఎవరూ స్పందించలేదు.
సమాజ్ వాదీ నేత పవన్ పాండే మొదటగా ఆరోపించారు. రామజన్మ భూమి తీర్థా క్షేత్ర ట్రస్ట్ మాత్రం, విరాళాలు అవినీతి జరగలేదని కొట్టి పారేసింది. ఆ తర్వాత ప్రతిపక్ష నేతలు దర్యాప్తునకు డిమాండ్ చేయగా, చేయగా చివరికి యోగి ప్రభుత్వం ‘సిట్’ను నియమించి దర్యాప్తు చేపట్టింది. ఎనిమిది మంది భక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా సంఘ్ సభ్యులే. దర్యాప్తులో ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇప్పుడు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా ట్రస్ట్‌కు రాజీనామా చేశారు. ఇంకొక సభ్యుడు గోపాలరావు రాష్ట్రం విడిచి పారిపోయాడు. వీళ్లంతా వీహెచ్‌పి నేతలే. చాలా ఆలస్యంగా ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో రామమందిరాన్ని వ్యతిరేకించిన వారే స్కాం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి యోగి ఆరోపిస్తున్నారు తప్ప, అవినీతిపరుల గురించి ఒక్కమాట మాట్లాడటంలేదు.
రామమందిరం పేరుతో వసూలు చేసిన డబ్బుకు, బంగారం, వెండికి రశీదులు లేవు. లెక్కలూ లేవు. 2021లోనే 200 వెండి ఇటుకలు విరాళంగా ఇచ్చినట్లు విశ్వహిందూ సింధి సేవా సంఘం ప్రకటించింది. కానీ అవి ఇపుడు కనపడటంలేవు. వజ్రాలు పొదిగిన హారం, బంగారం, వెండితో చేసిన చరణ పాదుకలు చేయించి ఇచ్చానని ముంబయి జబల్‌పూర్‌కు చెందిన భక్తుడు చెబుతున్నాడు. అవిపుడు కనపడటం లేదని అతనే వాపోతున్నాడు. సీసీ టీవీలకు అడ్డంగా నిలబడి దోచుకోవటాన్ని పరిశీలించారు. అవినీతి జరిగిందని రుజువులు బయట పడుతున్నాయి. ఈ డబ్బుతోనే బెంగాల్, ఇతర రాష్ట్రాల ఎన్నికలలో ఖర్చు చేశారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
‘రామాలయ నిర్మాణం మేమే చేయగలిగాం అని గొప్పలు చెప్పే మోడీజీ అవినీతిపై ఇంకా ఏమీ మాట్లాడటం లేదు. కానీ ఆరెస్సెస్ వాళ్లు మాత్రం నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో ‘‘అవును అవినీతి జరిగింది. అవినీతిపరులైన జాతీయవాదులు కావాలా? అవినీతిపరులైన దేశద్రోహులు కావాలా?’’ అని పోస్టులు పెడుతున్నారు. దుర్మా ర్గాలను ప్రశ్నించేశారని వీరు దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. ప్రజల విశ్వాసాలను, భక్తిని కూడా తమ అధికారానికి, రాజకీయాలకు, స్వార్థానికి వాడుతున్న వీళ్లు అసలైన ప్రజాద్రోహులు.
రామా హరీ..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



