Sunday, July 5, 2026
E-PAPER
Homeజాతీయంరోజుకు రూ. 8 లక్షలు కాజేశారు

రోజుకు రూ. 8 లక్షలు కాజేశారు

- Advertisement -

రామమందిరంలో కొల్లగొట్టిన విరాళాల సొమ్ము
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి..
ఎస్బీఐ సిబ్బంది పాత్రపై సిట్ విచారణ
ఈ అంశాన్ని పక్కదారి పట్టించేలా బీజేపీ,
ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కుయుక్తులు!


అయోధ్యలోని రామమందిరానికి భక్తులు కోట్లల్లో సమర్పించిన విరాళాల్లోంచి అక్రమార్కులు రోజుకు రూ. 6 నుంచి 8 లక్ష‍ల చొప్పున కాజేశారు. ఇటీవల రామమందిరంలో దొంగలు పడి కోట్లలో నగదును కొల్లగొట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అయోధ్యలో జరిగిన విరాళాల కుంభకోణం అంశాన్ని పక్కదారి పట్టించేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు, ఆర్ఎస్ఎస్ కుయుక్తులు పన్నుతున్నట్టు తెలుస్తోంది.

లక్నో : అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు వేగవంతమవుతోంది. దొంగతనం ఏ స్థాయిలో జరిగిందనే దానిపై దర్యాప్తు అధికారులకు ఇప్పుడిప్పుడే స్పష్టమైన అవగాహన వస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) విచారణలో రోజుకు ఎంత మొత్తం నగదు దొంగిలించబడిందనే దానిపై బ్యాంకు అధికారులు లెక్కతేల్చారు. బ్యాంకు గణాంకాల ఆధారంగా ఆలయ విరాళాల నుంచి రోజుకు రూ. 6 నుంచి రూ. 8 లక్షల వరకు దుర్వినియోగం చేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారుల అంచనా. అయితే ఈ దొంగతనం వెలుగులోకి రాకముందు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంకు ఖాతాలకు రోజుకు సగటున రూ. 16 నుంచి రూ. 18 లక్షల వరకు విరాళాలు వచ్చేవని బ్యాంకు సిబ్బంది సిట్‌కు తెలిపారు. అయితే రామమందిరంలో విరాళాలు కాజేసిన కేసు వెలుగులోకి వచ్చాక భక్తులు విరాళాలుగా సమర్పించుకుంటున్న నగదు రెట్టింపయ్యింది. అంటే ప్రస్తుతం ఆ మొత్తం రోజుకు రూ. 24 నుంచి రూ. 26 లక్షలకు పెరిగింది.

ఎస్బీఐ సిబ్బంది పాత్రపైనా విచారణ
ఆలయంలో నగదు విరాళాల లెక్కింపును ఎస్బీఐ పర్యవేక్షిస్తోంది. ఈ పని కోసం అది ఒక ప్రయివేట్ ఏజెన్సీని నియమించింది. నాలుగు విరాళాల పెట్టెలలో నగదు సమర్పణలు జరుగుతాయి. 11 మంది బ్యాంకు సిబ్బంది, ఆలయ ట్రస్ట్ నుంచి ముగ్గురితో సహా 14 మంది సభ్యుల బృందం ఈ నగదును లెక్కిస్తుంది. విచారణ సమయంలో కొంతమంది ఎస్బీఐ ఉద్యోగుల పాత్ర కూడా పరిశీలనలోకి వచ్చింది. సంఘ్ పరివార్ అండ ఉన్న చంపత్ రాయ్ బెదిరించాడా…లేక వారికి కొంత ముట్టజెబుతామనటంతో లాలూచీ పడ్డారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. అయితే డబ్బు ప్రవాహం , ఆర్థిక లావాదేవీలను లోతుగా దర్యాప్తు చేయాలని అయోధ్య పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ కూడా రాయనున్నారు.
ఉద్యోగ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగి , నిందితుడు అయిన సుభాష్ శ్రీవాస్తవ లెక్కింపు ప్రక్రియకు ఇన్‌చార్జిగా ఉన్నారు. విరాళాల పెట్టెల నుంచి నగదును బయటకు తీయడం, దానిని లెక్కింపు గదికి పంపడం, చివరకు ఎస్బీఐకి అప్పగించడం అతని బాధ్యత. ఆలయ వర్గాల సమాచారం ప్రకారం, ఆభరణాలకు సంబంధించి ఎప్పుడూ క్రమబద్ధమైన రికార్డు లేదు. దీనివల్ల దొంగతనం చేయడం చాలా సులభమైంది. ఫిబ్రవరిలో ఈ దొంగతనం మొదటిసారి వెలుగులోకి వచ్చిందని వర్గాలు తెలిపాయి. లెక్కింపు సమయంలో డబ్బు దొంగిలిం చబడుతోందని లెక్కింపు బృందంలోని సభ్యుడైన ఇన్‌చార్జి సుభాష్ శ్రీవాస్తవకు తెలియజేశారు. ‘‘ దేవుడు చూస్తున్నాడు. అది మీ ఇంట్లో నుంచో నా ఇంట్లో నుంచో వెళ్లడం లేదు కదా’’ అని శ్రీవాస్తవ సమాధాన మిచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. సిట్ ఇప్పటివరకు అరెస్టు చేసిన ఎనిమిది మంది నిందితులలో శ్రీవాస్తవ కూడా ఒకరు.

