తెలంగాణ పోలీస్ అకాడమీలో కార్యక్రమం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీ అధికారుల కోసం మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ‘పని ప్రదేశాల్లో మహిళల భద్రత – పోష్ చట్టం అమలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు’’ అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మొత్తం 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా సీఐడీ డీజీ చారు సిన్హా హాజరయ్యారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ (పోష్) చట్టం గురించి సమగ్రంగా వివరించారు. మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే అనేక రకాల లైంగిక వేధింపులు ప్రత్యక్షంగానే కాకుండా, మాటలు, ప్రవర్తన, సంకేతాలు, ఇతర అనుచిత వ్యవహారాల రూపంలో కూడా ఉండవచ్చని తెలిపారు. అలాంటి సంఘటనలను మహిళలు సకాలంలో గుర్తించి, చట్టపరంగా అందుబాటులో ఉన్న రక్షణ వ్యవస్థలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. వివిధ వాస్తవ ఉదాహరణల ద్వారా పోష్ చట్టం ప్రాముఖ్యతను వివరించి, ప్రతి అధికారి మహిళలకు సురక్షితమైన కార్యాలయ వాతావరణాన్ని కల్పించే బాధ్యతను గుర్తుంచుకోవాలని వివరించారు. అనంతరం విమెన్ సేఫ్టీ వింగ్ కౌన్సిలర్ ఇషా శర్వాణి మహిళలు తమ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనే మానసిక, సామాజిక, వృత్తిపరమైన సవాళ్లు, లైంగిక వేధింపుల వివిధ రూపాలు, వాటిని ఎదుర్కొనే విధానాలపై ఉదాహరణలతో సోదాహరణంగా వివరించారు. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణ విషయంలో పోలీసు అధికారులు చట్టంపై పూర్తి అవగాహనతో వ్యవహరించి, సమాజంలో కూడా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ సతీశ్ లైజన్ అధికారిగా వ్యవహరించారు.
ప్రొబేషనరీ డీఎస్పీలకు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



