Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంఎన్‌సీఈఆర్‌టీలో మళ్లీ కాషాయ ముద్ర

ఎన్‌సీఈఆర్‌టీలో మళ్లీ కాషాయ ముద్ర

- Advertisement -

11, 12 తరగతుల పాఠ్య పుస్తకాలరూపకల్పనకు కొత్త కమిటీలు
ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు, ఏబీవీపీ మాజీ నేతలకు చోటు
గతంలో పొలిటికల్ సైన్స్ పుస్తకాల కమిటీలోనూ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సభ్యులు

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠ్యపుస్తకాలు ఇక విద్యా నిపుణుల పరిధిలోనే ఉండాలా? లేక అధికారంలో ఉన్న రాజకీయ శక్తుల సిద్ధాంతాలకు అద్దం పట్టాలా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. 11, 12 తరగతుల ఎకనామిక్స్, ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల రూపకల్పన కోసం ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన కొత్త కమిటీల్లో ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు, ఆరఎసఎస్ అనుబంధ ఏబీవీపీ మాజీ జాతీయ నేతకు చోటు కల్పించడం వివాదానికి దారితీస్తోంది. ఇప్పటికే పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల కమిటీలో ఆర్‌ఎస్‌ఎస్ తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న సభ్యులను నియమించారన్న ఆరోపణల నేపథ్యంలో తాజా నియామకాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విద్యా విధానంపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

న్యూఢిల్లీ : జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 11, 12 తరగతుల కోసం కొత్త ఎకనామిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ పాఠ్యపుస్తకాలను రూపొందించేందుకు రెండు కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీల్లో ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మాజీ జాతీయ మీడియా కన్వీనర్‌కు స్థానం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ విద్యా విధానం-2020 కింద ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. గత నెలలో 11, 12 తరగతుల పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో కనీసం నలుగురు సభ్యులకు ఆరఎసఎస్‌తో ప్రత్యక్షం గా లేదా పరోక్షంగా సంబంధా లున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎకనా మిక్స్, ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల కమిటీల్లోనూ అధికార, ఆరఎసఎస్ అనుబంధ నేపథ్యం కలిగిన వ్యక్తులకు చోటు దక్కడం అనేక విమర్శలకు దారితీస్తోంది.

ఏబీవీపీ సాకేత్ బహుగుణకు చోటు
ఎకనామిక్స్ పాఠ్యపుస్తకాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీకి ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎం – ఈఏసీ) సభ్యుడు సంజీవ్ సన్యాల్ నేతృత్వం వహించనున్నారు. అదే మండలికి చెందిన మరో సభ్యురాలు షమికా రవి కూడా కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ పాఠ్యపుస్తకాల కమిటీలో ఢిల్లీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిందీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సాకేత్ బహుగుణకు సభ్యత్వం ఇచ్చారు. బహుగుణ ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న సమయంలో ఆరఎసఎస్ అనుబంధ ఏబీవీపీతో పనిచేశారు. 2014లో ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం సంస్థ జాతీయ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

అప్పట్లో హింసను సమర్థించి…
2017లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌జాస్ కాలేజీ వివాదం సమయంలో బహుగుణ ఏబీవీపీ ప్రముఖ ప్రతినిధుల్లో ఒకరిగా వ్యవహరించారు. అప్పటి జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పాల్గొనాల్సిన సెమినార్‌ను ఏబీవీపీ సభ్యుల నిరసనల నేపథ్యంలో రద్దు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఘర్షణలు చోటుచేసుకోవడం, భావప్రకటనా స్వేచ్ఛ, క్యాంపస్ రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగడం తెలిసిందే. ఏబీవీపీపై అప్పట్లో వచ్చిన హింస ఆరోపణలను బహుగుణ సమర్థించారు. ఏబీవీపీ సభ్యుల నుంచే బెదిరింపులు వచ్చాయన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.
17 మంది సభ్యులతో కూడిన ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల కమిటీకి హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వైస్ చాన్స్‌లర్ ఎన్. నాగరాజు అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిటీలో త్రివిక్రమ కుమారి జమ్వాల్ కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె మేవార్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. 2017లో ఆమె కుటుంబం తరఫున ఆమె సోదరుడు అప్పటి ప్రధాని మోడీకి లేఖ రాస్తూ సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘పద్మావతి’కి సర్టిఫికేషన్, విడుదలను నిలిపివేయాలని కోరారు.

భారతీయ జ్ఞాన వ్యవస్థలు చేర్చేలా ఆదేశాలు
కొత్త పాఠ్యపుస్తకాల్లో సమానత్వం, సమ్మిళితత్వం, విద్యార్థుల వయస్సుకు తగిన బోధనా పద్ధతులు, విలువల విద్య, సమాచార-సాంకేతిక పరిజ్ఞానం, భారతీయ జ్ఞాన వ్యవస్థలు, పర్యావరణ విద్య వంటి అంశాలను చేర్చాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీలకు సూచించింది. పాఠ్యపుస్తకాలు సిద్ధమైన తర్వాత సాంస్కృతిక మూలాలతో అనుసంధానం, భారతీయ జ్ఞాన వ్యవస్థలు, సమ్మిళితత్వం, విద్యా సాంకేతికత, మూల్యాంకనం వంటి అంశాలు సరిగా ప్రతిబింబించాయో లేదో సమీక్షిస్తామని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. ఎకనామిక్స్ కమిటీ తన పనిని 2027 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కమిటీ 2027 సెప్టెంబర్ నాటికి పాఠ్యపుస్తకాల రూపకల్పన పూర్తి చేయాలని నిర్ణయించారు.

విద్యా వర్గాల్లో ఆందోళన
అయితే వరుసగా పాఠ్యపుస్తకాల అభివృద్ధి కమిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ నేపథ్యం కలిగిన వ్యక్తులు, కేంద్ర ప్రభుత్వ సలహా వ్యవస్థలోని సభ్యులకు చోటు కల్పిస్తుండటంపై విద్యావర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యను రాజకీయ, సైద్ధాంతిక ప్రభావాల నుంచి దూరంగా ఉంచాల్సిన సమయంలో పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఒకే భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠ్యపుస్తకాలు పాఠాలు నేర్పే పుస్తకాలు మాత్రమే కావనీ, ఒక తరం ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ప్రధాన సాధనాలని విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వ హయాంలో ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల మార్పులు, కమిటీల నియామకాలు విద్యా సంస్కరణల కోసమా లేక అధికార పార్టీ మాతృసంస్థ ఆరఎసఎస్ భావజాలాన్ని భవిష్యత్ తరాలకు చేరవేసే ప్రయత్నమా అన్న ప్రశ్న మరింత బలపడుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -