Wednesday, September 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం'ట్రంప్‌ టీవీ'ని చూతము రారండి!

‘ట్రంప్‌ టీవీ’ని చూతము రారండి!

- Advertisement -

అధ్యక్షుడి కార్యక్రమాల కోసం శ్వేతసౌధం సొంత వేదిక
అంతకు ముందు మూడు వార్తా సంస్థలపై అధ్యక్షభవనం నిషేధం
వాటికి మద్దతుగా వైట్‌హౌస్‌ టీవీ పూల్‌ నుంచి వైదొలిగిన ప్రముఖ మీడియా సంస్థలు
దీంతో సొంత ఛానల్‌ను ఏర్పాటు చేసిన శ్వేతసౌధం 


వాషింగ్టన్‌
: అధ్యక్షభవనంలోకి ప్రముఖ మీడియా సంస్థల ప్రవేశాన్ని నిషేధించిన దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా తన పేరిట ఓ కొత్త టీవీ ఛానెల్‌ను ప్రారంభించారు. శ్వేతసౌధం సోమవారం ‘ట్రంప్‌ టీవీ’ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేసింది. దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో చేసిన ప్రసంగాలను, పరిపాలనా సంబంధమైన ప్రకటనలను, తాజా సమాచారాన్ని అందించేందుకు ఈ 24/7 ప్రత్యక్ష వేదిక ఉపయోగపడుతుంది. అంటే ఇది అధ్యక్షుడికి సంబంధించిన సమస్త సమాచారాన్ని వీక్షకులకు అందజేస్తుందన్న మాట. ట్రంప్‌ టీవీ ప్రారంభోత్సవంపై అధ్యక్షభవనం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెడుతూ ‘ఇది ప్రత్యక్ష ప్రసారం. ట్రంప్‌ టీవీ ఇప్పుడు ప్రసారం అవుతోంది. ఇది ప్రతి రోజూ 24 గంటలు పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందజేస్తుంది. గతంలో జరిగిన ఘటనలు, అధ్యక్షుడు చేసిన ప్రసంగాలు, పాలనా సంబంధమైన ప్రకటనలు…ఇలా అనేక గొప్ప విషయాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ మీ టీవీలో ప్రసారం కాలేదు. కానీ ఇప్పుడు అవుతాయి’ అని తెలిపింది. ఈ సందర్భంగా గతంలో ట్రంప్‌ చేసిన ప్రసంగాలను, ఆయన హాజరైన కార్యక్రమాల ఫుటేజీలను అధ్యక్షభవనం ప్రసారం చేసింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమాన్ని కూడా ఇందులో చూపించారు.

దావా వేసిన గంటల వ్యవధిలోనే…
అధ్యక్షభవనం తమను బహిష్కరిం చడంపై సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో వార్తా సంస్థలు న్యాయ పోరాటానికి దిగడంతో శ్వేతసౌధం పరిపాలనా ప్రకటనలు, అధ్యక్షుడి ప్రసంగాలు, ఇతర విషయా లతో కూడిన డిజిటల్‌ వీడియో స్ట్రీమింగ్‌ ‘ట్రంప్‌ టీవీ : ది ఎస్సెన్షియల్స్‌ స్టేషన్‌’ను ప్రారంభించింది. పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను ఈ కొత్త వేదిక ఒక చోటికి తీసుకొస్తుందని, దీనిలోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా పరుస్తామని అధ్యక్షభవనం తన ప్రకటనలో వివరించింది. ఈ స్ట్రీమ్‌ను సోమవారం రాత్రి ఏడు గంటలకు వైట్‌హౌస్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రారంభించారు. అధ్యక్షభవనంలోకి తమను అనుమతించాలంటూ మీడియా సంస్థలు వాషింగ్టన్‌ జిల్లా కోర్టులో దావా వేసిన కొద్ది గంటలలోనే ఇది ప్రారంభమైంది. జర్నలిస్టుల గుర్తింపు పత్రాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆ సంస్థలు వాదించాయి. ‘మా రిపోర్టింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎలాంటి ముందస్తు నోటీసు లేదా ప్రక్రియ లేకుండా వైట్‌హౌస్‌ జర్నలిస్టుల గుర్తింపు పత్రాలను రద్దు చేసింది. దీనిని ప్రశ్నించకుండా వదిలేస్తే పత్రికా స్వేచ్ఛకు, ప్రభుత్వ జోక్యం లేని స్వతంత్ర జర్నలిజాన్ని పొందేందుకు ప్రజలకు ఉన్న హక్కుకు ముప్పు కలుగుతుంది’ అని ధ్వజమెత్తాయి.

ట్రంప్‌ చర్యను నిరసిస్తూ ఏకమైన మీడియా సంస్థలు
వార్తా సంస్థల కవరేజీని విమర్శించిన తర్వాత ట్రంప్‌ ఈ మూడు సంస్థలకు అధ్యక్షభవనంలో ప్రవేశాన్ని నిషేధించారు. ఆ సంస్థల పాత్రికేయులను శనివారం శ్వేతసౌధం ప్రాంగణంలోకి అనుమతించలేదు. అంతేకాదు…వారి గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీఎన్‌ఎన్‌ను దాని షెడ్యూల్డ్‌ టీవీ పూల్‌ నుంచి కూడా తొలగించారు. దీంతో ఏబీసీ, సీబీఎస్‌, ఫాక్స్‌ న్యూస్‌, ఎన్‌బీసీ సంస్థలు కూడా వైట్‌హౌస్‌ టెలివిజన్‌ పూల్‌ నుంచి వైదొలిగాయి. టెలివిజన్‌ పూల్‌ అంటే అధ్యక్షభవనంలో జరిగే కార్యక్రమాల కోసం అన్ని ఛానల్స్‌ తరఫున ఓ మీడియా సంస్థ లైవ్‌ కవరేజీ ఇస్తుంది. ఈ సంస్థ అధ్యక్షుడి కార్యక్రమాలకు సంబంధిం చిన ఉమ్మడి వీడియో కవరేజీని ప్రసార కర్తలు, ఇతర వార్తా సంస్థలకు అంద జేస్తుంది. నిషేధానికి గురైన వార్తా సంస్థ లకు మద్దతుగా ప్రముఖ వార్తా సంస్థలు వైదొలగడంతో పూల్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం ఈ వేదికను ఏర్పాటు చేసింది. తన ప్రభుత్వంపై మీడియా సంస్థలు దావా వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్‌ వాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు కురిపించారు. తనపై ఆ సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయంటూ కన్నెర్ర చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -