నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాలను నిషేధిస్తూ అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నిరసనకు దిగిన ఉత్సవ సమితి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ట్యాంక్ బండ్ ప్రాంతం రణరంగంగా మారింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ హుస్సేన్ సాగర్లో నిమజ్జనాల కోసం ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద “నిమజ్జనం నిషేధం” అని ఉన్న బ్యానర్లను ఉత్సవ సమితి సభ్యులు చించివేసి, జీహెచ్ఎంసీ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. పరిస్థితి చేయిదాటకుండా చూసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఉత్సవ సమితి నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారులు ఎంఐఎం ఆదేశాల మేరకు రజాకార్ పాలనను అమలు చేస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. నిమజ్జనాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయని పక్షంలో, ఉత్సవ సమితి తరఫున తామే స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను చూసుకుంటామని స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్లో శతాబ్దాలుగా సాగుతున్న గణేష్ నిమజ్జనాలను అడ్డుకోవడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఉత్సవ సమితి మండిపడింది. పోలీసులు, ప్రభుత్వం నిమజ్జన ఊరేగింపును, నిమజ్జనాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా హెచ్చరించింది.



