నవతెలంగాణ – అశ్వారావుపేట
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. నారంవారిగూడెం కాలనీ (బురుగు గుంపు)కు చెందిన మేడి నరసింహారావు (38–40) కనిపించకుండా పోయినట్లు ఆయన భార్య మేడి సావిత్రి అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పామాయిల్ గెలలు కటింగ్ కూలీగా పనిచేస్తూ జీవిస్తున్న నరసింహారావు ఈ నెల 11 న రాత్రి సుమారు 8 గంటల సమయంలో కుటుంబ కలహాల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. సెల్‌ఫోన్‌ను సైతం ఇంట్లోనే వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బంధువుల ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో భార్య పోలీసులను ఆశ్రయించారు.
ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి:
అదృశ్యమైన నరసింహారావు ఎత్తు సుమారు 5.5 అడుగులు, చామనఛాయ కలిగి ఉంటారని పోలీసులు తెలిపారు. చివరిసారిగా లైట్ బ్లూ (స్కై బ్లూ) రంగు గళ్ల చొక్కా, తెలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.



