సుమారు 2 దశాబ్దాల క్రితం ఒక ఇంగ్లీషు వార్తాపత్రికలో మొదటి పేజీలో ఎదురుగా ఒక ఫొటో అచ్చువేయబడింది. అది ఆగస్టు 15కి ముందు వెనుక రోజున అనుకుంటా. ఆ ఫొటోలో కొంచెం తడిగా వున్న నేలమీద కొందరు మనుషులు అటు ముందుకు వెళ్లిన అడుగుల గుర్తులు, కొందరు మనుషులు ఇటు వచ్చిన అడుగుల గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ ఫొటో చూస్తే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, దేశ విభజన జరిగినప్పుడు, భారత పాకిస్తాన్ సరిహద్దుల వద్ద జరిగిన విపత్తు, వలస పోతున్న రెండు దేశస్థుల అడుగులను గుర్తు చేస్తున్న ఫొటోగా అచ్చువేయబడింది అనిపించింది.
ప్రాణ భయంతో హింసాకాండల మధ్య ఎందరో అటు పాకిస్తాన్ నుండి భారతీయులు, భారతదేశం నుండి పాకిస్తాన్ వారు ఇళ్లు, వాకిళ్లు వదిలి వలసపోయారు. అందులో ఎందరో కళాకారులూ వున్నారు. అందరి గురించి ఇక్కడ ఇప్పుడు మాట్లాడలేం కానీ పాకిస్తాన్ నుండి వచ్చేసిన ఒక భారతీయ స్త్రీ కళాకారిణి దమయంతీ చావలా విషయం మాట్లాడదాము.
దమయంతీ చావలా
ఈమె 1920లో లాహోర్‌లో జన్మించింది. ఆమె తండ్రి సర్జన్. 1938లో యూనివర్సిటీ నుండి హిస్టరీ, ఫిలాసఫీలో పట్టా పొందింది. ఆపై కళల మీద మక్కువతో భబేష్ చంద్ర సాన్యాల్ వద్ద చిత్రం నేర్చుకోవటానికి చేరింది. నిజానికి ఆమెకు మొదటి నుండి కళల మీద ప్రీతి. 1942లో లాహోర్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ నుండి పట్టా పొందింది. ఈమె మానవరూపాలు దిద్దటం ఎంతో అభ్యాసం చేసింది. ఆమె గురువు భబేష్ సాన్యాల్ చిత్రాల ప్రభావం కనిపిస్తుంది. ఆమె భర్త యమ్.ఎల్.చావలా ఆల్ ఇండియా న్యూస్ సర్వీసెస్ న్యూఢిల్లీలో డైరెక్టర్‌గా వుండేవాడు. 1960లో ఆయన మరణం తరువాత ఆమె లండన్ వెళ్లి 4 సంవత్సరాలు కళాభ్యాసం చేసింది. ఆపై 1969 – 1971 మధ్య పారిస్‌లో జీవించింది. ఆ సమయంలో ఆమె చాలా చిత్రాలు వేసింది. ఎన్నో యూరప్ ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె స్లేడ్ స్కూల్లో ముద్రణ కళ కూడా నేర్చుకుంది.
పంజాబ్ మ్యూజియంలోనూ ఫ్రెస్కో మ్యూరల్ చేసింది. 1953లో ఢిల్లీ ధూమిమల్ గ్యాలరీ వారు ఆమె చిత్రాలతో ఒక పుస్తకం అచ్చువేశారు. ఆమె చిత్రాలు రంగులతో నిండి వుంటాయి. ఆ రంగుల చిత్రాలు ఆకర్షణీయంగా దర్శకులను పట్టి వుంచుతాయి. రంగులే కాదు రూపాలూ అందంగా చిత్రించి ఒక సమతులన కనిపిస్తుంది. ఆమె చిత్రాలు ఎన్నో పల్లె స్త్రీలపై చిత్రించింది. రోజువారి కార్యక్రమాలలో మునిగివున్న స్త్రీల చిత్రాలవి. కొడవలి పట్టి పొలం పనిలో ఉన్న స్త్రీ, వంటింటి పనిలో స్త్రీ… ఇలాంటి చిత్రాలు వేసింది. కొన్ని గీతలలో రంగులు నింపి చక్కటి ఆకారాలు చిత్రిస్తుంది. ఎక్కువగా స్త్రీలే కనిపిస్తారు ఆమె చిత్రాలలో. వారు పంజాబు ప్రాంతపు స్త్రీల వస్త్రధారణలో కనిపిస్తారు. అవి సరిహద్దుకు అటువైపు పేద పల్లె జీవనాలా, ఇటువైపు పేద పల్లెలా చెప్పడం కష్టం. ఆ స్త్రీల ముఖాలు ఏ భావం కనిపించక కనుముక్కుల వివరాలు ఒకే ముదురు రంగులో వుంటాయి.
కళాకారులు తమ విచార రేఖలను పలు విధాలుగా తమ కళలలో వ్యక్తం చేస్తారు. ఈమె చిత్రాలు చూస్తే చూసే వారికి అందంగా కనిపించే ఈ రూపాల వెనుక దాగివున్న ఏదో తెలియని బాధని చెప్పీ చెప్పక చెపుతున్నట్టనిపిస్తుంది. మరి అది తన జన్మస్థలం వదిలి, ఊరువాడా వదిలి వలస పోయిన జీవన సమరం, అలా దాగివున్న బాధలా చిత్రింపడిందేమో మరి. ఆమె చిత్రించే రూపాలలో ఒక అమాయకత్వంతో పాటు ఒక నిర్లిప్తతా, నిశ్చబ్దమూ కనిపిస్తుంది. తిరిగి చూస్తే అమృతాషేర్‌గిల్ అనే ఒక కళాకారిణి చిత్రాల సరళి లాగే ఉంటాయి ఈమె చిత్రాలున్నూ. ఆ కళాకారిణి హంగరీ, భారతదేశం మధ్య తన గుర్తింపు కోసం వెతుక్కుంది.
దమయంతి కళలపై వివేచకురాలై వ్యాసాలూ రాసింది. 61 -62 లో ఢిల్లీలో ద టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దినపత్రికకు ఇల్లస్ట్రేటడ్ వీక్లీకి కళలపై రాసింది. బి.బి.సి. లండన్ వారి కోసం కళా వార్తలని ప్రచారం చేసింది. 62 -63లలో హిందూస్థాన్ టైమ్స్‌కి కళావార్తలు రాసింది. ఆన్‌లుకర్ అనే పత్రికకు తన యాత్రల విశేషాల గురించి రాస్తూ అందులో తను వేసిన చిత్రాలే ప్రచురించింది. ఆమెవి ఇక్కడ ప్రచురించిన చిత్రాలు ఛండీగఢ్ మ్యూజియంలోని ఆధునిక కళల విభాగంలో పొందుపరచి వున్నాయి.
ఇలా భారత దేశం వలస వచ్చిన కళాకారులు కొందరు ఢిల్లీలో కలిసి ఒక సమూహంగా ఏర్పడి కళలు సష్టిస్తూ ఆ సంస్థకు ఢిల్లీ శిల్పి చక్ర అని పేరు పెట్టి కొన్ని సిద్హంతాలతో పని చేశారు. ఆ విషయం రాబోయే వ్యాసాలలో మాట్లాడుదాము. సరిహద్దు దాటి భారతదేశం వలస వచ్చిన వారి కథ ఎలాగో అలాగే ఇటు నుండి అటు వెళ్లిన వారి కథలూ ఎన్నో. ఇలా సామాజిక, రాజకీయ విపత్తుల కారణంగా స్థానచలనంలో చెప్పలేని నెప్పిని చాలామంది కళాకారులు చాలా చోట్ల అనుభవించారు. 1947లో పాకిస్తాన్ భారతదేశం మధ్య పెద్ద సరిహద్దు గీతలు గీస్తే బాంగ్లాదేశ్ యుద్ధం జరిగిన సమయం మరికొన్ని గీతలు పడ్డాయి. ఆ సమయాన కొంతమందికి సమాజంలో స్థానచలనం కలిగింది. అందులో కళాకారులూ వున్నారు. మెహర్ అఫ్రోజ్ : ఆమె లక్నోలో జన్మించింది. తల్లిదండ్రులతో పాటు కరాచీకి 1971లో వలస పోయింది. లక్నోఫైన్ ఆర్ట్, కాఫ్ట్స్ర్ కాలేజీలో పట్టా పొందాక పాకిస్తాన్ వెళ్లిపోవలసి వచ్చింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధం విషయమూ, అందువలన జరిగిన రాజకీయ సామాజిక మార్పులు మనం విన్నవేను. కరాచీకి వెళ్లి ‘ఆస్నా’ అనే ఒక స్వచ్ఛంద సంస్థని ప్రారంభించింది. ఇందుతోడు వచ్చినవారు నీలోఫర్ ఫారూఖ్ అనే కళావివేచకుడు, షనాజ్ సిద్దిఖ్ అనే డిజైనర్. ఈ సంస్థ కళలు, జానపద కళల గురించి విషయాలు పొందుపరుస్తూ, కరాచీలో వున్న పాకిస్తాన్ ఆర్ట్ కౌన్సిల్‌లో భాగంగా పనిచేసింది.
