Wednesday, July 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం

తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం

- Advertisement -

కాజీపేట రైల్వే డివిజన్‌‌ను ఏర్పాటు చేయాలి
టైర్‌-2 నగరాల్లో ఐటీ విస్తరణకు కేంద్రం సహకరించాలి : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు కేటీఆర్‌ వినతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‌రాజకీయ ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంగళవారం న్యూఢిల్లీలో కేటీఆర్‌‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, పార్టీ సీనియర్ నేత జాన్సన్ నాయక్ కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్‌ ‌మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరఫున రైల్వే, ఐటీ రంగాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే సరైన సమయమని చెప్పారు. ప్రతిపాదిత కాజీపేట డివిజన్‌లో కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్, కాజీపేట–ఎర్రుపాలెం, డోర్నకల్–మణుగూరు, మోతమర్రి–విష్ణుపురం, కాజీపేట–వంగపల్లి రైల్వే స్టేషన్లను చేర్చాలని సూచించారు. ఈ డివిజన్ పరిధి సుమారు రెండు వేల ట్రాక్ కిలోమీటర్ల వరకు ఉంటుందని వివరించారు.
రైల్వే ఉద్యోగులు కూడా కాజీపేట డివిజన్ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. కేవలం 900 కిలోమీటర్లతో గుంటూరు డివిజన్, సుమారు 2,200 కిలోమీటర్లతో విజయవాడ, గుంతకల్ డివిజన్లు కొనసాగుతున్న నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం పరిపాలనా పరంగా, అభివృద్ధి పరంగా ఎంతో ప్రయోజనకరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.

మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌ పూర్తి చేయాలి
సిరిసిల్ల నియోజకవర్గానికి అత్యంత కీలకమైన 151 కిలోమీటర్ల మనోహరాబాద్–సిద్దిపేట–సిరిసిల్ల–వేములవాడ–కొత్తపల్లి న్యూ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును అత్యవసరంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందనీ, అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిపోయిందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కిందన్నారు. ఉచిత భూసేకరణ, రైట్ ఆఫ్ వే కల్పించడం, నిర్మాణ వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రత్యేక ఒప్పందం చేసుకోవడం వంటి చర్యలతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనులను వేగవంతం చేసిందని అన్నారు. దాని ఫలితంగా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 76 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తై, 2023 అక్టోబర్ మూడున ప్రారంభమైందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట–సిరిసిల్ల–వేములవాడ–కొత్తపల్లి మధ్య మిగిలిన 75 కిలోమీటర్ల పనులు పూర్తిగా మందగించాయని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించకపోవడమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన సుమారు రూ.416 కోట్లతోపాటు మరో రూ.511 కోట్ల నిధులు విడుదల చేయకపోవడం, ఇంకా 96 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేయకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో రాజ్యసభకు అధికారికంగా తెలిపిందని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టు ఆలస్యం కారణంగా మొదట రూ.1,160 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,780 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పరిశ్రమకు, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఈ రైల్వే లైన్ అత్యంత కీలకమని అన్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఈ రైల్వే లైన్ పూర్తయితే తెలంగాణకు భారీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

సిరిసిల్ల, వేములవాడ స్టేషన్లను అమృత్‌ ‌భారత్‌లో చేర్చాలి
సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకంలో చేర్చి ఆధునికీకరించాలని కేటీఆర్‌ ‌కోరారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌పై రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జికి ఆమోదం తెలపాలనీ, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ మొత్తాన్ని విద్యుదీకరించాలని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక హై-లెవల్ కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టును నిరంతరం సమీక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి కేంద్రం ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రకటించిన ‘పీఎం గతి శక్తి’ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని కోరారు.

టైర్-2 ఐటీ నగరాల పునరుద్ధరణకు సహకరించాలి
తెలంగాణ టైర్-2 ఐటీ నగరాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కేటీఆర్ అన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కు పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించే దిశగా పనిచేసిందని గుర్తు చేశారు. గ్రామీణ, పట్టణ యువతకు స్థానికంగానే నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడం, హైదరాబాద్‌పై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా 2020లో రూరల్ టెక్నాలజీ సెంటర్స్ పాలసీ, గ్రిడ్‌ పాలసీలను ‌తెచ్చి దాదాపు 50 వేల సాంకేతిక ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఆధునిక ఐటీ టవర్లు ఏర్పాటు చేశామన్నారు. సైయెంట్, టెక్ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం తెలంగాణ టైర్-2 ఐటీ మోడల్ విజయానికి నిదర్శనమని చెప్పారు. గత రెండేండ్లలో జిల్లాల్లో ఐటీ విస్తరణ మందగించడం, ఆక్యుపెన్సీ తగ్గడం, కొన్ని సంస్థలు కార్యకలాపాలను తగ్గించుకోవడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

తెలంగాణ టైర్-2 ఐటీ ఎకోసిస్టమ్ పునరుద్ధరణకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్ లేదా ఖమ్మంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ డిజైన్, డీప్ టెక్ రంగాలపై దృష్టి సారించే ఎస్‌‌టీపీఐ సెంటర్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. టైర్‌-2 నగరంలో ఎస్‌‌టీపీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌నీ, ఇప్పటికే జిల్లాల్లో నిర్మించిన ఐటీ టవర్లను వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ తదితర సాంకేతిక కార్యక్రమాలను తెలంగాణ జిల్లాలకు విస్తరించాలని ప్రతిపాదించామని వివరించారు. తెలంగాణలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విధానాలు సిద్ధంగా ఉన్నాయనీ, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణ టైర్-2 నగరాలు మరోసారి ఉపాధి, ఆవిష్కరణల కేంద్రాలుగా ఎదగడమే కాకుండా దేశవ్యాప్తంగా సమతుల్య డిజిటల్ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తాయని కేటీఆర్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -