ఉత్సాహంగా బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీ
సీఎం పాత్రలో తలసాని
మంత్రి ఉత్తమ్ పాత్రలో పల్లా
రెవెన్యూ మంత్రి పొంగులేటిని ఇమిటేట్ చేసిన గంగుల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభ నుంచి సస్పెండైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు పోటీగా మాక్ అసెంబ్లీని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రధానంగా మాక్ అసెంబ్లీ ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, భారీనీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా ఇది సాగింది. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీకి మాణిక్‌రావు స్పీకర్‌గా వ్యవహించారు. ఆయా పాత్రలు పోషించిన ఎమ్మెల్యేలు పదునైన విమర్శలు చేస్తూనే జోకులు వేస్తూ నవ్వులు కురిపించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల అమలు చేయకపోవడంతో సీఎం, మంత్రులపై చురకలంటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత్రలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసారి శ్రీనివాసయాదవ్ ఒదిగిపోయారు. హైదరాబాద్ యాసలో సీఎంపై విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలకమైన విషయాల్లో ఆయన చెప్పిన మాటలను వ్యంగ్యంగా మాట్లాడుతూ నవ్వులు పూయించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మెరిశారు. ఒక సందర్భంలో ఉత్తమ్ తాను ప్రిపేర్ కాలేదంటూ చెప్పిన విషయాన్ని పల్లా జోకులు జోకులుగా చెప్పి నవ్వించారు.కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన తీవ్రమైన విమర్శలు గుప్పించారు. 22ఏపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రను మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోషించారు.
భూములను కొల్లగొట్టేందుకు వేలాది ఎకరాలను 22ఏలో పెట్టారంటూ విమర్శలు గుప్పించారు. మాక్ అసెంబ్లీ లో సీఎం పాత్రధారి తలసాని మాట్లాడుతూ తాము 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాం.. కానీ 25 ఏండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, ఈ సమయంలో ఎప్పుడైనా అమలు చేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ తో సమస్య, పార్టీలోసమస్య, చివరకు బీఆర్‌ఎస్‌తోనూ సమస్యే ఉందన్నారు. ఇలా తనకు ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో సహ ప్రాజెక్టులన్నీ నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్మించినవేనని ఎద్దేవా చేశారు. అందర్నీ తొక్కుకుంటూ ముఖ్యమంత్రి వరకు ఎలా వచ్చాననే విషయాన్ని అడిగితే చెప్తానని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. వేసవి కాలంలో ఎన్ని టన్నుల ధ్యానం వచ్చిందో తనకు తెలియదన్నారు. పొంగులేటి పాత్రధారి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బును ఇప్పుడు సంపాధించుకోవాలి కదా? అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నాయకులు తానొక్కడినే కమీషన్లు తీసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ భారతీ కాదు…భూ హారతి చేస్తామన్నారు. సమస్య ఏదైనా సెటిల్ మెంట్ లతోనే పరిష్కారమవుతుందని తెలిపారు. మాక్ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డితోపాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



