అప్పటి పాలనా కుటుంబంలో ఉన్నందుకు క్షమాపణ కోరుతున్నా
నేరెళ్ళ బాధితులను పరామర్శించిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ – తంగళ్లపల్లి
నెరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదుల మీద కాంగ్రెస్ అధికారం అనుభవిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆ దాష్టీకం జరిగినప్పుడు రాష్ర్టాన్ని పరిపాలించిన కుటుంబంలో ఉన్నందుకు తాను సిగ్గుతో తలదించుకుంటూ క్షమాపణ అడుగుతున్నానని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నెరేళ్ల గ్రామానికి చెందిన బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన కోల హరీష్, పెంట బానయ్య కుటుంబాలను కూడా పరామర్శించారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ.. మన జీవితాలు బాగుపడతాయని అందరం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. పోలీసుల చేతిలో థర్డ్ డిగ్రీలో చితక బాధించేందుకేనా ఈ తెలంగాణ తెచ్చుకున్నదని ప్రశ్నించారు. ‘‘నెరేళ్ల ఘటన జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వంలోని కుటుంబంలో నేను కూడా సభ్యురాలినే.. అందుకు సిగ్గుతో తలదించుకుంటూ మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను’’ అని అన్నారు. కొందరి ధన దాహం కోసం ఎంతో మంది ప్రాణం కోల్పోయేందుకు కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీల కారణంగా ఒక బిడ్డ ప్రాణం పోతే ఇక్కడి ప్రజలు ఆందోళన నిర్వహించినందుకు పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ను ప్రశ్నిస్తున్నా..? ఈ దాష్టీకానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా..? అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఏం చేస్తున్నారు..? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి ఏమైంది..? జాతీయ ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చారు.. దాని రిపోర్ట్ ఇప్పటికీ రాలేదు. ఏమైందో బండి సంజయ్ చెప్పాలి’’ అని ప్రశ్నించారు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తామని, అవసరమైతే నెరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామని చెప్పారు.
ఎన్నికలకు ముందు నెరేళ్ల బాధితుల పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారని, కానీ 30 నెలలు గడిచినా ఇప్పటికీ వారి ఊసే ఎత్తలేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, వాళ్ల పిల్లల చదువుల ఖర్చు భరించాలని డిమాండ్ చేశారు.
నెరేళ్ల బాధితులందరికీ కచ్చితంగా ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణను రక్షించుకునేందుకే పెట్టిన పార్టీ అని చెప్పారు. నెరేళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట సిరిసిల్ల నియోజకవర్గ కన్వీనర్ ఎండి మజీద్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
సిగ్గుపడుతున్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



