నవతెలంగాణ-హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడినందుకు అతడికి రూ. లక్ష జరిమానా విధించింది. పలు ఆరోగ్య సమస్యల కారణంగానే ఫోన్ వాడాల్సి వచ్చిందని భిందర్ వివరణ ఇవ్వడంతో అతడు నిషేధం నుంచి తప్పించుకున్నాడు. కేవలం జరిమానా విధించి అతడిని బీసీసీఐ హెచ్చరించింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్లు మొబైల్ ఫోన్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్లేయర్ అండ్ మ్యాచ్ ఆఫిషియల్స్ ఏరియాలో మాత్రం అనుమతి లేదు. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు భిందర్పై చర్యలు తీసుకున్నారు. అయితే ఇది ఆయన తొలి తప్పిదం కావడంతో కేవలం జరిమానా, హెచ్చరికతో సరిపెట్టారు. ‘ఇది అందరికీ హెచ్చరికగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.



