2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ‘అభయ హస్తం మెనిఫెస్టో’ ప్రకటించింది. ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో 37 అంశాలతో పాటు ‘ఆరు గ్యారంటీలు’ హామీనిచ్చింది. ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని చెప్పింది. ఆరు గ్యారంటీలతో పాటు మరో ఆరు డిక్లరేషన్స్ కూడా ప్రత్యేకంగా ఆయా తరగతులకు హామీలు గుప్పించింది. రెండేళ్లు దాటింది. మూడవ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. కానీ,ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయా? పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది.
2023 డిసెంబర్ నుండి 2026 నేటి వరకు సుమారుగా డెబ్బయి వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. ఇప్పుడు 2026 జూన్ నాటికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటోంది. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. పైగా హామీల అమలు కోసం నిరుద్యోగ యువత ఉద్యమాలు చేస్తుంటే అణిచివేసే ప్రయత్నాలు చేస్తోంది. ప్రతినెలా రూ.4వేలు నిరుద్యోగ భృతి చెల్లింపు ఏమైంది? అలాగే వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు అనేక వాగ్దానాలు చేసింది. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని రూ.పదివేలకు పెంచుతామని ప్రకటించింది. కనీసం వారికి ఇచ్చే రూ.మూడు వేలు కూడా నెలనెలా ఇవ్వక అప్పులపాలు చేస్తోంది.
వైద్యరంగంలో మార్పేది?
వైద్యరంగంలో సమూలమార్పులు తెస్తామంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది. 2024లో ఇచ్చిన నాలుగు నోటి ఫికేషన్స్లో లక్ష దరఖాస్తులొచ్చాయి. ఇందులో నర్సులు, ఫార్మాసిస్టులు, ఎఎన్ఎం పోస్టులు రెండేళ్లయినా భర్తీ చేయలేదు. ఆరోగ్య రంగానికి బడ్జెట్ రెట్టింపు చేస్తామని పేర్కొంది. 2022-23లో కేసీఆర్ పభుత్వం రూ.10,954 కోట్లు కేటాయిస్తే, 2024-25 బడ్జెట్లో కాంగ్రెస్ రూ. 11,468 కోట్లు మాత్రమే కేటాయించింది. డబ్బులు పెరిగినా పర్సెంటేజీ రీత్యా చూస్తే 5శాతం నుండి 4.15శాతం తగ్గింది.
104 ఎఫ్‌డిహెచ్‌ఎస్ సేవలను గత ప్రభుత్వం రద్దుచేస్తే ప్రస్తుత సర్కార్ పునరుద్ధరించలేదు. గ్రామీణ ప్రాంతాలలో మొబైల్ వైద్యం పేదలకు ఎంతో ఉపయోగపడింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న జీపీ సిబ్బందికి ఉద్యోగ భద్రత, కనీస వేతనం అందజేస్తామంది. రెండేళ్ల తర్వాత వారికి మొండిచేయి చూపి పంచాయతీల్లోనే పన్నులు వసూలు చేసుకొని తీసుకోమ్మని ఉచిత సలహా ఇచ్చింది. కనీసం రూ. 9500లైనా ఇచ్చే పరిస్థితి లేదు. వార్డుమెంబర్స్కు నెలకు రూ.1500 ఇస్తామని హామీనిచ్చింది. ఏమైనా జీఓ తెచ్చిందా? ఇకపోతే ఎంపిటిసి, జెడ్పిటిసిలకు పెన్షన్ ఇస్తానంటోంది. ఇది నమ్మశక్యమేనా?
ఉద్యోగుల డిఎలు పెండింగ్
ప్రభుత్వ పెన్షన్‌దారులకు బకాయిలిచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకు ఐదు డిఎలు పెండింగ్‌లో పెట్టింది. అధికారంలోకి వచ్చిన పదిహేను రోజులలో సప్లిమెంటరీ బిల్లులు చెల్లిస్తామని చెప్పింది. రూ.11 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. రెండేళ్లు దాటింది. రిటైర్ అయిన వారు కొందరు తమ డబ్బులు కళ్లతో చూడకుండానే చనిపోయారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పింది. మూడు లక్షల మంది ఎదురు చూస్తున్నారు. పదిశాతం చొప్పున ప్రాన్ అకౌంట్స్‌లో వేలకొట్లు జమ చేసుకుంది. రిటైర్మెంట్స్ సందర్భంగా తిరిగి చెల్లిస్తుందా? ఆ డబ్బులు ఉన్నాయా షేర్ మార్కెట్స్‌లోకి వెళ్లాయా లెక్కలే చెప్పడం లేదు. జి.ఓ.నెం 317 బాధితులు నేటికి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న పరిస్థితి ఉంది.
పి.ఆర్.సి. వెంటనే ప్రకటించి ఆరునెల్లలోపు సిఫారసులు అమలు చేస్తామన్న హామీ ఎప్పుడో అటకెక్కింది. 2023 జూలై నుండి నేటి వరకు 32 నెలలయ్యింది. ఇది ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేయడం కాదా? ఏడు వేల మంది ఫీల్డ్ అసిస్లెంట్లకు, 26వేల మంది ఆశాలకు, ఐకెపి వారికి తక్షణమే వేతనాలు పెంచుతామని నమ్మబలికింది. ఆందోళనలు పోరాటాలు చేసినా కనీసం స్పందన లేదు. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్‌లో వివిధ పరిశ్రమల్లో సుమారు కోటి మంది కార్మికులు పని చేస్తున్నారు. 2024 జనవరిలో 73 రంగాలలో జీతాలు సవరించినట్లు చేసి డ్రాపులిచ్చింది. రెండేళ్లు దాటినా జీఓలు నేటికి ఇవ్వలేదు. కెేసీఆర్ బాటలోనే రేవంత్ సర్కార్ వట్టి కాగితాలతో అన్యాయం చేసింది. కార్మికుల శ్రమను పెట్టుబడిదారులు మరింత దోచుకోవడానికి అవకాశం కల్పించింది. పదిహేనేళ్లుగా పారిశ్రామిక కార్మికుల వేతనాలు సవరణే జరగలేదు.
ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితేంది?
ఆర్టీసీ ఉద్యోగులను హామీలతో పరవశింపచేసింది. ప్రభుత్వంలో విలీనం చేస్తామంది. రెండు పి.ఆర్.సి. బకాయిలు వెంటనే చెల్లిస్తామంది. పి.ఆర్.సి. పరిధిలోకి తీసుకొస్తామని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొంది. యూనియన్స్ పునరుద్ధరిస్తామంది. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మళ్లీ వాళ్లంతా ఉద్యమబాట పట్టాల్సి వచ్చింది. ఆటో డ్రైవర్స్‌కు ఏడాదికి రూ.12వేల ఆర్ధిక సహాయం, వారికి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ పట్టించుకున్న దాఖలాల్లేవు. అంగన్వాడీలందరికి నెలకు రూ.18వేలకు పెంచుతామని, ఇ.పి.ఎఫ్ పరిధిలోకి తెస్తామని నమ్మబలికింది. నేటికి నెరవేర్చకపోవడంతో యూనియన్ ఉద్యమబాట పట్టింది. సచివాలయ ముట్టడిస్తే లాఠీదెబ్బలు, అరెస్టులతో పోరాటాన్ని అణచివేసే ధోరణిని ప్రభుత్వం ప్రదర్శిస్తోంది.
రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వారిలో 2014 పి.ఎఫ్ కటాఫ్ తేదిని తొలగించి ‘చేయూత’ పెన్షన్ అందిస్తామని చెప్పింది. జీవితబీమా, ఈఎస్ఐ పరిధిలోకి తెస్తామంది. అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామంది. తోపుడుబండ్ల వ్యాపారాలకు గుర్తింపు కార్డులు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రతి మండలంలో ‘హమాలీ నగర్’ పేరిట ఇండ్లు కేటాయిస్తామని చెప్పింది. వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిందా? జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇళ్ల స్థలాలు, పెన్షన్, మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల నగదు ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? ‘జర్నలిస్టు హెల్త్ స్కీం’, హోంగార్డుల జీతాలు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది. వీటిలో ఏం అమలు చేసిందో సమాధానం చెప్పగలదా? లక్షల మంది కార్మికులు నష్టపోయారు.
అసంతృప్తిలో అనేక రంగాలు
వీరితో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచడంలేదు. మున్సిపల్, మిషన్ భగీరథ, మెడికల్ అండ్ హెల్త్, సర్వశిక్ష అభియాన్, యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రయివేటు ఇంజనీరింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అనేక రంగాలలో వారు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో వున్నారు. విద్యుత్ రంగంలోని 23 వేల మంది ఆర్టిజన్స్ సర్వీసు కన్వర్షన్ కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెర వేరలేదు.
పైగా ‘పాడి ఆవు’ మాదిరి భావించి సింగరేణి నిధులను పిండుకొని వివిధ పథకాలకు వాడుకుంటున్నది. సింగరేణి బకాయిలు 42 వేల కోట్లు ఇవ్వకపోవడంతో రానున్న కాలంలో సింగరేణి భవిష్యత్ ప్రశ్నార్ధకమౌతుంది.మరో ఏడాది దాటితే ఎన్నికల వాతావరణం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నా బడ్జెట్‌ను సవరించాలి. సామాజిక రంగాలకు కేటాయింపులు పెంచాలి. నిధులను అన్నివర్గాల ప్రజలకు పక్షపాతం లేకుండా అమలు చేయాలి. లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వలే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ దోషిగా నిలబడకతప్పదు.
భూపాల్
9490098034



