Wednesday, September 23, 2026
E-PAPER
Homeఆటలుస్వర్ణం సొంతమాయె

స్వర్ణం సొంతమాయె

- Advertisement -

ఫైనల్లో శ్రీలంకపై 
భారత్ ఘన విజయం
ఆసియా క్రీడల 
మహిళల క్రికెట్‌

నాగోయ (జపాన్) : ఆసియా క్రీడల్లో భారత మహిళలు తొలి స్వర్ణం సాధించారు. టీ20 ఫార్మాట్‌లో జరిగిన టోర్నమెంట్‌లో తిరుగులేన విజేతగా నిలిచారు. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై భారత్‌ 147 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. భారత్‌ తొలుత 20 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగులు చేయగా, ఛేదనలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసియా క్రీడల్లో పసిడి పతకం టీమ్‌ ఇండియా అమ్మాయిల సొంతమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు టాప్‌ ఆర్డర్‌ భారీ స్కోరు అందించింది. ఓపెనర్లు స్మృతీ మంధాన (79, 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), షెఫాలీ వర్మ (48, 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిచా ఘోష్‌ (49 నాటౌట్‌, 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. మంధాన ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో అర్థ సెంచరీ బాదింది. షెఫాలీ వర్మ తనదైన శైలిలో మూడేసి సిక్స్‌లు, ఫోర్లతో దండెత్తింది. రిచా ఘోష్‌ డెత్‌ ఓవర్లలో అదిరే ముగింపు అందించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (19, 17 బంతుల్లో 3 ఫోర్లు) నిరాశపరిచింది. భారీ ఛేదనలో శ్రీలంక అమ్మాయిలు చతికిల పడ్డారు. భారత బౌలర్లు దీప్తి శర్మ (3/6), షెఫాలీ వర్మ (2/3), శ్రేయాంక పాటిల్‌ (2/9), శ్రీ చరణి (2/13) వికెట్ల వేటలో విజృంభించారు. దీంతో 15.4 ఓవర్లలోనే శ్రీలంక మహిళలు 69 పరుగులకు ఆలౌటయ్యారు. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (29, 21 బంతుల్లో 5 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన కనబరచలేదు. 147 పరుగులతో భారీ విజయం సాధించిన భారత్‌ స్వర్ణం సొంతం చేసుకోగా.. శ్రీలంక రజత పతకంతో సరిపెట్టుకుంది.

బ్యాడ్మింటన్‌లో పతకం ఖాయం
బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు పతకం ఖాయం చేసింది. మంగళవారం జరిగిన మెన్స్‌ టీమ్‌ ఈవెంట్‌ క్వార్టర్‌ఫైనల్లో ఆతిథ్య జపాన్‌పై 3-0తో భారత్‌ ఘన విజయం సాధించింది. జపాన్‌పై విజయంతో ఆసియా క్రీడల్లో 40 ఏండ్ల తర్వాత మెన్స్‌ జట్టు బ్యాడ్మింటన్‌లో పతకం అందుకోనుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 11-21, 21-5, 21-19తో కొడాయ్‌ నరొకపై గెలుపొంది అదిరే ఆరంభం అందించాడు. డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ 21-18, 24-22తో హోకి, యుగోలపై గెలుపొందారు. రెండో సింగిల్స్‌లో ఆయుష్‌ శెట్టి 21-10, 21-19తో కొకిపై ఖతర్నాక్‌ విజయం సాధించాడు. నేడు సెమీఫైనల్లో అగ్ర జట్టు చైనాతో భారత్‌ తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -