నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులమని నమ్మించి ముగ్గురు యువకులు ఓ మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ పరిధిలో ఉన్న ఒక పార్కులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. 17 ఏళ్ల బాధిత బాలిక తన స్నేహితుడితో కలిసి కల్కాజీ మందిరాన్ని సందర్శించింది. అనంతరం వారిద్దరూ సమీపంలోని పార్కులో కూర్చున్న సమయంలో పోలీసు దుస్తుల్లో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికి చేరుకున్నారు. తాము పోలీసులమని బెదిరించి, ఆపై బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.



