నవతెలంగాణ – హైదరాబాద్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్‌పై పోలీసులు విరుచుకుపడ్డారు. జంతర్‌మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీలతో ఆందోళనకారులను చెదరగొట్టారు.
మరోవైపు జంతర్‌మంతర్ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలతో ఇంటర్నెట్ సిగ్నల్ నిలిపివేసినట్లు సమాచారం. ఫోన్ ఇంటర్నెట్ డేటా సేవలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో స్టేషన్ల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. చలో పార్లమెంట్ కార్యక్రమం నేపథ్యంలో ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.



