Tuesday, August 25, 2026
E-PAPER
Homeఖమ్మందమ్మపేటలో సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ

దమ్మపేటలో సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ

- Advertisement -

– నివాళులర్పించిన సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట 

సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డికి సీపీఐ(ఎం) దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం దమ్మపేటలోని సుందరయ్య భవన్‌లో పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యులు దొడ్డా లక్ష్మీనారాయణ అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. తొలుత సీనియర్ నాయకులు యండ్రాతి అప్పారావు మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) దమ్మపేట మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. సారంపల్లి మల్లారెడ్డి పార్టీకి, రైతాంగ ఉద్యమానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీపీఐ(ఎం) అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పనిచేశారని తెలిపారు.

మల్లారెడ్డి తన స్వగ్రామంలో పోలీసు పటేల్‌గా, పంచాయతీ సర్పంచ్‌గా, కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా నాలుగు దశాబ్దాలపాటు ప్రజాసేవ చేశారని గుర్తుచేశారు.సీపీఐలో చీలిక సమయంలో మార్క్సిస్టు పార్టీ వైపు నికరంగా నిలిచి చివరి వరకు పార్టీ కోసం పనిచేశారని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీటిని సాగుకు వినియోగించేందుకు ప్రాజెక్టుల నిర్మాణంపై ఆయనకు విశేష అవగాహన ఉండేదన్నారు. సహకార సంఘాలు, పంచాయతీరంగంపై కూడా మంచి పట్టు ఉన్న మేధావిగా ఆయనను కొనియాడారు.

ఢిల్లీలో 13 నెలలపాటు సాగిన రైతాంగ ఉద్యమంలో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి, రైతాంగ ఉద్యమానికి తీరని లోటని అన్నారు. మల్లారెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తామని పేర్కొంటూ ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి నాయుడు, రైతు సంఘం దమ్మపేట మండల అధ్యక్షులు మోరంపూడి రామమోహనరావు, సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు, అశ్వారావుపేట మండల కమిటీ సభ్యులు కుంజా మురళి, దమ్మపేట మండల కమిటీ సభ్యులు పెనుబల్లి వెంకటేశ్వరరావు, పెనుబల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -