ఆర్థిక ఇబ్బందులే కారణమా..!
ఇటీవలే మరణించిన హాస్యచక్రవర్తి
ఖాన్ మరణంతో నాటకరంగంలో
ముగిసిన ఒక శకం
‘అద్రక్ కే పంజే`
నాటక ప్రదర్శనతో తెరపైకి
హాస్యం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం
1984లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
నవతెలంగాణ-జనరల్ డెస్క్
“ఏక్ ప్యాలీ చాయ్ పే బేచారా ఏక్ లతీఫా సునాతా థా భాయ్” అని చెప్పగానే ఒకప్పుడు చిన్న టీ కొట్టు దగ్గర పలువురిని తన హాస్యంతో నవ్వించి ఒక కప్పు టీ తాగే హాస్యచక్రవర్తి బబ్బన్‌ఖాన్ గుర్తొస్తారు. ఆ తర్వాత ‘అద్రక్ కే పంజే’ రచనతో గిన్నిస్ బుక్ రికార్డుకెక్కిన ఆ గొప్ప వ్యక్తి ఇల్లు నేడు అమ్మకానికి వచ్చింది. హైదరాబాద్‌లోని శాంతినగర్‌లో ఉన్న ఆయన ఇల్లు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణమా… అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఒకప్పుడు వీధి నాటకాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఇవి ప్రజలను అనేక సమస్యలపై చైతన్యవంతులను చేయడమే కాక హాస్యంతో ఆకట్టుకునేవి. కాలక్రమేణ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్ యుగం యువతరాన్ని ఆకర్శించింది. అయినా అప్పటి నాటకాలంటే నేటికీ చాలా మందికి ఎనలేని మక్కువ. అందులో నుంచి వచ్చిందే అద్రక్ కే పంజే (అల్లం కొమ్ములు )అనే ఒక భారతీయ వ్యంగ్య నాటకం. అద్రక్ అంటే అల్లం, పంజే అంటే కొమ్ము. అల్లానికి అనేక క్రమరహిత కాడలు ఉన్నట్టే, ఈ నాటకంలోని కథానాయకుడు అనేక మంది పిల్లలను కలిగి ఉండడం వల్ల అంటే కుటుంబ నియంత్రణ లేని సంసారం ద్వారా వచ్చే బాధలు, ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపించే కథే ‘అద్రక్ కే పంజే’ . ఈ కథ ద్వారా బబ్బన్ ఖాన్ కేవలం హాస్యాన్ని పంచడమే కాకుండా, తన నాటకం ద్వారా ప్రజలకు సామాజిక సందేశాన్ని కూడా బలంగా వినిపించారు. నాటకంలో బబ్బన్ ఖాన్ ఇంటికి రాగా పిల్లలంతా పాపా ఆగయే..పాపా ఆగయే అంటూ తండ్రిని చుట్టుకుంటారు. ఖామేష్ మై కామ్ సే అరాహహు..జైల్ సే నై..అంటూ సంభాషణ సభికులను నవ్వులు కురిపిస్తుంది.
అధిక సంతానం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు పడే ఆర్థిక ఇబ్బందులను తనదైన శైలిలో, వ్యంగ్యంగా ప్రస్తావించారు.
ఖాన్ బాల్యం..
1943లో హైదరాబాద్‌లో జన్మించిన బబ్బన్‌ఖాన్ బాల్యం నుంచే పేదరికాన్ని అనుభవించాడు. ఆయనకన్నా ముందు అతడి తల్లిదండ్రులకు పుట్టిన ఏడుగురు పిల్లలు పౌష్టికాహార లోపంతో చిన్నప్పుడే చనిపోయారు. ఈ పిల్లాడైనా బతుకుతాడన్న నమ్మకం లేక పదేండ్లు వచ్చే వరకు ఆయనకు తల్లిదండ్రులు పేరు పెట్టలేదు. ముద్దుగా బబ్బన్ అని పిలుచుకునేవారు. ఆ తర్వాత అదే పేరు స్థిరపడిపోయింది. బబ్బన్‌కు ఆరేండ్లు ఉన్నప్పుడే అతడి తండ్రి చనిపోయాడు. పేదరికంలోనే ఎలాగో బబ్బన్ డిగ్రీ పూర్తిచేశారు. ఒక కప్పు టీ కోసం టీకొట్టు వద్ద జోక్స్ చెప్పడం, రేడియో నాటకాల్లో పనిచేయడం వంటివి చేసేవారు. బబ్బన్ ఇంట్లో కనీసం కరెంటు కూడా ఉండేది కాదు. దీంతో రోజంతా వీధుల్లోనే గడిపేవాడు. నిజానికి ఆయన జీవితం కూడా దాదాపు సినిమా కథలానే ఉంటుంది.
