నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (CGPSC) రాష్ట్ర సర్వీస్ పరీక్షల నిర్వహణలో అవినీతి, ప్రశ్నపత్రం లీక్, ఫలితాల తారుమారుకు సంబంధించిన కేసులో, ఆ కమిషన్ మాజీ చైర్మన్ తమన్ సింగ్ సోన్వానీని అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం తెలిపింది. ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002’ నిబంధనల ప్రకారం రాయ్‌పూర్ జోనల్ కార్యాలయం జూలై 25న సోన్వానీని ఈడీ అరెస్టు చేసింది. ఆయన్ని రాయ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు (PMLA) ముందు హాజరుపరచగా, కోర్టు ఆయనను జూలై 30, 2026 వరకు ఏడు రోజుల పాటు ED కస్టడీకి అప్పగించింది. 2020-2021లో జరిగిన CGPSC రాష్ట్ర సర్వీస్ పరీక్షల నిర్వహణలో నేరపూరిత కుట్ర, మోసం, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సోన్వానీ , ఇతరులపై రాయ్‌పూర్‌లోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, యాంటీ-కరప్షన్ బ్యూరో (EOW/ACB) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (FIR) , సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేపట్టిన దర్యాప్తు ఆధారంగా ED ఈ కేసులో విచారణను ప్రారంభించింది.
CGPSC చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సమయంలో సోన్వానీ, అక్రమ ప్రయోజనాల కోసం ప్రశ్నపత్రాలను లీక్ చేయడం, ఎంపిక ప్రక్రియను తారుమారు చేయడంతో పాటు, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటి ఉన్నత ప్రభుత్వ పదవులకు తన బంధువులను, తనకు అనుకూలమైన ఇతర అభ్యర్థులను అక్రమంగా ఎంపిక చేయించేందుకు ఇతర ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ED దర్యాప్తులో వెల్లడైంది.