ఆమె చిత్రాలు, ఆమె భావాలు, జ్ఞాపకాలపై ఆధారపడి వుంటాయి. ఆమె చిత్రాలు వెంటనే అర్థం కాకపోయినా, మనసులో గుర్తుండిపోతాయి. అలాగే ఆమె చిత్రాలలో ఆమె ఆలోచనలు వున్నాయని మటుకు అర్థం అవుతుంది. ఏకాంతంలోని ఆలోచనల లోతులు తెలిపినట్టుగా వుంటాయి ఆమె చిత్రాలు. చాలా తక్కువ రంగుల్లో ఒక నిశ్చబ్ద ప్రశాంతత చూపినట్టు వుంటాయి. చూడంగానే ఈ చిత్రంలోని అర్థం మరింత తెలిస్తే బాగుండు అనిపిస్తుంది. రూపాలు కూడా తక్కువే చిత్రిస్తుంది. ఆమె ఒక చిత్రంలో కమలాలు, కమలాల ఆకులూ, వీటి వరుస కింద మానవ శిరస్సులు చిత్రించింది. ఆ చిత్రం నిశ్శబ్దానికి ఒక ఉదాహరణలా అనిపిస్తుంది. కౌముది మల్లాది ఈమె కళలు జీవితంపై వ్యాసం రాస్తూ ”మెహర్ అఫ్రోజ్ భారతదేశంలో పెరగడం వల్ల తామరలను స్వచ్ఛంద చిహ్నాలుగా చిత్రిస్తుంది. లఘు చిత్రాలలో వుండే సమతల చిత్ర పద్ధతి ఆమె చిత్రాలలో కనిపిస్తుంది” అన్నది.
ఆమె చిత్రాలలో ఒక విచారం దాగి వుందా అని అనిపించక మానదు. భారతదేశంలో వున్నప్పుడు లక్నోలో ఆమె స్నేహితులు, ఉపాధ్యాయులు అందర్నీ విడిచి వెళ్లిన, వున్న ఊరు వదిలి కొత్త ప్రదేశం వెళ్లిన విచారమేమో! సమయంతో పాటు వెనుకబడిన ఆమె పాతరోజులు, మాసిపోయిన సమయాలు అని చెప్పటానికన్నట్టు ఆమె చిత్రాలల్లో ఒక మాపురంగుల రేఖలు కనిపిస్తాయి. కాగితాలపై చిత్రించి వాటిని ముక్కలుగా చింపి, ఒక వరుసపై మరో వరుస అంచులు పేరుస్తుంది. అలా చింపటం, కాల్చడం, పేర్చటం ఏదో దిగులుకు చిహ్నాలే కదా! ఇలా పేర్చిన అంచులు పెరుగుతున్న వయసు, పేరుకున్న మనసు బాధకు గుర్తులు. ఆ కాగితాలపై దేవనాగరిలో అక్షరాలు రాస్తుంది. అవి వాక్యాలుగా చదవటానికి కాదు. అవి స్వగతం లాంటివి. ఈ చిత్రాలు చూడటానికి పాతకాలపు రంగుమారిన కాగితాల్లా వుండి కోసుకుపోయిన జీవితపు అంచుల్లా కనిపిస్తాయి. మనకు తెలియకుండా మన జీవితం ఒక దారపు పొడవులు, వర్తులాలతో బంధించి, మనను ముందుకు నడిపిస్తుంది.
ఆ విషయ సూచన కోసం కొన్ని దారాలను ఒకదానితో ఒకటి కలుపుతూ చిత్రాలపై చూపిస్తుంది. సల్వత్ అలీ అనే పాకిస్తానీ కళావివేచకుడు ”ఆమె చిత్రం చాలా వరుసలు తీరి మాట్లాడుతుంది. ఉర్దూ సాహిత్యం, కవిత, జానపద కళల వారసంపద.. ఇవన్నీ ఆమె చిత్రానికి బలం చేకూరుస్తే, ఆమె లక్నో జ్ఞాపకాలు చిత్రానికి కథనాత్మకంగా భావాలు కూరుస్తాయి. ఇవి ఆమె ఆత్మకథ” అన్నాడు. తన మాతృభూమి లక్నో సంస్కృతి, సంపద ఒకనాటి హిందూ ముస్లింల స్నేహం గురించి చిన్న కబురు చెప్పినట్టు వుంటాయి ఆమె చిత్రాలు. ఆమెకు తనకు సరిహద్దుకు రెండు వైపులా స్నేహితులూ చుట్టాలూ వున్నారంటుంది. నిశ్శబ్ద భావాలను అందమైన చిత్రాలుగా ప్రదర్శిస్తుంది. ఆమె దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. (మెహర్ అఫ్రోజ్ జీవితమూ, కళలపై కౌముది మల్లాది, కళాదీర్ఘ అనే అంతర్జాతీయ పత్రిక, అక్టోబర్, 2010లో విపులమైన వ్యాసం రాసింది. ఇక్కడ పొందుపరిచిన మెహర్ అఫ్రోజ్ గురించిన విషయాలు ఆమె వ్యాసంలోనివి.)
డా||యం.బాలామణి, 8106713356



