నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని హెచ్ కేలూర్ లో కొందరు వ్యక్తులు గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమించి, మురికి కాలువలను కబ్జా చేసి, షెడ్లను ఏర్పాటు చేసుకుని, వీటిమీద వ్యాపారాలు చేసుకుంటూ ఏండ్లుగా జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా రామ్ నగర్, బీసీ కాలనీలలో కూడా జీపీ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. అయితే తాజాగా గ్రామపంచాయతీ పాలకవర్గం కబ్జాకు పాల్పడిన వ్యక్తులను అందరినీ వదిలేసి, కేవలం ఒకే ఒక వ్యక్తి కబ్జా చేసిన స్థలాన్ని తొలగించడానికి తీర్మానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పాలకవర్గం కావాలనే నా ఒక్కడి స్థలాన్ని తొలగించడం అన్యాయమని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. తొలగిస్తే అందరి స్థలాలను తొలగించాలనీ, ఒక్కడి స్థలాన్ని తొలగించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఈ విషయమై సోమవారం వారు మూకుమ్మడిగా తహశీల్దార్ ముజీబ్ కు, ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డికి వేరువేరుగా వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అందరికీ సమన్యాయం చేయాలని పేర్కొన్నారు. ఒకరి స్థలాన్ని మాత్రమే తొలగిస్తే.. తహశీల్దార్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు. ఈ విషయమై కార్యదర్శి విజయ్ కుమార్ ను నవతెలంగాణ వివరణ కోరగా.. జీపీ స్థలాలు కొన్నేండ్ల కిందట కబ్జాకు గురైన సంగతే వాస్తవమేనని చెప్పారు. ఈ మధ్యనే వీరేశం అనే వ్యక్తి స్థలాన్ని తొలగించేందుకు గ్రామ పంచాయతీ తీర్మాణించిందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ సమస్య తీవ్రమైందని వివరించారు.



