లారీ క్యాబిన్ సాక్షిగా గెలిచి..
నవతెలంగాణ – మల్హర్ రావు
రహదారి పక్కన నిలిచిన లారీ.. చేతిలో ఆవిర్లు కక్కే ఒక చిన్న పేపర్ టీ కప్పు.. ముఖమంతా వికసిస్తూ పెల్లుబికిన ఒక కల్మషం లేని నవ్వు నేడు సామాజిక మాధ్యమాల్లో లక్షల మందిని నవ్విస్తున్న ఒక వైరల్ మీమ్ అది. కానీ.. క్షణికావేశాల రీల్స్ విపణి చూడలేని ఒక అసలుసిసలైన జీవన సంగ్రామం ఆ నవ్వు వెనుక దాగి ఉంది. ఆ కుర్రాడి పేరు అరుణ్ కుమార్. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలం, కోర్లకుంట గ్రామానికి చెందిన ఒక సామాన్య శ్రామిక బిడ్డ. కుటుంబ కటిక పేదరికం. పదేళ్ల పసిప్రాయంలోనే పలకా బలపాన్ని లాగేసుకుని, నాలుగో తరగతితోనే బడికి దూరం చేసింది. బొగ్గు గనుల దుమ్ము, లారీ చక్రాల కింద క్లీనర్గా కాయకష్టం అతడికి నిత్య జీవితంగా మారాయి.
అదే బొగ్గు లోడింగ్ పాయింట్ వద్ద రోజంతా చెమటోడ్చి, స్నానం చేసి కొత్త చొక్కా తొడుక్కున్న వేళ.. టీ తాగుతూ లారీ డ్రైవర్ నెహ్రూ వేసిన ఒక చిన్న జోకు అరుణ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. కొత్త బట్టలు ఎక్కడ పాడవుతాయోనన్న అమాయకపు భయంతో టీ కప్పును కాస్త దూరంగా జరుపుతూ అతడు నవ్విన ఆ నవ్వులో పేదరికం గీసిన గీతలు లేవు. రేపటి గురించిన దిగులూ లేదు. నిష్కల్మషమైన అమాయకత్వం మాత్రమే ఉంది. ఆ కొన్ని క్షణాలను నెహ్రూ తన ఫోన్ కెమెరాలో బంధించి సరదాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది లక్షల మంది హృదయాలను తాకిన వైరల్ దృశ్యంగా మారింది. నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఎవరు కామెడీ రీల్ చేసినా, కితకితలు పెట్టే ఒక యూనివర్సల్ రియాక్షన్ మీమ్ఎ ఆ ముఖం స్థిరపడిపోయింది.
అయితే.. ఈ కథ అక్కడితో ముగిసిపోలేదు. లక్షల మంది రీల్స్ చేసుకుంటూ ఆ నవ్వుతో కాలక్షేపం చేస్తుంటే, ఆ వీడియో కింద వచ్చిన వేలాది కామెంట్లను కూడా చదవలేని అరుణ్ నిరక్షరాస్యతను చూసి లారీ డ్రైవర్ నెహ్రూ మనసు కదిలిపోయింది. తనూ పేదరికం వల్ల చదువు ఆపేయాల్సి వచ్చిన బాధను ఎరిగిన నెహ్రూ.. అరుణ్ జీవితం లారీ చక్రాల కిందే ముగిసిపోకూడదని సంకల్పించాడు. ప్రయాణాల బడలిక నడుమ లారీ క్యాబిన్నే తరగతి గదిగా మార్చాడు. హైవేల పక్కన లారీ హెడ్లైట్ల వెలుతురులో అక్షరాలు నేర్పించాడు. పుస్తకాలు కొనిచ్చాడు, ఫీజులు చెల్లించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాయింపజేశాడు. అరుణ్ పదో తరగతి గడప దాటి తన జీవితంలో అసలైన గెలుపును అందుకున్నాడు.
డిజిటల్ విపణి ఆ నవ్వును వాడుకుని కోట్ల వ్యూస్ ఆర్జించుకుంది. కానీ.. అతనికి ఏ రాయల్టీనీ ఇవ్వలేదు. అయితేనేం.. ఈ వర్చువల్ ప్రపంచపు కృత్రిమ లెక్కలతో సంబంధం లేకుండా, లారీ క్యాబిన్ నుంచి మొదలైన ఆ అక్షర ప్రయాణం అరుణ్ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టింది. గురువుగా మారిన ఒక లారీ డ్రైవర్ హృదయ సంస్కారానికి, పట్టుదలతో నిలబడ్డ ఒక శ్రామిక బాలుడి సంకల్పానికి ఇది నిలువెత్తు నిదర్శనం. పేదరికం, కష్టాలు ఎన్ని చీకట్లను సృష్టించినా.. సంకల్పం, మంచి మనుషుల తోడు ఉంటే ఆత్మవిశ్వాసం చిగురిస్తుందనడానికి అరుణ్ జీవన ప్రయాణమే ఒక తిరుగులేని స్ఫూర్తి. ఆనాడు బొగ్గు మసిని దాటుకుని రోడ్డు పక్కన వికసించిన ఆ స్వచ్ఛమైన నవ్వు, రేపటి విజయాల వైపు సాగుతూ నవ సమాజానికి వెలుగులు పంచుతూ ఎప్పటికీ అలాగే పదిలంగా వెలగాలి. జీవితంలో ఎప్పుడైనా అరుణ్ ఎదురైతే గట్టిగా హత్తుకోవాలనే మాబోటి వారి ఆకాంక్ష వెనుక.. ఈ సమాజానికి నిస్వార్థంగా నవ్వును, శ్రమను, సమయాన్ని ధారపోసే అసంఖ్యాక శ్రామికుల పట్ల ఉండే ప్రగాఢమైన గౌరవం ఉంది. లోకం ఆ శ్రమకు తగిన విలువ కట్టకపోయినా, మానవత్వపు విలువ ఎప్పటికీ నిత్యనూతనంగా వర్ధిల్లుతూనే ఉంటుంది.



