విజయావారి మ్యాగమ్ ఓపస్ అనదగిన ‘పాతాళభైరవి’ సినిమాను బాలీవుడ్ హీరోయిన్ రేఖ ఎందుకో గాని ప్రివ్యూ వేసుకొని చూసింది. ఆ సినిమా ఆసాంతం చూసిన తర్వాత రాకుమారి ఇందుమతి పాత్రను పోషించిన నటి ముగ్ధత్వం, ఆమె అమాయకత్వంతో కూడిన నటన రేఖను ఇట్టే ఆకర్షించినవి. ప్రివ్యూ అనంతరం ఇంట్లోకి అడుగుపెట్టక ముందే గుమ్మంలో ఆమె తల్లి పుష్పవల్లి ఎవరో ఒక ముసలావిడకు ఏవో కొన్ని చీరలు, కొంత డబ్బు ఇచ్చి గౌరవంగా సాగనంపుతోంది. లోపలికి వస్తూనే రేఖ ”అమ్మా! పాతాళభైరవిలో హీరోయిన్ నటన ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? వీలైతే ఒకసారి ఆమెను కలవాలి” అంటూ ఆమె నటనలోని గొప్పతనాన్ని వివరిస్తూ మైమరచి మాట్లాడుతోంది. అంతా విన్న పుష్పవల్లి ”నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు ఒక ముసలావిడకు చీరలు, డబ్బు ఇచ్చి పంపుతున్నానే ఆమెనే ఆ హీరోయిన్” అని చెప్పడంతో ఆశ్చర్యపోయిన రేఖ వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ గేటు దాకా వచ్చి చూసింది. ఆ నటి తనకు మళ్ళీ కనిపిస్తే పలకరించాలని. కానీ అప్పటికే ఆమె వీధి మలుపు తిరిగి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఓ 10 ఏళ్లకు హైదరాబాదులో భారీ వర్షాలకు పైకప్పు కూలిన ఇంట్లో ఒక వద్ధురాలి శవం దొరికింది. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె ఇంట్లో ఒక పెట్టెలో ఉన్న ఫొటోలను చూస్తే ఆమె పాతాళభైరవి హీరోయిన్ అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఆమే అలనాటి అందాల నటి మాలతి.
తమ నటనతో ప్రేక్షకులకు సన్నిహితంగా ఉన్నట్టు కనబడి ప్రజాదరణ సంపాదించుకునే కోవకు చెందిన తార మాలతి. వాహినీవారి ”సుమంగళి”లో పార్వతిగా ఆమె ఆ తరం పేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆ చిత్రంలో ఆమె పాడిన ”వస్తాడే మాబావ” అనే పాట ఏళ్ళ తరబడి వాళ్ళ హదయాలలోనూ, పెదవులమీదా నాట్యమాడింది. మాలతి పుట్టింది ఏలూరులో. 1926లో. అంటే ఇది ఆమె శతజయంతి సంవత్సరం. తండ్రి గొల్లపూడి సూర్య నారాయణ ఆమె ఐదవ ఏటనే చనిపోయారు. దాంతో కుటుంబం పేదరికంలో చితికిపోయింది. అయినా మాలతి స్కూలుకుపోయి చదువుకుంది. సంగీతం నేర్చుకున్నది. నాటకాలలో పాల్గొన్నది.
మాలతిది బాల్య వివాహం. భర్త వీరాచారి నాటకాలంటే అమితమైన ఆసక్తి కలవాడు.
కొంత కాలం మోతేవారి కంపెనీలో ఉన్నాడు. తరువాత సురభి నాటక కంపెనీకి మేనేజరుగా కూడా పనిచేశాడు. ఆయన మాలతికి సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. కొద్దికాలం తర్వాత మాలతీ, వీరాచారీ మద్రాసు వచ్చారు. మాలతి కొన్ని గ్రామఫోన్ రికార్డులలో పాడింది, ”కచదేవయాని” డ్రామా రికార్డుల సెట్టులో పాల్గొనటమే గాక, సోలో పాటలు, ”నీలాల రంగులవాడు”, ”ఊగాలి ఉయ్యాల” పాటలు రికార్డు చేసింది. రికార్డింగ్ ప్రొగ్రాం ముగియగానే ఏలూరుకు తిరిగి వెళ్ళి పోయారు.
మోడరన్ సినీ టోన్ వారు తెలుగులో తీస్తున్న ‘ఉష’ (1939) చిత్రానికి మాలతికి సంగీతం నేర్పిన నల్లాన్ చక్రవర్తుల కష్ణమాచారిగారు కూడా పనిచేశారు. ఈ చిత్రంలో మాలతి ఒక వేషం వేయించడానికి వీరాచారిని ఒప్పించాడు. ఐతే వారి బంధువులు మాలతి సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు. కానీ వీరాచారి ప్రోత్బలంతో ఆమె అంగీకరించింది. ఉష చిత్రంలో మహారాష్ట్ర గాయనీ పద్మావతీ సాలిగ్రాం ఉషగా, మాలతి పార్వతీదేవిగా నటించారు. ఐతే ”ఉష” చిత్రం విజయవంతం కాలేదు.
కాని ఈ చిత్రమే మాలతిని సినిమా రంగంలో నిలబెట్టింది. వాహినీ వారి తొలి చిత్రం ”వందేమాతరం”లో దర్శకుడు బి.ఎన్. రెడ్డి, తాము తీయబోయే చిత్రాలలో నటించటానికి కుమారినీ, మాలతినీ బుక్ చేశాడు. రెడ్డిగారి రెండవ చిత్రం ”సుమంగళి”లోనూ మాలతి ఉపనాయికగా నటించినప్పటికీ, ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించింది. తన బావ కోసం కలలుగని, చివరకు అతను వేరొకరిని ప్రేమిండంతో వారిద్దరి మధ్యా తనకు స్థానంలేదని ఆత్మహత్య చేసుకునే అమాయక పాత్రను ప్రేక్షకులు మరువలేరు. బి.ఎన్.రెడ్డి దర్శక ప్రతిభతో మాలతి ఆ పార్వతి పాత్రలోని అమాయకత్వాన్నీ, గాంభీర్యాన్నీ చాలా చక్కగా ప్రదర్శించింది. ”వస్తాడే మాబావ” పాట పిక్చరైజ్ చేస్తున్నపుడు ఒక షాట్‌లో మాలతి గుండ్రంగా తిరుగుతుంది. ఈ షాట్ చాలాసార్లు తీయవలసి వచ్చింది. 20 టేకులు తీసుకున్న ఆమె నటనలో తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నది. తరువాత 1942లో కె.వి.రెడ్డి వాహినీ వారికి ‘భక్త పోతన’ తీస్తూ అందులో మాలతి శ్రీనాధుడి కుమార్తెగా నటింప చేశాడు. ‘భక్త పోతన’ అనంతరం మాలతి రేణుకావారి తొలి చిత్రం, ‘భాగ్యలక్ష్మి’లో నాయికగా, తర్వాత ”మాయా మచ్చీంద్ర”లో యువరాణి వేషం వేసింది.
కొడాక్, బెల్ పిక్చర్స్ సంస్థలలో పనిచేసిన శ్రీనివాసన్ మాలతికి తమిళ చిత్రాలలో నటించడానికి అవకాశాలు ఇప్పించాడు.
ఫలితంగా ఆమె 1944 – 1947 దాకా తమిళ మోడరన్ థియేటర్స్ వారి ”సుభద్ర”, జూపిటర్ వారి ‘మురుగన్, ‘రాజకుమారి’ చిత్రాలలో నటించింది. మురుగన్ టాకీస్ వారి ”రత్నకుమారి” తమిళ చిత్రంలో భానుమతీ, పి.యు. చిన్నప్పలతో నటించిందామె. 1947 తర్వాత కొద్దికాలానికి కె.వి.రెడ్డి గారు వాహినీ వారికి ”గుణసుందరి కథ” (1948-49) ప్రారంభించి, అందులో రెండవ రాజకుమారి హేమసుందరి పాత్రకు మాలతిని బుక్ చేశారు. కొంత నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ చిత్రంలోని పాత్రను మాలతి సమర్థవంతంగా పోషించింది. ఈ చిత్రంలో ఆమె నటన చూసిన కె.వి.రెడ్డి తను ఆ తర్వాత విజయా వారి కోసం నిర్మించబోయే ‘పాతాళభైరవి’లో హీరోయిన్ రాకుమారి ఇందుమతిగా ఎంపిక చేసుకున్నాడు. హీరో తోట రాముడుగా ఎన్టీరామారావు నటించాడు. ‘పాతాళభైరవి’ (1951) తెలుగు సినిమా చరిత్రలో మైలురాయి అనదగిన చిత్రం. ఆర్థికంగా భారీ విజయం సాధించింది. ఎన్టీఆర్‌కు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అటువంటి చిత్రంలో నాయికగా నటించిన ఖ్యాతి మాలతికి దక్కింది. రాకుమారి ఇందుమతిగా అమాయకత్వం, అందం, అభినయం కలగలిసిన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లోనూ మాలతే నాయిక. హిందీలో రాష్ట్ర భాష పరీక్షలో ఉత్తీర్ణురాలైన మాలతి పాతాళభైరవి హిందీ వెర్షన్‌కు సంభాషణలను తానే చెప్పుకున్నది. ‘పాతాళభైరవి’లో నటించే సమయంలోనే మాలతి సారథి వారి ‘అగ్నిపరీక్ష’, గోపీచంద్ ‘పేరంటాలు’ చిత్రాలలోనూ నటించింది. అయితే పాతాళభైరవి సినిమా భారీ విజయం తర్వాత ఎన్టీ రామారావుకు వచ్చిన ఆదరణ, అవకాశాలు ఎందుకో గాని మాలతికి రాలేదు. ఈ చిత్రం తర్వాత మాలతి సినిమా జీవితం ఒక రకంగా ఆగిపోయింది. దాదాపు మూడేళ్ళపాటు ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు. కొద్దికాలం విరామం తర్వాత మళ్లీ ఆమె ‘అంతే కావాలి’, గుబ్బి కర్ణాటక వారి ‘కాళహస్తి మహత్యం’లోనూ నటించింది. ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. ప్లేబాక్ పద్ధతిలేని రోజుల్లో గాన ప్రతిభ కలిగిన మాలతి సినిమాలలో ప్రవేశం సంపాదించుకున్నది. బి. ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డిల చిత్రాలు ఆమెను నటిగా నిలబెట్టినవి.
ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించిన నటి. ఆమె నీతిపతి, యారుక్కు సొంతం, రత్నకుమార్ వంటి తమిళ చిత్రాలతో పాటు విజయవంతమైన చిత్రం శ్రీ మురుగన్‌లో ఎం.జి.ఆర్.మాలతి చేసిన శివ-పార్వతి నత్య ప్రదర్శన ఆనాటి తమిళ ప్రేక్షకులకు మరపురాదు. జూపిటర్ వారి భారీ విజయవంతమైన రాజకుమారి (1947)లోనూ ఆమె ఎం.జి.ఆర్. సరసన నటించింది. ఎంజీఆర్ తొలి హీరోయిన్ ఘనత ఆమెదే. తెలుగు నటిగా ఇది అరుదైన కీర్తి. ఆమె దేవర్ చిత్రం వజవైత దైవంలో కన్నాంబతో పాటు తల్లి పాత్రను కూడా పోషించింది. పనామా పసమా, ఎజైప్పంగళన్, వాఙ్ఞవహరుక్కారు, వాఙవహరుక్కి రంగడు వంటి తమిళ్ చిత్రాల్లో నటించిందామె. ఈ నేపథ్యంలో ఆమె ఎవరు? పెళ్లి కానుక, టక్కరి దొంగ చక్కని చుక్క, అఖండుడు, ఆడ జన్మ వంటి తెలుగు సినిమాలు ఆమె తల్లి పాత్రలు పోషించింది.1979లో వచ్చిన ‘శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం’ ఆమె నటించిన ఆఖరి చిత్రం. హీరోయిన్‌గా నట జీవితాన్ని కొనసాగించిన మాలతి తన భర్త మరణం తర్వాత వేషాల కోసం మద్రాసు నుండి హైదరాబాదుకు తన మకాం మార్చవలసి వచ్చింది.
ఒకటీ అరా చిన్న చిన్న వేషాలు వస్తే వేసేది. ఆ తర్వాత అవి కూడా రాకుండా పోయినవి. ఆ దశలో రెండుపూటలా గుడికి వెళ్లి పూజారి ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునేది. తను నటిని అనే విషయం ఎవరికీ చెప్పేది కాదు. అలా అర్ధాకలితో, పస్తులతో కాలం గడిపేది. ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లించలేక అప్పట్లో కాచిగూడలో నిర్మాణంలో ఉన్న ప్రభాత్ థియేటర్ వెనక ఒక చిన్న రేకుల షెడ్డులో నివాసముండేది. భారీ వర్షం రావడంతో నిర్మాణంలో ఉన్న 20 అడుగుల థియేటర్ గోడ ఆమె ఉన్న షెడ్డుపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆరోజు 1979 నవంబర్ 25. అది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించేలోపే ఆమె చనిపోయింది. అప్పటివరకు వారికి ఆమె ఎవరో తెలియదు. ఇంట్లో ఉన్న ఒక ట్రంక్ పెట్టెను తెరిచి చూస్తే ఆమె ఎన్టీ రామారావుతో కలిసి దిగిన ఫొటోలు కనిపించాయి. అప్పుడు గాని వారికి ఆమె ఒకనాటి తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ పాతాళ భైరవి కథానాయక మాలతి అని తెలిసింది. ఫొటోలతో పాటు ఒక నోటు పుస్తకంలో ఆమె తను చివరి రోజుల్లో అనుభవించిన ఆర్థిక కష్టాలు, శోకం, ఖాళీ చేతులతో పడిన ఇబ్బందులు, కష్టాలు కడగండ్లు, దిక్కు తెలియని దైన్యాన్ని అక్షర రూపంలో రాసి ఉంచింది. వాటిని చదివిన వారికి కన్నీళ్లు ఆగలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక చివరికి అనామకంగా కన్నుమూసిన మాలతి తెలుగు సినిమా తొలితరం అభిమానులకు మరపురాని నటి. తాను నటించిన సినిమాలను ప్రదర్శించిన థియేటర్ గోడ కూలి మాలతి మరణించడమే మహా విషాదం.
( మాలతికి శతజయంతి నివాళి )
హెచ్.రమేష్ బాబు,
7780736386