అలా తన ఇరవయ్యేండ్ల వయసులో వీధి దీపం కింద కూర్చుని మూడు గంటల్లో చేసిన రచనే ‘అద్రక్ కే పంజే’. అధిక సంతానం కలిగి ఉన్న ఓ బ్యాంకు గుమాస్తా తన కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు అనుభవించిన కష్టాల్ని హాస్యరసభరితంగా చెప్పే నాటకంలో బబ్బన్ స్వయంగా నటించారు. దక్కనీ హిందీ, ఉర్దూల సమ్మేళనంతో సాగే ఈ ఏకపాత్ర నాటకం ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. కఠోర శ్రమ, నిబద్ధత, జీవితంలో విజయం సాధించాలనే బలమైన తపనతో ఆయన కీర్తి , గుర్తింపును పొందాడు.
1965 సెప్టెంబర్ 22న బబ్బర్ ఖాన్ ‘అద్రక్ కే పంజే’ తో తన మొట్టమొదటి ప్రదర్శనను ఇచ్చారు. పేదరికంలో పుట్టిన ఆయన ఈ ప్రదర్శనకు థియేటర్ , ప్రచార ఖర్చుల కోసం తన తల్లి ‘లచ్చా’ (పెళ్లైన భారతీయ మహిళలు మెడలో ధరించే బంగారు ఆభరణం)ను రూ.275 కు అమ్మేశాడు. అందులో నుంచి రవీంద్ర భారతిలో థియేటర్ కు రూ. 200, ప్రదర్శన కోసం టిక్కెట్లు ముద్రించడానికి రూ. 35 ఖర్చు చేశాడు. కానీ తన మొదటి ప్రదర్శన ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత ఓ నాటక కళపై ఆసక్తి వ్యక్తి .. తెర వెనుక ఉండి ప్రదర్శనను కొనసాగించడానికి అతనికి రూ. 500 ఇచ్చాడు. దీంతో ఆ నాటకం ఘన విజయం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
ఈ ప్రదర్శన 1965 నుంచి 2001 వరకు సాగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 1984లో దీనిని ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం ప్రదర్శించబడిన నాటకంగా పేర్కొంది. అప్పటికే ఈ నాటకం 10 వేల ప్రదర్శనలను పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలలో 27 విభిన్న భాషలలో సుమారు 3 కోట్ల మంది ప్రజలు ఈ నాటకాన్ని చూశారు.
స్నిప్పెట్స్
బబ్బర్‌ఖాన్ ప్రదర్శనకు న్యూయార్క్‌లో ప్రేక్షకులు 16 నిమిషాల పాటు నిరంతరాయంగా చప్పట్లు కొట్టారు . బబ్బన్ ఖాన్ ఇటీవలే మరణించారు. ఆ వార్తతో హైదరాబాద్ నాటక, కళా రంగాల్లో ఒక శకం ముగిసింది. ఆయనకు భార్య షైలా ఖాన్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
నాటక సారాంశం
‘అద్రక్ కే పంజే’ నాటకంలో కథానాయకుడి పేరు రామ్సు. ఆయన ఒక హైదరాబాదీ. అతనికి భార్య, చాలా మంది పిల్లలు ఉంటారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతూ, ఆ క్రమంలో భారీ అప్పులు చేస్తుంటాడు. రామ్సు పాత్రలో రచయితే స్వయంగా నటించారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి స్నేహితులు, పరిచయస్తుల నుంచి చిన్న మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకుంటాడు. ఆ తర్వాత వారితో రామ్సు ఎలా వ్యవహరిస్తాడనే దాని చుట్టూనే ఈ హాస్య కథ తిరుగుతుంది. రామ్సు భార్య బిపాషా. ఈమె తన భర్త సంపాదించే తక్కువ ఆదాయంతో బాధపడుతూ ఉండేది. ఇంటి ఖర్చులు చూసుకోలేకపోతున్నానని తరచూ భర్తకు ఫిర్యాదు చేసేది. తనకు ఓ చీర కావాలని అడుగుతుంది. దీనికి భర్త రామ్సు ఇచ్చే సమాధానం నవ్వులు పూయిస్తుంది. అదే విధంగా ఇంటి కిరాయి, పాల బిల్లు, పిల్లల ఫీజులు, కిరాణా వస్తువులకు ఆదాయం సరిపోక పడే ఇబ్బందులే ఇందులోని ప్రధాన అంశాలు. చివరికి ఈ నాటకం ‘కుటుంబ నియంత్రణ పాటించాలని, తక్కువ మంది పిల్లలను కనాలి’ అనే సందేశంతో ముగుస్తుంది. బబ్బన్ ఖాన్ హైదరాబాద్‌లో ఒక యాక్టింగ్ అకాడమీని సైతం నడిపారు. ఇందులో సంవత్స రానికి 8 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకునే వారు. అకాడమీ నుంచి యాక్టింగ్ సర్టిఫికేట్ సైతం ప్రదానం చేసేవారు. సోనియా గాంధీ నుంచి విదేశాల్లోనూ ఎన్నో ప్రశంసలు పోందారు.
అమ్మకానికి బబ్బన్ ఖాన్ ఇల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