​చంపత్ రాయ్, అనిల్ మిశ్రా , 
గోపాల్ రావుల ఇంటరాగేషన్ రెండోసారి ప్రశ్నించిన సిట్
దర్యాప్తులో భాగంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీలు అనిల్ మిశ్రా , గోపాల్ రావులను సిట్ రెండోసారి ప్రశ్నించింది. అయితే ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత వీరి ముగ్గురూ తమ ట్రస్ట్ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికీ వాస్తవాలను దాచిపెట్టడానికి ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పుతు న్నదన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.

ట్రస్ట్ అధికారుల ఆస్తులపై నిశిత పరిశీలన
ట్రస్టు అధికారుల వ్యక్తిగత ఆస్తులు , ఆదాయ వనరుల గురించి ప్రశ్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి ముగ్గురి చరాస్తులు , స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను సిట్ కోరింది. అలాగే ఆస్తులకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని వారిని ఆదేశించింది. ఆలయ నిర్మాణం , భూమి కొనుగోళ్లలో కమీషన్లు తీసుకోవడం, అలాగే కొంతమంది వ్యక్తులకు అక్రమంగా లబ్ది చేకూర్చడం వంటి ఆరోపణలపై కూడా సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ ఆరోపణలకు సంబంధించి అనిల్ మిశ్రా , గోపాల్ రావులను ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం.గత కొన్నేండ్లుగా అనిల్ మిశ్రా , గోపాల్ రావుల ఆస్తులలో పెరుగుదల ఉన్నట్టు గుర్తించగా ఆ అంశాన్ని కూడా సిట్ పరిశీలిస్తోంది. అనిల్ మిశ్రా కొత్త నివాసం, ఆదాయ , ఆర్థిక వనరుల గురించిన సమగ్ర సమాచారాన్ని కూడా సేకరించారు. దర్యాప్తులో భాగంగా, ట్రస్ట్ యొక్క వార్షిక ఆడిట్ నివేదికలు, ఆర్థిక రికార్డులు , ఇతర కీలక పత్రాలను సిట్ పరిశీలనకు తెప్పించింది. ట్రస్ట్ ఆడిట్ నివేదికలను తిరిగి ఆడిట్ చేయించే విషయాన్ని కూడా సిట్ పరిశీలిస్తోందని సమాచారం. అయితే ఇంత చేశాక అయోధ్యలోని రామమం దిర చోరులపై చర్యలు తీసుకుంటారా..? లేక టాపిక్ ను డైవర్ట్ చేసి చేతులు దులుపుకుంటారా..? అనేది వేచి చూడాలి.

పార్క్ వద్ద డబ్బు పంపిణీ
మరొక పరిణామంలో.. ఆలయం సమీ పంలోని ఒక పార్కులో తమ సహచరుల మధ్య దొంగిలించిన డబ్బును పంచుకున్నట్టు నింది తుడు అవినాష్ శుక్లా పోలీసులకు తెలిపా డు. దర్యాప్తు అధికారులు నిందితుడిని ’14 కోశి పరిక్రమ’ మార్గంలోని భికాపూర్ సమీ పంలో ఉన్న పార్కుకు శుక్రవారం తీసుకెళ్లారు.

బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించిన సిట్
విచారణలో భాగంగా విరాళాల నగదును లెక్కించే పనిలో ఉన్న సిబ్బందిని , కొంతమంది బ్యాంకు అధికారులను సిట్ శుక్రవారం ప్రశ్నించింది. ‘ట్రస్ట్ , బ్యాంకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఎందుకు పూర్తిగా పాటించలేదు? నిర్దేశించిన విధానంలో మార్పులు ఎందుకు చేశారు? ఏదైనా దశలో అక్రమాలు జరిగినట్లు అనుమానం వస్తే ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించలేదు? ’ అని సిట్ బ్యాంకు అధికారులను ప్రశ్నించింది. భద్రతా సంబంధిత పనుల కోసం నియమించిన ప్రయివేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేత నగదు లెక్కింపు వంటి సున్నితమైన పనులు ఎందుకు చేయించారని కూడా నిలదీసింది. బ్యాంకు సిబ్బంది పాత్రకు సంబంధించిన వివరాలనూ సిట్ తన తుది నివేదికలో పొందుపరుస్తుంది. ఆ తర్వాత వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -