నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టి.వీణా, మాజీ మంత్రి, వీణా భర్త పి.ఎ.మహ్మద్ రియాజ్‌లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు కొనసాగుతున్నాయి. సిఎంఆర్‌ఎల్ – ఎక్సలాజిక్ ముడుపుల కేసులో యుడిఎఫ్ ప్రభుత్వం విజయన్‌పై కక్షసాధింపు చర్యలకు దిగింది. ఈ కేసులో మంగళవారం పోలీస్ విచారణకు ఆదేశించింది. ‘చట్టపరమైన ఆవశ్యకత’ ప్రభుత్వ నిర్ణయానికి కారణమని హోంమంత్రి రమేష్ చెన్నితాల పేర్కొన్నారు.
‘విజయ్ మదన్‌లాల్ చౌదరి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2) కింద ఈడీ అధికారికంగా అందించే సమాచారంపై సంబంధిత చట్ట అమలు సంస్థలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్ ఇచ్చిన న్యాయ సలహా ప్రకారం కూడా ఈ విషయంలో ప్రభుత్వం లేదా పోలీసులకు మినహాయింపు లేదని తెలిపారు. అయితే, అనుమానిత వాణిజ్య మోసం లేదా అవినీతి కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అనేది ప్రాథమిక విచారణలో గుర్తించదగిన నేరం వెలుగులోకి వచ్చిందా లేదా అనే అంశంపై ఆధారపడి ఉంటుందని 2013లో ‘లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చెన్నితాల పేర్కొన్నారు.
ఈ తీర్పు నేపథ్యంలో, మూడో పక్షం నుంచి నేరారోపణలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఎలాంటి ప్రాథమిక పరిశీలన లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న వాదనకు పరిమితులు ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా వాణిజ్య మోసం, అవినీతి ఆరోపణల విషయంలో ముందుగా ప్రాథమిక విచారణ నిర్వహించి, అందులో గుర్తించదగిన నేరం ఉన్నట్లు తేలితేనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని అన్నారు.తాను రాష్ట్ర ముఖ్యమంత్రి సతీశన్‌తో ఈ అంశంపై చర్చించానని అన్నారు.
ప్రాథమిక విచారణ స్వభావం, దర్యాప్తు సంస్థను నిర్ణయించే బాధ్యతను ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ చీఫ్ (ఎస్‌పిసి)కి అప్పగించిందని అన్నారు. ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తుందని అన్నారు. విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ బ్యూరో (విఎజిబి) లేదా రాష్ట్ర పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఏది విచారణను చేపడుతుందనే విషయాన్ని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ఇది ఎస్‌పిసి పరిధిలోని అంశమని అన్నారు.



