Sunday, July 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచేయూతలో అనర్హులు లక్ష

చేయూతలో అనర్హులు లక్ష

- Advertisement -

వారిలో మరణించిన వారు 70 వేల మంది..లైవ్ అథంటిక్ లో గుర్తింపు
అందుబాటులో లేని లబ్ది దారులు మరో 30 వేల మంది
వివిధ కారణాల వల్ల పింఛన్‌‌కు 50 వేల మంది దూరం
ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సర్కార్‌ ‌యత్నం

​నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో చేయూత పింఛన్‌ ‌పథకానికి సంబంధించి దాదాపు లక్ష‍ మందిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించింది. ఈ పథకం కింద ఒంటరి మహిళలు, వృద్ధులు మొదలగు 11 రకాలకు చెందిన వారు లబ్ది పొందుతున్నారు. ఇందులో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం లైవ్ ఆథెంటిఫికేషన్‌ (బతికున్నారనే ధృవీకరణ)ను చేపట్టింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు ఈ ప్రక్రియలో తాజాగా లక్ష‍ మంది అనుర్హులను గుర్తించారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకతను మరింత బలోపేతం చేసేందుకే ఈ ప్రక్రియను చేపట్టామని సర్కార్‌ ‌ చెబుతున్నప్పటికీ… ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 2023-24 లెక్కల ప్రకారం 44,49,767 మంది ఆసరా పింఛన్‌ ‌పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పలు రకాల వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత కార్మికులు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వికలాంగులకు రూ.4,016 మినహా మిగతా 10 కేటగిరిల్లోని వారికి నెలకు రూ.2,016 పింఛన్‌ అందుతోంది. వీరిలో గత ‌రెండేండ్లలో వివిధ కారణాల వల్ల దాదాపు రెండు లక్ష‍ల మందికి కోత పెట్టగా…నిజమైన చేయూత పింఛన్‌దారుల సంఖ్యను 42 ల‌క్షల మందిగా సర్కార్‌ ‌తేల్చింది. అందులో 19 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా కోర్ బ్యాంకింగ్ విధానంలో వారి ఖాతాలో పింఛన్‌ జమ అవుతోంది. అయితే తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్వహించిన పైలట్ పరిశీలనలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడటం తో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లైవ్ ఆథెంటిఫికేషన్ చేపట్టింది. ఈ ప్రక్రియలో మరో లక్ష‍ మంది అనుర్హులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారిలో 70 వేల మంది మరణించినప్పటికీ వారి పేర్లపై పింఛన్లు కొనసాగుతున్నట్టు తేలింది. కాగా మరో 30 వేల మంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదు. నమోదైన మొబైల్ నంబర్లకు పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పందన రాకపోవడంతో వారు వాస్తవంగా ఉన్నారా? లేక వారి పేర్లపై ఎవరైనా అక్రమంగా పింఛన్‌ పొందుతున్నారా? అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 90 శాతం మంది లబ్ధిదారుల ధృవీకరణ పూర్తికాగా, మరో 2 లక్షల మంది ధృవీకరణ మిగిలి ఉంది. సర్కారు ‌చేపట్టిన లైవ్ ఆథెంటిఫికేషన్ ప్రక్రియ ద్వారా నకిలీ, డూప్లికేట్, మరణించిన వారి పేర్లపై కొనసాగుతున్న పెన్షన్ చెల్లింపులకు అడ్డుకట్ట పడనుంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న అనవసర భారం తగ్గడంతో పాటు, అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మిగిలిన రెండు లక్షల మంది లబ్ధిదారుల లైవ్ ఆథెంటిఫికేషన్‌ను కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో కొత్తగా రెండు లక్షల మంది అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే గుర్తించిన అనర్హుల స్థానంలో అర్హులైన పేదలకు నూత‌నంగా పింఛన్లను మంజూరు చేస్తామని వారు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాకపోవటం గమనార్హం.

​ -వివిధ సమస్యల్లో 50 వేల మంది
కాగా రాష్ట్రంలో దాదాపు 50 వేల మంది పింఛన్లు సాంకేతిక, ఇతర కారణాల వల్ల నిలిచి పోయాయి. వీటిని రద్దు చేయడమా? సమస్యను పరిష్కరించి కొనసాగించడమా? అనే విషయాన్ని ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. దాదాపు 12 వేల మంది లబ్ధిదారుల ఆధార్ వివరాల్లో సమస్యలు ఉండగా, మరో 33 వేల మందికి బయోమెట్రిక్ ధృవీకరణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. వేలిముద్రలు సరిపోకపోవడం, ఐరిస్ స్కాన్ నమోదు కాకపోవడం వంటి కారణాలతో వీరి ధృవీకరణ పూర్తికాలేదు. ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. అలాగే దాదాపు 5 వేల మంది రాష్ట్రం వెలుపల నివసిస్తున్నట్టు గుర్తించారు. వీరిలో పలువురు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నట్టు ప్రాథమికంగా తేలింది. 700 మంది లైవ్ ఆథెంటిఫికేషన్‌కు సహకరించటం లేదు. వీరు పింఛన్ కొనసాగింపుపై ఆసక్తి చూపడం లేదని తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -