Sunday, July 5, 2026
E-PAPER
Homeసోపతిగ్రామీణ బాలలు, యువతకు విజ్ఞాన దీపిక

గ్రామీణ బాలలు, యువతకు విజ్ఞాన దీపిక

- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో స్థాపించబడిన ”భగత్‌ సింగ్‌ విజ్ఞాన కేంద్రం” గ్రామీణ విద్యార్థులు, యువతలో విజ్ఞానం, సామాజిక చైతన్యం, సజనాత్మకత పెంపొందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక ప్రగతిశీల వేదిక. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు పరిమితంగా ఉండటం, పుస్తక పఠనం అలవాటు తగ్గిపోవడం, పిల్లలు సాంకేతికతతో పాటు సామాజిక విలువలకు దూరమవుతున్న పరిస్థితులను గమనించిన గ్రామ యువత, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

అమరవీరుడు భగత్‌ సింగ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని 2024 మార్చి 23న ఈ విజ్ఞాన కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరెళ్ళ విఠళాచార్య, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ ముఖ్య అతిథులుగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించడం విశేషం. గ్రామీణ పిల్లల్లో పుస్తక పఠనం, విజ్ఞాన తపన, సామాజిక బాధ్యత, శాస్త్రీయ దక్పథం పెంపొందించాలనే లక్ష్యాన్ని వారు తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. ఈ విజ్ఞాన కేంద్రం కేవలం ఒక గ్రంథాలయం మాత్రమే కాద, గ్రామీణ సమాజానికి ఒక సాంస్కతిక వేదికగా, విద్యా చైతన్య కేంద్రంగా, యువతకు మార్గదర్శక వేదికగా రూపుదిద్దుకుంది. గ్రామంలో పిల్లలు చదువుకు మాత్రమే పరిమితం కాకుండా సమాజాన్ని అర్థం చేసుకునేలా, తమ ప్రతిభను బయటపెట్టేలా, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ఈ కేంద్ర ప్రత్యేకత.

ప్రారంభం నుంచే కేంద్రం అనేక వినూత్న కార్యక్రమాలతో గ్రామ ప్రజల ఆదరణ పొందింది. బాలల దినోత్సవం, సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ”బాలోత్సవం”లో దాదాపు 200 మంది బాలలు పాల్గొన్నారు. క్రీడలు, పాటలు, నత్యాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి పిల్లల ప్రతిభను వెలికితీశారు. గ్రామీణ బాలల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఈ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు కూడా పాల్గొనడం వల్ల గ్రామంలో విద్య, సంస్కతి పట్ల ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నాయి. గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ దేవిరెడ్డి వీరేందర్‌ రెడ్డి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి సుమారు 2000 మందికి కంటి పరీక్షలు చేయడం, అందులో 120 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడం గొప్ప సేవగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారాయి.

రక్త దానం చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ శుభ్రత, పోషకాహారం, వ్యాధి నివారణ వంటి అంశాలపై కూడా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంచుతున్నారు. ఇప్పటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డ్రగ్స్‌, మత్తు పదార్థాల వినియోగం,మూఢనమ్మకాలు, సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాలు ముఖ్యమైనవి. ఈ సమస్యలపై యువతలో చైతన్యం కల్పించేందుకు విజ్ఞాన కేంద్రం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. శాస్త్రీయ దక్పథం, తార్కిక ఆలోచన, మానవతా విలువలను పెంపొందించే కార్యక్రమాల ద్వారా యువతను సమాజపట్ల బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలు, కెరీర్‌ ఎంపికలపై ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, ఉన్నత విద్యా అవకాశాలపై సమాచారం అందించడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఉపయోగకరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు. పది, ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించడం ద్వారా ఇతర విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తి పెంపొందిస్తున్నారు.

