మూడేండ్లయినా పరిష్కారానికి నోచుకోలే
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా
మద్దతు తెలిపిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు
జీవో 97ను రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం : మాజీ మంత్రి, హరీశ్‌రావు
ఉద్యోగుల సమస్యలు సీఎంకు తెలుసు : ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నవతెలంగాణ-సుబేదారి
మూడేండ్లయినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరిగిన మహాధర్నాలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగులంతా తమ కార్యాలయాల నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉద్యోగుల ధర్నానుద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలన్నీ సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించేందుకు రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం మాజీ మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, కె.రాజయ్య, సతీష్‌కుమార్ ధర్నా వద్దకు చేరుకుని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఉద్యోగుల సమస్యలు అలాగే ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా ఉద్యోగుల ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ముఖ్యంగా హెల్త్ కార్డ్ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అదే విధంగా పాత పెన్షన్ ను పునరుద్ధరిస్తామని, మెరుగైన పీఆర్సీ అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘీభావం సమయంలో పోలీసులు హరీశ్‌రావును అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సుబేదారి పోలీసుస్టేషన్ వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే విద్యార్థులు ఢిల్లీని ముట్టడిస్తారని హెచ్చరించారు. అనంతరం జిల్లా జేఏసీ చైర్మెన్ ఆకుల రాజేందర్, ఆకావరపు శ్రీనివాస్ కుమార్, పీఆర్‌టీయూ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, డీటీఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ రాజు, పెండెం రాజు మాట్లాడారు. మహాధర్నా అనంతరం జేఏసీ నేతలు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు బైరి సోమయ్య, పనికెల రాజేష్, డాక్టర్ ప్రవీణ్, కొమురయ్య, కట్కూరి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి, కామగోని రాంబాబు, వేమూరి రాంబాబు, కొడం రవి ప్రకాష్, విజయ్‌కుమార్, సరస్వతి, వెంకట్రామిరెడ్డి, సర్వర్ హుస్సేన్, గోపాలరెడ్డి, ధర్మరాజు, భాస్కర్, కిరణ్‌గౌడ్, రాజేష్, శ్యాంసుందర్, రాము నాయక్, పావని, గోపి కృష్ణ, జ్యోతి, జయంతి, సలీం, రాజమౌళి, రాజేష్‌ఖన్నా, రాజీవ్, ప్రణయ్, పృద్వీ, శృతి తదితరులు పాల్గొన్నారు.



