కార్పొరేట్ శక్తుల లాభాల కోసమే విత్తన చట్టంలో మార్పు
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలు
నవంబర్‌లో నల్లగొండలో కిసాన్ సభ జాతీయ మహాసభలు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
కేంద్ర ప్రభుత్వం నూతన వాణిజ్య విధానం పేరుతో దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తోందని, కార్పొరేట్ శక్తుల లాభాల కోసమే కొత్త విత్తన చట్టాన్ని తీసుకువస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో గురువారం రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని గపూర్ పాషా అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పన్నేండ్లుగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. రైతులకు నష్టం చేకూర్చే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా రైతులు 385 రోజులు పోరాటం చేసి ఆ నల్ల చట్టాలను తిప్పికొట్టినట్టు తెలిపారు. అయినా, దొడ్డి దారిన ప్రయివేట్ విత్తన చట్టం తెచ్చి విత్తనాలపై రైతులకు కాకుండా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా చట్టాలు మార్చారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం నూతన వాణిజ్య విధానం పేరుతో అమెరికా, కెనడా, న్యూజిలాండ్ దేశాల నుంచి విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు పంపించి 52శాతం వ్యవసాయ రంగం పై ఆధారపడ్డ మన దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18 వరకు 36వ ఏఐకేఎస్ అఖిల భారత మహాసభలు జరగనున్నాయని తెలిపారు. రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు సూడి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, తుమ్మల వెంకట్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఎండి దావూద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తీగల ఆదిరెడ్డి, చిట్టెం ఆదినారాయణ, వడకాపురం సారయ్య, ఎండీ యాకూబ్, బండారి నరసింహులు, ఎల్పి ముత్యాలు, మంచాల రామారావు, గుండు రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.



