నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో ఉన్న విశ్వభారతి విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరాహార దీక్షను ప్రారంభించారు. విద్యా రంగంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, వాంగ్‌చుక్ కు మద్దతు తెలుపుతు విశ్వవిద్యాలయానికి ఆనుకుని ఉన్న శాంతినికేతన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
“నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్ కారణంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ప్రాణాల విలువకు ఎవరు బాధ్యత వహిస్తారు? విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయరు? గత 20 రోజుల్లో ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపలేదు?” అని వారు ప్రశ్నించారు.
“ప్రభుత్వానికి నిజంగా విద్యార్థుల ప్రాణాల పట్ల శ్రద్ధ ఉంటే, వారితో చర్చలు నిర్వహించేవారు. మేము వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం, మా ఉద్యమంలో చేరాలని అందరికీ పిలుపునిచ్చాము,” అని విద్యార్థులు వెల్లడించారు.



