Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగుమ్మడాల రాజుతో అరుణోదయకు ఎలాంటి సంబంధం లేదు

గుమ్మడాల రాజుతో అరుణోదయకు ఎలాంటి సంబంధం లేదు

- Advertisement -

మోసాలకు పాల్పడుతున్నాడంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
రాష్ట్ర అధ్యక్షుడు ముల్లార్, ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్ ప్రకటన
నవతెలంగాణ – హైదరాబాద్‌ : పరిగి ప్రాంతంలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన గుమ్మడాల రాజుతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF)కు ఎలాంటి సంబంధం లేదని సమాఖ్య రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 18న విడుదల చేసిన ప్రకటనలో పలు ఆరోపణలు చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంతో రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చుకున్న అరుణోదయ పేరును ఉపయోగించుకుంటూ గుమ్మడాల రాజు గతంలో రాయలసీమ ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజలను ఆర్థికంగా మోసం చేసి, రాజకీయంగా వంచించాడని సమాఖ్య ఆరోపించింది. అనంతరం పరిగి ప్రాంతానికి తిరిగి వచ్చాడని పేర్కొంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేశాడని, ఈ విషయాలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే బెదిరింపులకు పాల్పడ్డాడని ప్రకటనలో ఆరోపించారు. ప్రజలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఈ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కొంతకాలం క్రితం అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. సంఘం నాయకత్వం అతని తప్పులను గుర్తు చేసినప్పటికీ మార్పు రాలేదని, తన కళా నైపుణ్యాలను ప్రజా ఉద్యమాలకు వినియోగించకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించారు. ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తున్నాడని, జాతర పేరుతోనూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
పరిగి ప్రాంత ప్రజలు అతని మోసాలకు సహకరించవద్దని, మరోసారి మోసపోవద్దని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా గుమ్మడాల రాజుకు, అరుణోదయకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అతని అక్రమాలకు సంబంధించి ఆధారాలు లేదా బాధితులు ఉంటే తమకు సమాచారం అందించాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -