Saturday, September 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి

అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి

- Advertisement -

వాటిని పేదలు, దళితులకు పంచాలి : సీపీఐ(ఎం) రాష్ర్ట కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో

శాసనసభ వేదికగా 22ఎ నిషేధిత భూములు, ‘ధరణి’ అక్రమాలు, భూ కబ్జాలపై ప్రభుత్వం ఆదేశించిన విచారణ కేవలం అరకొర చర్యలతో లేదా రాజకీయ కక్షసాధింపులతో సరిపెట్టకుండా పారదర్శకంగా జరగాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆపార్టీ రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 388 ఎకరాల ప్రభుత్వభూమి, మైహోం రామేశ్వరరావు 2,647 ఎకరాల భూదాన్ భూమి, రేవంత్‌రెడ్డి కుటుంబం 308 ఎకరాల భూములు కొల్లగొట్టాయనే ఆరోపణలు వున్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ల ఆధీనంలో ఉన్న అక్రమ అసైన్డ్, భూదాన్, వక్ఫ్, ఫారెస్ట్ భూములన్నింటిపై తక్షణమే విచారణ చేసి, వాటిని స్వాధీనం చేసు‌కోవాలని కోరారు. ఆ భూముల్ని గ్రామీణ ప్రాంతాల్లోని భూమి లేని దళిత, గిరిజన, నిరుపేద కుటుంబాలకు సాగుకోసం, పట్టణ ప్రాంతాల్లో పేదలకు నివాస స్థలాలుగా పంపిణీ చేయాలని సూచించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబంతో పాటు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులతో పాటు, సత్యం రామలింగరాజు, రామోజీ ఫిల్మ్‌సిటీ పరిధిలోని వందలాది ఎకరాల సీలింగ్, భూదాన్ భూములను కార్పొరేట్ శక్తులు నకిలీ ఎన్‌ఓసీలు, రికార్డుల ట్యాంపరింగ్‌తో కొల్లగొట్టారని ఆక్షేపించారు.

దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేదలు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోల్పోయారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి కొండూరు, కొండరెడ్డిపల్లి గ్రామాల్లోని 308 ఎకరాల భూమి, వారి సోదరుడి ‘టెస్సరాక్‌’ కంపెనీకి తక్కువ ధరకే రూ. 200 కోట్ల విలువైన భూముల కేటాయింపు, మరియు 22ఎ మినహాయింపుల పేరుతో 30 శాతం కమీషన్ల వసూళ్లపై ప్రతిపక్షాలు చేసిన తీవ్ర ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చే‌శారు. ధరణి, భూభారతి పోర్టల్‌లో సాంకేతిక లోపాలు, ఇతర పొరపాట్ల వల్ల 22ఎ నిషేధిత జాబితాలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతుల ప్రయివేటు పట్టా భూములను తక్షణమే ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌‌ చేశారు. భూదాన్, సీలింగ్ భూములపై సమగ్ర ఫొరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, విచారణ నివేదికల ఆధారంగా శాసనసభ ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఈ అంశంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి భూ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -