నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వరంగల్ (మామునూరు) విమానాశ్రయానికి సముచితమైన పేరును సూచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఈ ప్రాజెక్టును తమ ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు, కుటుంబ ప్రయోజనాలపైనే దృష్టి సారించిందని, ప్రజలకు అత్యవసరమైన విమానాశ్రయ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం రూ. 295 కోట్లు కేటాయించి, ఆ భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) అప్పగించినట్లు తెలిపారు.
ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉపాధి, పెట్టుబడులకు ఒక నూతన ముఖద్వారమని ఆయన అభివర్ణించారు. అభివృద్ధి చెందుతున్న, అనుసంధానమవుతున్న తెలంగాణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.