పిల్లల మానసిక వికాసం కోసం తల్లిదండ్రులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఈ కేంద్రం ప్రత్యేకత. పిల్లలపై ఒత్తిడి లేకుండా చదువు పట్ల ఆసక్తి కలిగించడం, వారి ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం వంటి అంశాలపై తల్లిదండ్రులకు సూచనలు చేస్తున్నారు. విద్య అంటే కేవలం మార్కులే కాదు, వ్యక్తిత్వ వికాసం కూడా అంతే ముఖ్యమని ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నారు. పిల్లల్లో మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, పట్టుదల, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు స్ఫూర్తిదాయక సినిమాల ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు.అక్క చిలక, అనగనగా, దంగల్‌ , 12్‌ష్ట్ర ఫెయిల్‌, మా భూమి, రంగ్‌ దె బసంతి, సందేశాత్మాక లఘు చిత్రాలు వంటి సినిమాలు విద్యార్థుల్లో జీవితంపై సానుకూల దక్పథం పెంచడంలో దోహదపడుతున్నాయి. సినిమా ప్రదర్శనల అనంతరం చర్చా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచే అవకాశాన్ని కల్పిస్తున్నారు. శారీరక దఢత్వం, ఆత్మరక్షణ నైపుణ్యాల కోసం ఉచిత కరాటే శిక్షణ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతోంది. క్రమశిక్షణ, సమయపాలన, ధైర్యం వంటి లక్షణాలు కరాటే ద్వారా విద్యార్థుల్లో పెరుగుతున్నాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

పుస్తక పఠనం అలవాటు పెంపొందించేందుకు కథా పఠనం, గ్రూప్‌ రీడింగ్‌, పుస్తక చర్చలు, క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులకు కథలు చెప్పడం ద్వారా భాషా నైపుణ్యాలు, ఊహాశక్తి పెంపొందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుస్తక సంస్కతి క్రమంగా తగ్గిపోతున్న ఈ కాలంలో విజ్ఞాన కేంద్రం పిల్లలను పుస్తకాల వైపు మళ్లించడం విశేషం. పర్యావరణ పరిరక్షణపై కూడా విజ్ఞాన కేంద్రం ప్రత్యేక దష్టి పెట్టింది. మొక్కలు నాటడం, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం, గ్రామ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో పర్యావరణ బాధ్యత పెంపొందిస్తున్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ప్రోత్సహిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా పిల్లలకు సరైన అవకాశాలు లేక ప్రతిభ మరుగున పడిపోతుంది. అయితే మునిపంపుల భగత్‌ సింగ్‌ విజ్ఞాన కేంద్రం అలాంటి పరిస్థితులను మార్చే దిశగా ముందుకు సాగుతోంది. చదువు, విజ్ఞానం, సంస్కతి, సేవ, సామాజిక బాధ్యత వేదికగా ఈ కేంద్రం రూపుదిద్దుకుంది. గ్రామంలోని చిన్నారులు, యువతకు ఇది ఒక ఆశాకిరణంగా మారింది.

భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు, డిజిటల్‌ లైబ్రరీ, కంప్యూటర్‌ శిక్షణ, సైన్స్‌ ప్రయోగశాల, కెరీర్‌ గైడెన్స్‌ కేంద్రం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరైన అవకాశాలు కల్పిస్తే పిల్లలు ఎన్నో విజయాలు సాధించగలరని ఈ విజ్ఞాన కేంద్రం నిరూపిస్తోంది.
మొత్తానికి.. మునిపంపుల భగత్‌ సింగ్‌ విజ్ఞాన కేంద్రం ఒక సాధారణ గ్రంథాలయం కాదు. అది గ్రామీణ సమాజంలో విజ్ఞానం, చైతన్యం, సేవ, సంస్కతి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్న ప్రజా వేదిక. గ్రామీణ పిల్లల భవిష్యత్తును వెలిగించే విజ్ఞాన దీపికగా ఈ కేంద్రం మరింత అభివద్ధి చెందాలని గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి విజ్ఞాన కేంద్రాలు గ్రామ అభివృద్ధిని కోరుకునే విద్యావంతులు, ఉద్యోగస్తుల సహకారంతో గ్రామ గ్రామాన వెల్లివిరియాలి.

బొడ్డుపల్లి వెంకటేశం
9550425433

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -