అక్టోబర్ 9న పోలింగ్,
17న ఫలితాలు
ఉద్యోగ, కార్మికుల్లో హడావిడి
విలీనం తర్వాతే ఎన్నికలంటున్న సంఘాలు
ఎన్నికల కోడ్ జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూల్ విడుదలైంది. ఎనిమిదేండ్లుగా ఎన్నికల కోసం కార్మికులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికుల్లో హడావిడి పెరిగింది. ఈనెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో విలీనం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గత కాలంగా కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 9న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ చేపడతారు. అదే నెల 17న ఫలితాలు ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌తోపాటు రాష్ట్రంలోని 97 డిపోలను పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. గత 2016 జులై 19న ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు చివరిసారి నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇదే కావడం గమనార్హం. గుర్తింపు సుంఘం ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. ఆర్టీసీలో అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో గెలిచిన సంఘాలనే గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. ఈ గుర్తింపు సంఘాలు రీజియన్, రాష్ట్రస్థాయిలో ఉంటాయి.
రెండింటికీ వేర్వేరు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తారు. కార్మికుల వేతనాలు, బోనస్‌లు, డీఏలు, సర్వీస్ నిబంధనలు తదితర సమస్యలపై సంస్థ యాజమాన్యంపై ప్రభుత్వంతో చర్చలు జరిపే చట్టబద్దమైన హక్కు గుర్తింపు సంఘంగా ఎన్నికైన సంఘానికే ఉంటుంది. కార్మికుల తరపున ఒప్పందాలు చేసుకోవడంలోనూ గుర్తింపు సంఘం కీలకంగా వ్యవహరిస్తున్నది. రీజియన్‌లో పనిచసే అధికారి స్థాయి మినహా మిగతా ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికులందరికీ ఓటు హక్కు ఉంటుంది. 2018లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పటి ప్రభుత్వం నిర్వహించలేదు. తాజా ప్రభుత్వ మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఆయా సంఘాలు ఎన్నికల ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల్లో ప్రచారం చేస్తున్నాయి. కొన్ని సంఘాలు డిపో కమిటీలు సైతం కొత్తగా నియమించాయి. మరికొన్ని సంఘాలు కార్మికుల సమస్యలపై ధర్నాలు, ఆందోళన చేస్తున్నాయి. కార్మిక శాఖ ధోరణిపై సైతం నిరసనకు పిలుపునిచ్చాయి. ఎన్నికలు నిర్వహించాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సైతం సమర్పించాయి. ఎన్నికల కోడ్‌ను సైతం జారీ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఓటింగ్ హక్కు ఉంటుంది. ఉద్యోగ విరమణ చేసినవారికి, సెలవులో ఉన్నవారిని , దీర్ఘకాలం సెలవు పెట్టిన వారికి ఓటు హక్కు వర్తించదు. అవుట్‌సోర్సింగ్ ద్వారా నియామకమైన కాంట్రాక్టు లేబర్ డ్రైవర్లు, కండక్టర్లు ఇతరులకు సైతం ఓట్లు వేసే అవకాశం లేదు.
షెడ్యూల్ వివరాలు
తేదీ -కార్యక్రమం
21-09-2026 .. యూనియన్ల నుంచి పోటీకి
అంగీకార పత్రాల సమర్పణ
22-09-2026 .. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
24-09-2026.. అభ్యంతరాల దాఖలు
25-09-2026 .. తుది ఓటర్ల జాబితా విడుదల
26-09-2026… ఎన్నికల గుర్తుల కేటాయింపు
29-09-2026… డమ్మీ బ్యాలెట్ పేపర్ల పంపిణీ
09-10-2026 .. రహస్య బ్యాలెట్ పోలింగ్
14 ,15-10-2026 …. పోస్టల్ బ్యాలెట్
17-10-2026…. ఫలితాల ప్రకటన



