ఉపాధి కూలీలకు వెంటనే పనులు కల్పించాలి: జూకంటి పౌల్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఉపాధి హామీ కూలీలకు తక్షణమే పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలోని ఏసీ రెడ్డి భవన్లో బొమ్మకంటి లక్ష్మీనారాయణ అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూకంటి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేని చోట వెంటనే నియమించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని కోరారు.
మంతపురి సాయిగూడెం తదితర గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పనులు చేసిన కూలీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. సాయిగూడెం గ్రామం ఆలేరు మున్సిపాలిటీలో విలీనమైన అనంతరం గ్రామపంచాయతీగా మారిన నేపథ్యంలో అక్కడి ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని జూకంటి అన్నారు. సాయిగూడెంలో ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసి, అర్హులైన గ్రామ ప్రజలందరికీ జాబ్ కార్డులు అందించాలని కోరారు. అంబేద్కర్ అభయహస్తం పథకం కింద దళిత, గిరిజన కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. గ్రామీణ పేదలకు ఉపాధి, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని అన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు, గ్యార అండాలు, మండల నాయకులు మిట్ట శంకరయ్య, పారుపల్లి సత్తయ్య, చౌడబోయిన అంజయ్య, ఈరసరపు ఆంజనేయులు, ఎర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.



