Wednesday, September 23, 2026
E-PAPER
Homeక్రైమ్ఢిల్లీలో మరో దారుణం

ఢిల్లీలో మరో దారుణం

- Advertisement -

మైనర్‌పై సామూహిక లైంగికదాడి
పోలీసులమంటూ బాలికపై అఘాయిత్యం కల్కాజీ మందిర్ సమీపంలోని
ఆస్థా కుంజ్ పార్కులో ఘటన

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ మైనర్‌‌పై ఇటీవల జరిగిన లైంగికదాడి ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. పోలీసులమంటూ ముగ్గురు వ్యక్తులు ఓ బాలికను , ఆమె స్నేహితుడిని బెదిరించి బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో సోమవారం రాత్రి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు ఓ నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు వారిపై కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మైనర్లపై జరుగుతున్న అకృత్యాలు, మహిళల భద్రత విషయంలో అక్కడి బీజేపీ సర్కార్‌ ‌పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాధితురాలు తన స్నేహితుడితో కలిసి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కల్కాజీ మందిర్‌కు వెళ్లింది. ఆలయంలో ప్రార్థనలు ముగించుకున్న అనంతరం వారిద్దరూ రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కుకు వెళ్లారు. అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమంటూ బాలిక, ఆమె స్నేహితుడిని నమ్మించారు.

అనంతరం కత్తి, తుపాకీ చూపించి వారిద్దరినీ బెదిరించారు. నిందితులు బాలికను ఆమె స్నేహితుడి నుంచి దూరం చేసి పార్కులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు కలిసి బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వెల్లడించారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. ఈ ఘటనపై రాత్రి సుమారు 8.45 గంటలకు తమకు పీసీఆర్ కాల్ అందిందని, దీంతో పోలీసు సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధిత బాలికను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని పార్కు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

పోలీసులపై మూడు రౌండ్ల కాల్పులు
దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అమర్ కాలనీలోని డీఎం కార్యాలయం వద్ద ఓ నిందితుడు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు పోలీసులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఓ తూటా హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌కు తగిలిందని చెప్పారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైనట్టు తెలిపారు. అనంతరం అతడిని అరెస్టు చేసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ కేసులో ఒక నిందితుడు పోలీసులకు చిక్కగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -